Friday, October 30, 2020

శ్రీ కృష్ణ విజయము - 64

(మల్లరంగ వర్ణన )

10.1-1314-వ.
అంత నా రామకృష్ణులు నలంకృతులై మల్లదుందుభి నినదంబు విని సందర్శన కుతూహలంబున.
10.1-1315-క.
ఓడక రంగద్వారము
జాడం జని వారు కనిరి సమద కువలయా
పీడంబున్ భిన్నపరా
క్రీడంబుం బ్రమదకంటకిత చూడంబున్.

భావము:
అప్పుడు బలరామకృష్ణులు జెట్టీల భేరీనినాదాలు విని అలంకరించుకున్నవారై మల్లరంగం చూడడానికి ఉబలాటంతో రామకృష్ణులు జంకూ గొంకూ లేకుండా రంగస్థలం ప్రవేశ ద్వారం దగ్గరకు వెళ్ళి మదించిన కువలయాపీడమనే పెద్ద ఏనుగును చూసారు. అది ఇతర గజాలను ఓడించడంలో మిక్కిలి నేర్పు కలది. ఆ గజరాజు పెచ్చు మీఱిన మదంతో గగుర్పొడుస్తున్న కుంభస్థలము కలది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=154&padyam=1315

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం :

Thursday, October 29, 2020

శ్రీ కృష్ణ విజయము - 63

( మల్లరంగ వర్ణన )

10.1-1312-మ.
సకలాంభోనిధి మేఖలావహనముం జాలించి యేతెంచు నా
గ కులాగంబుల భంగి నొప్పుచుఁ దగం గైసేసి చాణూర ము
ష్టికకూటుల్ చలకోసలుల్ గురువులన్ సేవించుచున్ రంగధా
త్రికి నేతెంచిరి తూర్యఘోషముల నుద్రేకం బనేకంబుగన్.
10-1313-క.
నందాదులైన గోపకు
లందఱు చని కానుకలు సమర్పించి నృపున్
సందర్శించి తదనుమతిఁ
జెంది మహామంచముల వసించిరి వరుసన్.

భావము:
సమస్త సముద్రాలు సరిహద్దులుగా ఉన్న భూమండలాన్ని మోయడం మానుకుని నడచి వస్తున్న దిగ్గజాలలా, కులపర్వతాలలా ఒప్పుతూ, తగినట్లు అలంకరించుకుని చాణూరుడూ, ముష్టికుడూ, కూటుడూ, చలుడూ, కోసలుడూ తమ గురువులను కొలుస్తూ వాయిస్తున్న వాద్యాల శబ్దాలకు ఉద్రేకం చెలరేగుతుండగా రంగస్థలానికి వచ్చారు. నందుడు మొదలగు గోపాలురు అందరూ వెళ్ళి కంసరాజును దర్శించి, కానుకలు సమర్పించి, అతని అనుమతితో పెద్దపెద్ద ఆసనాల మీద వరుసలు కట్టి కూర్చున్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=154&padyam=1313

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 62

( మల్లరంగ వర్ణన )

10.1-1310-సీ.
పాషాణ వల్మీక పంకాది రహితంబు;
మృదులకాంచననిభ మృణ్మయంబు
గమనీయ కస్తూరికా జలసిక్తంబు;
బద్ధచందనదారు పరివృతంబు
మహనీయ కుసుమదామధ్వజ తోరణ;
మండితోన్నత మంచ మధ్యమంబు
బ్రాహ్మణ క్షత్రాది పౌరకోలాహలం;
బశ్రాంత తూర్యత్రయాంచితంబు
10.1-1310.1-ఆ.
నిర్మలంబు సమము నిష్కంటకంబునై
పుణ్యపురుషు మనముఁ బోలి కంస
సైన్య తుంగ మగుచు సంతుష్ట లోకాంత
రంగమైన మల్లరంగ మొప్పె.
10.1-1311-క.
ఆ మల్లరంగ పరిసర
భూమిస్థిత మంచమందు భోజేంద్రుఁడు మా
న్యామాత్యసంయుతుండై
భూమీశులు గొలువ నుండెఁ బొక్కుచు నధిపా.

భావము:
మహారాజు కంసుడు మల్లయుద్ధానికి సిద్ధం చేయించిన క్రీడాప్రాంగణము రాళ్ళు పుట్టలు బురద మున్నగునవి లేకుండా మెత్తని బంగారువన్నెమట్టితో ఒప్పింది. దానికి కమ్మని కస్తూరి జలంతో కళ్ళాపి జల్లారు. చుట్టూ గంధం కఱ్ఱలతో కంచె అమర్చారు. పెద్ద పెద్ద పూల దండలతో, జండాలతో, తోరణాలతో అలంకరించారు. ఎత్తయిన ఆసనముల మధ్య ఆ రంగం నిర్మించారు. అది బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు పురప్రజల కోలాహలంతో నిండి ఉంది. ఎడతెగకుండా మ్రోగుతున్న వాద్యాల ధ్వనులతో అతిశయించింది. అది పుణ్యపురుషుడి మానసంలా మాలిన్యం లేనిది. సమంగా కంటక రహితమై శోభిల్లేది. అది కంసుడి సైన్యంతో ఉన్నతమై ఒప్పారేది. జనుల మనసులను సంతోషం కలిగించేది. ఆ మల్లరంగానికి దగ్గరలో ఉన్న ఆసనం మీద భోజమహారాజు కంసుడు మాన్యులగు మంత్రులతో కూడి సామంతులు సేవిస్తుండగా భేదపడుతూ కూర్చుని ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=154&padyam=1311

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం :

Tuesday, October 27, 2020

శ్రీ కృష్ణ విజయము - 61

( కంసుడు దుశ్శకునముల్గనుట )

10.1-1304-వ.
మఱియు రక్త కుసుమమాలికాధరుండై యొక్కరుండును నెక్కడేనియుం జనుచున్నవాఁడ నని కలఁ గాంచి మరణహేతుక భీతిం జింతాక్రాంతుండై నిద్రఁజెందక వేగించుచున్న సమయంబున.
10.1-1305-క.
అరుణ హరినఖర విదళిత
గురుతిమిరేభేంద్రకుంభకూట వినిర్ము
క్త రుధిరమౌక్తికముల క్రియ
సురపతిదిశఁ గెంపుతోడఁ జుక్కలు మెఱసెన్.

భావము:
అంతేకాకుండా, ఎఱ్ఱని పూలదండలు ధరించి ఒంటరిగా ఎక్కడికో వెళుతున్నట్లు అతడు కలగన్నాడు, మరణ భయంతో దుఃఖక్రాంతుడై నిదురపోకుండా ఆ రాత్రి ఎలాగో తపిస్తూ జాగరము చేస్తూ ఉండగా అరుణుడు అనే సింహం గోళ్ళతో చీల్చిన చీకటి అనే గజేంద్రుడి కుంభస్థలం నుండి వెలువడిన నెత్తుటితో కలిసిన ముత్యాల వలె తూర్పుదిక్కున ఎఱ్ఱదనంతో నక్షత్రాలు మెరిశాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=152&padyam=1305

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 60

( కంసుడు దుశ్శకునముల్గనుట )

10.1-1302-సీ.
కర్ణరంధ్రములు చేఁ గప్పిన లోపలి-
  ప్రాణ ఘోషము వినఁబడక డిందెఁ
దోయాదికములందుఁ దొంగిచూచుచు నుండ-
  తల గానరాదయ్యెఁ దనువుమీఁదఁ
గరశాఖ నాసికాగ్రంబుపై నిడి చూడ-
  గ్రహతారకలు రెంటఁ గానబడియె
వెలుఁగున నిలుచుండి వీక్షింపఁగా మేని-
  నీడ సరంధ్రమై నేలఁ దోఁచె
10.1-1302.1-ఆ.
నడుగుజాడ దృష్టమౌట లే దయ్యెను
దరువులెల్ల హేమతరువు లగుచు
మెఱయుచుండెఁ గాలమృత్యువు డగ్గఱ
బుద్ధి యెల్లఁ గలఁగె భోజపతికి.
10.1-1303-క.
గరళముఁ దినుటయుఁ బ్రేతము
బరిరంభించుటయు నగ్నభావుఁ డవుటయున్
శిరమునఁ దైలము పడుటయు
ఖరపతి నెక్కుటయు నతఁడు కలలోఁ గనియెన్.

భావము:
భోజరాజు కంసుడికి చేతులతో చెవిరంధ్రాలను మూసుకుంటే తన లోపలి ప్రాణవాయువు శబ్దం వినపడకుండా పోయింది. నీటిలోకానీ అద్దములోకానీ తొంగిచూస్తే శరీరము మీద శిరస్సు కన్పించడం లేదు. వ్రేలు ముక్కుకొనను ఉంచి చూస్తే సూర్యుడు మొదలైన గ్రహాలు అశ్విని మున్నగు నక్షత్రాలు ఒక్కక్కటీ రెండు రెండుగా కనిపించసాగాయి. వెలుతురులో నిలబడి చూస్తే తన దేహం నీడలో ఖాళీలు కనబడసాగాయి. నేల మీద తన అడుగుల గుర్తులు కనబడటం లేదు. చెట్లన్నీ బంగారు వన్నెతో భాసించాయి. కాలమృత్యువు సమీపించి అతని బుద్ధి కలత చెందింది. కంసుడికి కలలో విషం తిన్నట్లు; చనిపోయిన వారిని కౌఁగిలించుకొన్నట్లు; దిగంబరంగా ఉన్నట్లు; తల మీద నూనె పడినట్లు; గాడిద మీద ఎక్కినట్లు అనిపించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=152&padyam=1302

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, October 20, 2020

శ్రీ కృష్ణ విజయము - 59

( కంసుడు దుశ్శకునముల్గనుట )

10.1-1300-క.
ఆ రేయి గోపయుతులై
క్షీరాన్నముఁ గుడిచి రామకృష్ణులు మదిఁ గం
సారంభ మెఱిఁగి యిష్ట వి
హారంబుల నప్రమత్తులై యుండి రిటన్
10.1-1301-క.
తన పురికి రామకృష్ణులు
చనుదెంచి నిజానుచరులఁ జంపుటయు మహా
ధనువుఁ గదిసి విఱుచుటయును
విని కంసుఁడు నిద్రలేక విహ్వలమతియై.

భావము:
రామకృష్ణులు ఆ రాత్రి గోపకులతో కలసి పాలబువ్వ తిని కంసుడి ప్రయత్నాలన్నీ మనసున ఎరిగిన వారై, యథేచ్ఛా విహారాలలో ఆ నగరోపవనంలో జాగరూకతతో ఉండి గడిపారు. కంసుడు తన పట్టణానికి బలరామకృష్ణులు రావటమూ, తన అనుచరులను సంహరించడమూ, అంత గొప్ప ధనుస్సును విరిచివేయడమూ విన్నాడు. అతనికి నిద్రపట్టలేదు మనసు కలతబారింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=152&padyam=1301

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 58

( విల్లు విరుచుట )

10.1-1288-ఉ.
"అద్దిర! రాచవిల్ విఱిచె నర్భకుఁ డింతయు శంకలేక నేఁ
డుద్దవిడిన్ సహింపఁ దగ దుగ్రతఁ బట్టుద" మంచుఁ గ్రుద్దులై
గ్రద్దన లేచి తద్ధనువు కావలివా రరుదేర వారి న
య్యిద్దఱుఁ గూడిఁబట్టి మడియించిరి కార్ముకఖండ హస్తులై.
10.1-1289-వ.
ఇట్లు రామకృష్ణులు మథురాపురంబున విహరించి వెడలి విడిదులకుం జని; రంత.

భావము:
ఆ ధనుస్సు కాపాలా కాస్తున్న వీరులు “ఆశ్చర్యం! ఏ మాత్రం సందేహించకుండా ఈ పిల్లాడు శౌర్యంతో ఇప్పుడు రాజుగారి ధనుస్సు గొబ్బున ఖండించాడు. ఇది సహింపరాని సాహస కార్యం. మనం పౌరుషం చూపి ఇతగాడి పని పట్టాలి” అంటూ కోపోద్రేకంతో చటుక్కున లేచి, అతడి మీదకి వచ్చారు. అంతట రామకృష్ణులు ఇద్దరూ కలిసి ఆ విరిగిన విల్లు ముక్కలను చేతులలోకి తీసుకుని, వారిని పట్టి కొట్టి మట్టుపెట్టారు. అలా బలరామకృష్ణులు మధురానగరంలో విహారం చేసారు. అక్కడ నుండి బయలుదేరి తాము విడిది దిగిన తావులకు వెళ్ళిపోయారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=149&padyam=1288

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, October 18, 2020

శ్రీ కృష్ణ విజయము - 56

( విల్లు విరుచుట )

10.1-1284-క.
సురరాజు వింటికైవడి
గురుతరమై భూరివీరగుప్తంబై దు
స్తరమైన విల్లు పొడగని
నరులు వల దనంగ బిట్టు నగి వికసితుఁడై.
10.1-1285-శా.
బంధుల్ మేలన వామహస్తమునఁ జాపం బెత్తి మౌర్వీలతా
సంధానం బొనరించి కొంచెపుఁదెగన్ శబ్దించుచున్ ధీరతా
సింధుం డా హరి దాని ఖండితముగాఁ జేసెన్ జనుల్ చూడగా
గంధేభంబు రసాలదండము నొగిన్ ఖండించు చందంబునన్.

భావము:
దేవేంద్రుడి ధనుస్సు వలె మిక్కిలి గొప్పదైనది. మేటి వీరులచే రక్షింపబడుతున్నది, పట్టరాని అయిన ఆ ధనుస్సును కృష్ణుడు చూసాడు. రక్షకులు వద్దంటుంటే విప్పారిన మోముతో పక్కున నవ్వి సముద్రమంత ధైర్యము కల శ్రీకృష్ణుడు తన చుట్టాలు మెచ్చుకునేలా, ఎడమచేత్తో ధనుస్సును పైకెత్తాడు. అల్లెత్రాడు తగిలించాడు. మెల్లగా నారిని మోగిస్తూ, మదపుటేనుగు చెరకుగడను విరిచినంత సుళువుగా జనులు అందరూ చూస్తుండగా దానిని విరిచేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=149&padyam=1285

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 57

( విల్లు విరుచుట )

10.1-1286-క.
కోదండభగ్ననిర్గత
నాదము వీనులకు భీషణం బై యాశా
రోదోంతరములు నిండుచు
భేదించెన్ భోజవిభుని బింకము నధిపా!
10.1-1287-వ.
అప్పుడు.

భావము:
ఓ పరీక్షన్మహారాజా! ధనుస్సు విరిగినప్పుడు పుట్టిన ఆ చప్పుడు చెవులకు భీతిగొలుపుతూ దిగంతాలను నింపేస్తోంది. ఆ ధ్వనికి భోజరాజు కంసుడి ధైర్యం చెదిరిపోయింది. అలా కృష్ణుడు ఆ ధనుస్సుని విరగొట్టగానే....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=149&padyam=1286

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :


Thursday, October 15, 2020

శ్రీ కృష్ణ విజయము - 55

( కుబ్జననుగ్రహించుట )

10.1-1282-క.
కామిని తిగిచినఁ గృష్ణుఁడు
రాముని వీక్షించి నగుచు "రాజానన! మ
త్కామితముఁ దీర్చి పిదపన్
నీ మందిరమునకు వత్తు నే డలుగకుమీ!"
10.1-1283-వ.
అని వీడుకొలిపి కృష్ణుండు విపణిమార్గంబునం జనిచని తాంబూల మాలికాగంధంబులును బహువిధంబు లయిన కానుకలు పౌరు లిచ్చినఁ బరిగ్రహించుచు ధనుశ్శాల కరిగి యందు.

భావము:
ఆ మదవతి తనను అలా లాగగా కృష్ణుడు బలరాముడిని చూసి నవ్వి, ఆమెతో ఇలా అన్నాడు “ఓ చంద్రముఖీ! నేను వచ్చిన పని సాధించిన తరువాత నీ ఇంటికి వస్తాను. ఇప్పటికి కోపించబోకు.” కృష్ణుడు ఇలా అంటూ ఆమెను సాగనంపాడు. తరువాత బజారు వీధమ్మట వెళ్ళి వెళ్ళి, పురప్రజలు ఇచ్చిన తాంబూలాలు, పూలదండలు, చందనములు, ఇంకా అనేక రకాల కానుకలను స్వీకరిస్తూ ధనుశ్శాల దగ్గరకి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=148&padyam=1283

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 54

( కుబ్జననుగ్రహించుట )

10.1-1280-సీ.
ఇవ్విధంబునఁ గుబ్జ యిచ్చిన లేపంబు-
  లన్నియుఁ దాను దేహమున నలఁది
కొని ప్రసన్నత నొంది కుబ్జ మువ్వంకల-
  యొడలు చక్కఁగ నొత్తి యునుపఁ దలఁచి
తత్పదంబుల మీఁదఁ దన పదంబులు ద్రొక్కి-
  హస్తాంగుళద్వయ మబల గవుద 
క్రింద విప్పుగ నిడి కృష్ణుఁడు మీఁదికి-
  నెత్తఁగ వక్రత లెల్ల మాని
10.1-1280.1-ఆ.
చక్కనైన చిత్తజన్ముబాణము క్రియఁ
గొమరుమిగిలి పిఱుఁదుఁ గుచయుగంబు
సొంపుఁ జేయఁ దరుణి సుందరమూర్తి యై
కమలనయనుఁ జూచి కాంక్షతోడ.
10.1-1281-క.
"వేంచేయుము నా యింటికిఁ
బంచశరాకార"! యనుచుఁ బైకొం గాక
ర్షించి హరిఁ దిగిచెఁ గామిని
పంచాశుగబాణజాల భగ్నహృదయయై.

భావము:
ఇలా కుబ్జ ఇచ్చిన మైపూతలు అన్నీ కృష్ణుడు తన వంటి నిండా రాసుకుని ప్రసన్నుడయ్యాడు. మువ్వంపులు గల దాని దేహాన్ని చక్కనొత్తి ఆమెను అనుగ్రహంచ దలచాడు. దాని పాదాల మీద తన పాదాలు వేసి త్రొక్కిపట్టాడు. తన చేతి రెండు వేళ్ళను దాని గడ్డము క్రింద పెట్టి దేహము చక్కగా సాగేలా పైకెత్తాడు. అంతే ఆమె వంపులు తీరి మన్మథుడి సమ్మోహనాస్త్రం అన్నంత అందగత్తె అయిపోయింది. పిరుదులు, చనుగవ సొంపు మీరగా, కుబ్జ చక్కని చుక్క అయింది. ఆమె కమలాక్షుడి వైపు కాంక్షతో చూసి మదనుని బాణాలు తాకి కుబ్జ హృదయం చెదిరింది. కృష్ణుడిని కామిస్తున్న, ఆ కామిని “మన్మథాకారా! నా ఇంటికి దయ చెయ్యి” అంటూ అతడి కండువా చెంగు పట్టుకుని లాగుతూ పిలిచింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=148&padyam=1280

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, October 11, 2020

శ్రీ కృష్ణ విజయము - 53

( కుబ్జననుగ్రహించుట )

10.1-1278-ఉ.
"చక్కనివాఁడ వౌదు; సరసంబుల నొంపకు; మెల్లవారికిం
జక్కఁదనంబు లెక్కడివి; చారుశరీర! త్రివక్ర యండ్రు; నే
నిక్కము కంసుదాసిని; వినిర్మల లేపన విద్యదాన; నన్
మిక్కిలి రాజుమెచ్చుఁ; దగ మీరు విలేపనముల్ ధరింపరే!"
10.1-1279-క.
అని పలికి యా కుమారుల
తనువులు నగవులును వీక్షితమ్ములు మాటల్
తన చిత్తముఁ గరఁగించిన
ననులేపము లిచ్చె వారి కబల ప్రియముతోన్.

భావము:
“ఓ సుందరాంగుడా! నీవు బలే అందగాడివేలే కానీ, సరసాలతో నన్ను వేధించకు. అందరికీ అందాలు ఎక్కడ నుంచి వస్తాయి? త్రివిక్ర అంటారు నన్ను. నేను కంసుడి దాసిని. స్వచ్ఛమైన మైపూతలు చేయుట తెలిసినదానిని. నన్ను రాజు ఎంతో మెచ్చుకుంటూ ఉంటాడు. మీరు ఈ విలేపనాలు చక్కగా రాసుకోండి.” ఆ పడచువారైన బలరామకృష్ణుల చక్కటి స్వరూపాలు, నవ్వులు, చూపులు, మాటలు తన మనస్సును కరగించగా, ఆ కుబ్జ ప్రేమతో ఇలా అంటూ వారికి మైపూతలు ఇచ్చింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=148&padyam=1279

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 52

( కుబ్జననుగ్రహించుట )

10.1-1274-క.
ఆ నళినాక్షుఁడు గాంచెను
నానా లేపముల భాజనముఁ జేఁగొనుచుం
బూని చనుదెంచు దానిని
నానన రుచి నిచయ వినమితాబ్జం గుబ్జన్.
10.1-1275-వ.
కని యిట్లనియె.
10.1-1276-క.
"ఎవ్వరిదానవు? లేపము
లెవ్వరికిం గోరికొనుచు నేగెదు? నీ పే
రెవ్వరు మా కి మ్మిన్నియు
నివ్వటిలెదు చక్కనగుచు నీరజనేత్రా!"
10.1-1277-వ.
అనిన న య్యబల యిట్లనియె.

భావము:
అలా రాచవీథిని వెళ్తున్న, కమలముల వంటి కన్నులు కల కన్నయ్య రకరకాల మైపూతలు గల పాత్ర పట్టుకుని వస్తున్న కుబ్జను చూసాడు. అప్పుడు ఆమె ముఖము ముందు పద్మం తలవంచుకునే టంత కాంతివంతంగా వెలిగిపోతోంది. అలా వెలిగిపోతున్న ముఖంతో ఎదురు వచ్చిన కుబ్జను చూసి కృష్ణుడు ఇలా అన్నాడు. “ఓ పద్మాక్షీ! నీ వెవరి దానివి? ఈ పూతలు ఎవరి కోసము తీసుకువెళ్తున్నావు? నీ పేరేమిటి? ఈ లేపనము లన్నీ మాకియ్యి. నీవు చక్కనిదాని వయ్యి ప్రకాశిస్తావులే. కృష్ణుడి మాటలు విని, ఆ ముదిత ఇలా అంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=148&padyam=1276

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, October 8, 2020

శ్రీ కృష్ణ విజయము - 51

( సుదాముని మాలలు గైకొనుట )

10.1-1272-క.
"నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయునుఁ
దాపసమందార! నాకు దయచేయఁ గదే!"
10.1-1273-వ.
అని వేఁడికొనిన నిచ్చి మఱియు మాధవుం డమ్మాలికునకు బలాయుః కాంతి కీర్తి సంపద లొసంగి వాని గృహంబు వెడలి రాజవీధిం జనిచని.

భావము:
తాపసులకు కల్పవృక్షం వంటివాడా! శ్రీకృష్ణా! కమలముల వంటి నీ పాదాల పరిచర్యను, నీ పాదాలు పూజించే భక్తులతో చెలిమినీ, సర్వ ప్రాణులమీద అపరిమితమైన దయనూ నాకు ప్రసాదించు. సుదాముడికి అలా వేడుకున్నవన్నీ శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు. ఆ పైన బలము, ఆయుష్షు, తేజస్సు, యశస్సు, సిరిసంపదలు కరుణించి వాడి ఇంటి నుండి బలరాముడుతో కలిసి బయలుదేరి రాజవీధమ్మట వెళ్తూ వెళ్తూ. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=147&padyam=1273

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 50

( సుదాముని మాలలు గైకొనుట )

10.1-1270-క.
దామోదర రాముల కు
ద్దామ యశోహసిత తుహినధాములకు వధూ
కాములకుఁ దెచ్చి యిచ్చె సు
దాముఁడు ఘనసురభి కుసుమదామము లధిపా!
10.1-1271-క.
వారును మాలికుఁ డిచ్చిన
భూరి కుసుమ దామములను భూషితులై నీ
కోరిన వరమిచ్చెద మని
కారుణ్యము సేయ నతఁడు గని యిట్లనియెన్.

భావము:
చంద్రుడిని సైతం అపహసించగల అతిశయించిన కీర్తి గలవారూ, మగువల పాలిటి మన్మథాకారులూ అయిన ఆ రామకృష్ణులకు సుదాముడు గొప్ప పరిమళములు గల పూలమాలలు సమర్పించాడు. సుదాముడు ఇచ్చిన ఆ పెద్ద పెద్ద దండలను రామకృష్ణులు అలంకరించుకుని “నీవు కోరిన వరమిస్తాము. ఏమి వరం కావాలో కోరుకో” అని దయతో అనుగ్రహించారు. అతడు అది గ్రహించి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=147&padyam=1271

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, October 6, 2020

శ్రీ కృష్ణ విజయము - 49

( సుదాముని మాలలు గైకొనుట )

10.1-1267-వ.
అంత నా రామకృష్ణులు సుదాముం డను మాలాకారు గృహంబునకుం జనిన; నతండు గని లేచి గ్రక్కున మ్రొక్కి చక్కన నర్ఘ్య పాద్యాదికంబు లాచరించి; సానుచరు లయిన వారలకుఁ దాంబూల కుసుమ గంధంబు లొసంగి యిట్లనియె.
10.1-1268-ఉ.
"పావన మయ్యె నా కులము; పండెఁ దపంబు; గృహంబు లక్ష్మికిన్
సేవిత మయ్యె; నిష్ఠములు సేకుఱె; విశ్వనిదానమూర్తులై
భూవలయంబుఁ గావ నిటు పుట్టిన మీరలు రాకఁ జేసి నే
నే విధ మాచరింతుఁ? బను లెయ్యెవి? బంట; నెఱుంగఁ జెప్పరే."
10.1-1269-వ.
అని పలికి.

భావము:
ఆ తరువాత, రామకృష్ణులు పూలదండలు కట్టే సుదాముడి ఇంటికి వెళ్ళారు. అతడు వారిని చూసి వెంటనే లేచి నమస్కరించాడు. చక్కగా ఆర్ఘ్యము, పాద్యము, మొదలైన విధులతో సత్కరించాడు. రామకృష్ణులకూ, వారి వెంట వచ్చినవారికీ తాంబూలములు, పూలు, గంధములు ఇచ్చి ఇలా అన్నాడు. “జగత్తుకు ఆదికారణమూర్తులైన మీరు భూలోకాన్ని సంరక్షించడం కోసం ఇలా అవతరించారు. అటువంటి మీరాక వలన మా వంశం పవిత్రమయింది. నా తపస్సు ఫలించింది. నా ఇల్లు సిరిసంపదలతో నిండింది. నా కోరికలు ఈడేరాయి. నేను ఏ విధంగా నడచుకోవాలి? ఏం పనులు చెయ్యాలి? నేను మీ బంటును. సెలవియ్యండి.” ఇలా అని ఆ మాలాకారుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=147&padyam=1268

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 48

( రజకునివద్ద వస్త్రముల్గొనుట )

10.1-1265-క.
అంతట నొక వాయకుఁ డా
క్రంతన్ వసుదేవసుతులఁ గని బహువర్ణా
త్యంతమృదు పటాభరణము
లెంతయు సంతసముతోడ నిచ్చెన్ మెచ్చన్.
10.1-1266-శా.
కారుణ్యంబున వానిఁ గైకొని యలంకారంబు గావించి శృం
గారోదంచిత దిగ్గజేంద్ర కలభాకారంబులం బొల్చి రా
శూరుల్; మాధవుఁ డంత వాయకుని శుశ్రూషన్ మహాప్రీతుఁడై
సారూప్యంబును లక్ష్మియు న్నొసఁగె నైశ్వర్యాది సంధాయియై. 

భావము:
అటు పిమ్మట ఆ దారిలో వస్తున్న ఒక నేతపనివాడు వసుదేవుడి కుమారులైన రామకృష్ణులను చూసి వారు మెచ్చుకొనేలా మిక్కిలి మెత్తనైన రంగు రంగుల వస్త్రాభరణాలను పరమ సంతోషంతో ఇచ్చాడు. శూరులైన రామకృష్ణులు ఆ వస్త్రాభరణాలను దయతో స్వీకరించి అలంకరించుకుని సింగారింపబడిన దిగ్గజాల గున్నల మాదిరి అందగించారు. పిమ్మట కృష్ణుడు ఆ నేతపనివాడి పరిచర్యకు మిక్కిలి సంతుష్టుడు అయ్యాడు. వాడికి సకల ఐశ్వర్యాలను అనుగ్రహించి, తన సారూప్యమును సంపత్తినీ ప్రసాదించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=145&padyam=1266

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, October 5, 2020

శ్రీ కృష్ణ విజయము - 47

( రజకునివద్ద వస్త్రముల్గొనుట )

10.1-1263-క.
ఘోర కరాగ్రతలంబున
ధీరుఁడు కృష్ణుండు శిరము దెగిపడఁ గొట్టెం
బౌరుల గుండెలు పగులఁగ
వీరోద్రేకిన్ మదావివేకిన్ జాకిన్.
10.1-1264-వ.
అంత భగ్నశిరుం డైన రజకుం జూచి వానివారలు వెఱచి పటంబులు డించి పఱచిన రామకృష్ణులు వలసిన వస్త్రంబులు ధరియించి కొన్ని గోపకుల కొసంగి చనుచుండ.

భావము:
ఆ రజకుడు అలా బీరంతో రెచ్చిపోవడంతో, పొగరుబోతుతనంతో తెలివితప్పి మెలగడంతో, భయంకర మైన తన అరచేత్తో ధీరుడైన శ్రీకృష్ణుడు తల తెగిపడేలా కొట్టాడు. అది చూసిన నగరంలోని ప్రజల గుండెలు పగిలిపోయాయి. అలా నేలకూలిన రజకుని చూసిన వాడి మనుషులు బట్టలు అక్కడే వదిలేసి భయంతో పారిపోయారు. అప్పుడు బలరాముడు కృష్ణుడు తమకు కావలసిన బట్టలు కట్టుకుని, కొన్ని గోపకుల కిచ్చి ముందుకుసాగారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=145&padyam=1264

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 46

( రజకునివద్ద వస్త్రముల్గొనుట )

10.1-1260-శా.
"ఎట్టెట్రా? మనుజేంద్రు చేలములు మీ కీఁ బాడియే? మీరలుం
గట్టం బోలుదురే? పయో ఘృత దధి గ్రాసంబులన్ మత్తులై
యిట్టాడం జనెఁగాక గొల్లలకు మీ కెబ్బంగి నోరాడెడిన్; 
గట్టా! ప్రాణముఁ గోలుపోయెదు సుమీ కంసోద్ధతిన్ బాలకా!
10.1-1261-క.
మా రాజుసొమ్ముఁ గైకొన
నే రాజులు వెఱతు; రింత యెల్లిదమే; నీ
కీ రాజరాజగృహమున
నీ రాజసమేల? గొల్ల! యేగుము తలఁగన్."
10.1-1262-వ.
అనిన విని రోషించి.

భావము:
ఎలాగెలారా? ఒరే కుఱ్ఱాడా! మహారాజు బట్టలా? మీకివ్వచ్చుట్రా? ఇలాంటి బట్టలు మీరు కట్టగలరుట్రా? పాలు నెయ్యి పెరుగులు మెక్కి తలకొవ్వెక్కి ఇలా కూశారుగాని. లేకపోతే గొల్లపిల్లలకు మీకు ఇలాంటి మాటలు నోటికెలా వస్తాయి? అయ్యబాబోయ్! కంసమహారాజు గారి ఆవేశానికి ప్రాణాలు పోగొట్టుకుంటారురోయ్! ఓ గొల్లపిల్లవాడా! మా రాజుగారి సొమ్ము ముట్టుకోడానికి ఎంతటి రాజులైనా భయపడతారు. నీ కంతా వేళాకోళంగా ఉందేం! రాజులకు రాజైన ఈ కంసుని రాజ్యంలో నీ కింత రాజసమా దూరంగా తొలగిపో.” ఆ రజకుని మాటలకు గోపాల కృష్ణుడు మిక్కిలి కోపగించి. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=145&padyam=1261

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, October 4, 2020

శ్రీ కృష్ణ విజయము - 44

( కృష్ణుడు మథురను గనుట )

10.1-1254-క.
అని మఱియుఁ బౌరకాంతలు
మునుకొని హరిరూపు నేత్రముల వెంటను లోఁ
గొని తాల్చిరి హృదయములను
జనితప్రమదమున విరులు సల్లుచు నధిపా!
10.1-1255-వ.
మఱియును.
10.1-1256-క.
నానావిధ గంధములు ప్ర
సూనఫలాదులును హరితశుభలాజములుం
గానుక లిచ్చుచు విప్రులు
మానుగఁ బూజించి రా కుమారోత్తములన్.

భావము:
అంటూ ఓ పరీక్షన్మహారాజా! ఆ నగర వనితలు సంతోషంతో పూలు జల్లుతూ, అదేపనిగా ఆయన రూపాన్ని కళ్ళతో ఆస్వాదిస్తూ, తమ హృదయములలో కృష్ణుడి రూపాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ఇంకా ఆ మధురానగరంలోని బ్రాహ్మణులు అనేక రకాల సువాసన ద్రవ్యాలు, పూలు, పండ్లు మున్నగువాటిని; శుభకరములైన పచ్చని అక్షతలనూ కానుకలుగా ఇస్తూ ఉత్తములైన ఆ వసుదేవకుమారులను ఉత్సాహంగా పూజించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=144&padyam=1256

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 45

( రజకునివద్ద వస్త్రముల్గొనుట )

10.1-1257-వ.
ఆ సమయంబున నగరద్వారంబున నుండి వచ్చు రాగకారుం డగు నొక్క రజకునిం గాంచి హరి యిట్లనియె.
10.1-1258-ఉ.
"విందులమై నరేశ్వరుని వీటికి వచ్చితి మేము; మాకు మా
మందలలోనఁ గట్టికొన మంచి పటంబులు లేవు; నీ ముడిన్
సుందరధౌత చేలములు శోభిలుచున్నవి; తెమ్ము నిన్ను మే
లందెడు; నిమ్ము రాజుదెస నల్లుర; మో! రజకాన్వయాగ్రణీ!"
10.1-1259-వ.
అనిన రోషించి వాఁ డిట్లనియె.

భావము:
ఆ సమయంలో నగరము వాకిటి నుండి వస్తున్న రంగులు వేసే (రాగకారుడు అనగా ధూర్తుడు అని కూడ అర్థం ఉంది) ఒక రజకుని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “ఓ రజకకులశ్రేష్ఠా! మేము రాచనగరికి అతిథులుగా వచ్చాము. మాకు మా పల్లెలో ధరించడానికి మంచి బట్టలు లేవు. నీ మూటలో ఉతికిన అందమైన బట్టలు ఉన్నాయి. మేము రాజుగారికి అల్లుళ్ళం. ఆ వస్త్రాలు మాకు ఇచ్చేయ్యి. నీకు మేలు కలుగుతుంది.” అలా బట్టలు ఇమ్మని శ్రీకృష్ణుడు అడగటంతో, ఆ ఆస్థాన రజకుడు ఎంతో కోపంచేసుకుని ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=145&padyam=1258

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, October 1, 2020

శ్రీ కృష్ణ విజయము - 42


( కృష్ణుడు మథురను గనుట )

10.1-1250-వ.
అని మఱియు గోవింద సందర్శన కుతూహలంబునం బౌరసుందరులు పరస్పరాహూయమానలై భుంజానలై భోజన భాజనంబులు దలంగఁ ద్రోచియు, శయానలై లేచియు, నభ్యంజ్యమానలై జలంబులాడకయు, గురుజనశిక్ష్యమాణలై యోడకయు, గృహకార్య ప్రవర్తమానలై పరిభ్రమింపకయు, రమణరమమాణలై రమింపకయు, శిశుజన బిభ్రాణలై డించియు నలంకుర్వాణలై యన్యోన్య వస్త్రాభరణ మాల్యానులేపనంబులు వీడ్వడ ధరించియు నరిగి.
10.1-1251-క.
వీటఁ గల చేడె లెల్లను
హాటకమణిఘటిత తుంగ హర్మ్యాగ్రములం
గూటువలు గొనుచుఁ జూచిరి
పాటించి విశాలవక్షుఁ బద్మదళాక్షున్.

భావము:
అంటూ ఆ మథురానగర కాంతలు శ్రీకృష్ణుని చూడాలనే ఆసక్తి తోకూడిన తొందరలో ఒకరినొకరు పిలుచుకుంటూ, భోజనాలు చేసి, భోజనపాత్రలను మూలకి తోసేసి, పడుకుని లేచి, తలంటుస్నానాలుచేసి చేయక, పెద్దలు వారిస్తున్నా వినిపించుకోకుండా, ఇంటి పనులలో నిమగ్నలై మెసలకుండా, భర్తలను సేవించడంలో మనసు లగ్నం చేయకుండా, ఎత్తుకున్న బిడ్డలను దింపేసి, ఒండొరుల బట్టలు, ఆభరణాలు, పువ్వులు, గంధాలు అలంకారాలు చేసేసుకుని, అవి జారిపోతున్నా లెక్కచేయకుండా బయలుదేరిపోయారు. అలా కృష్ణసందర్శన వాంఛా తొందరలలో, ఆ పట్టణంలో ఉండే పడతులు అందరూ రత్నాలు, కూర్చిన ఎత్తయిన బంగారు మేడలపై గుంపులు గూడి, విశాలమైన వక్షము కలవాడూ తామరరేకుల వంటి కన్నులు కలవాడూ అయిన శ్రీకృష్ణుణ్ణి వీక్షించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=144&padyam=1251

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 43

( కృష్ణుడు మథురను గనుట )

10.1-1252-సీ.
"వీఁడఁటే రక్కసి విగతజీవగఁ జన్నుఁ-
  బాలు ద్రావిన మేటిబాలకుండు; 
వీఁడఁటే నందుని వెలఁదికి జగమెల్ల-
  ముఖమందుఁ జూపిన ముద్దులాఁడు; 
వీఁడఁటే మందలో వెన్నలు దొంగిలి-
  దర్పించి మెక్కిన దాఁపరీఁడు; 
వీఁడఁటే యెలయించి వ్రేతల మానంబు-
  చూఱలాడిన లోకసుందరుండు;
10.1-1252.1-తే.
వీఁడు లేకున్న పుర మటవీస్థలంబు
వీనిఁ బొందని జన్మంబు విగత ఫలము
వీనిఁ బలుకని వచనంబు విహగ రుతము
వీనిఁ జూడని చూడ్కులు వృథలు వృథలు;
10.1-1253-మ.
చెలియా! గోపిక లీ కుమారతిలకుం జింతించుచుం బాడుచుం
గలయం బల్కుచు నంటుచున్ నగుచు నాకర్షించుచున్ హస్తగా
మలకక్రీడకుఁ దెచ్చి నిచ్చలును సమ్మానంబులం బొందఁగాఁ
దొలి జన్మంబుల నేమి నోఁచిరొ కదే దుర్గప్రదేశంబులన్?"

భావము:
“రాకాసి పూతన ప్రాణాలు తోడేసేలా స్తన్యపానం చేసిన అసాధ్యపు అర్భకుడు వీడేనటే; నందుని ఇల్లాలికి తన నోట్లో విశ్వమంతా చూపించిన ముద్దుబిడ్డడు వీడేనటే; మందలో వెన్నలు అన్నీ దర్పంగా దొంగిలించి భక్షించిన దొంగ వీడే నటే; గొల్లకన్నెల మనసుల ఆసక్తి రగిల్చి మానాలను కొల్లగొట్టిన భువనైక సుందరుడు వీడేనటే; ఇతడు లేని ఊరు ఉత్త అరణ్యమేలే; ఇతడిని కలియని జన్మ మెందుకూ పనికిరానిదేనే; ఇతడిని పలకరించని పలుకు పక్షి కూతలేనే; ఇతడిని దర్శంచని చూపులు వట్టి వ్యర్ధములేనే. ఓ చెలీ! బాలక శ్రేష్ఠుడైన ఈ కృష్ణుడిని గోపకన్యలు నిత్యం ధ్యానిస్తూ, కీర్తిస్తూ, చేతిలో ఉసిరికాయ ఆట వంకతో పిలిచి తాకుతూ, పిలుస్తూ, సంభాషిస్తూ, నవ్వుతూ, లాలిస్తూ ఆనందిస్తుంటారు. ఇంతటి ఆదరాన్ని అందుకోడానికి పూర్వజన్మలలో చేరలేని ఏ చోటులకు చేరి, ఎంతటి నోములు నోచారో కదా”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=144&padyam=1252

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :