Thursday, May 30, 2019

కపిల దేవహూతి సంవాదం - 27:

3-903-వ.
మఱియు; విరాట్పురుషు నం దుదయించిన వ్యష్టిరూపంబు లగు నాకాశాది భూతంబులును శబ్దంబు మొదలగు భూతతన్మాత్రంబులును వాగాదీంద్రియ జాతంబును దదధిదేవతలును దమంతన సమిష్టిరూపుం డగు క్షేత్రజ్ఞుం బ్రవృత్తి ప్రవక్తకుం జేయ నసమర్థంబు లయ్యె; ఎట్లనిన దేవాధిష్ఠితంబు లగు నింద్రియంబులు దాము వేర్వేఱ యయ్యీశ్వరుం బ్రవృత్తున్ముఖుం జేయనోపక క్రమంబునం దత్తదధిష్ఠానాదుల నొందె; అందు నగ్ని వాగింద్రియంబుతోడ ముఖంబు నొంది ప్రవర్తించిన విరాట్కార్యం బగు వ్యష్టి శరీరజాతం బనుత్పన్నం బయ్యె; అంత నాసయు ఘ్రాణేంద్రియంబుతోడ వాయువుం గూడిన నట్టిది యయ్యె; నాదిత్యుఁడు చక్షురింద్రియంబుతోడ నేత్రంబులు నొందిన వృథాభూతం బయ్యె; దిగ్దేవతాకం బగు కర్ణంబు శ్రోత్రేంద్రియంబుతోఁ గూడిన విరాట్కార్య ప్రేరణాయోగ్యం బయ్యె ఓషధులు రోమంబులం ద్వగింద్రియంబుఁ జెంది విఫలం బయ్యె; అద్దైవం బగు మేఢ్రంబు రేతంబు నొందినఁ దత్కార్యకరణాదక్షం బయ్యెఁ; బదంపడి గుదంబు మృత్యువు తోడ నపానేంద్రియంబుఁ జేరిన నది హైన్యంబు నొందె; విష్ణు దేవతాకంబు లగు చరణంబులు గతితోఁ గూడిన ననీశ్వరంబు లయ్యెఁ; బాణీంద్రియంబు లింద్రదైవతంబు లగుచు బలంబు నొందిన శక్తిహీనంబు లయ్యె; మఱియు నాడులు సనదీకంబులై లోహితంబు వొందిన నిరర్థకంబు లయ్యె; నుదరంబు సింధువుల తోడఁ జేరి క్షుత్పి పాసలం బొందిన వ్యర్థం బయ్యె; హృదయంబు మనంబు తోడం జంద్రు నొందిన నూరక యుండె; బుద్ధి బ్రహ్మాది దైవతంబై హృదయంబు నొందిన నిష్ఫలం బయ్యెఁ జిత్తం బభిమానంబుతో రుద్రునిం జెందిన విరాట్కార్య జాతం బనుభూతం బయ్యె; నంతఁ జైత్యుం డగు క్షేత్రజ్ఞుండు హృదయాధిష్ఠానంబు నొంది చిత్తంబు తోడం బ్రవేశించిన విరాట్పురుషుండు సలిల కార్యభూత బ్రహ్మాండంబు నొంది ప్రవృత్యున్ముఖక్షముం డయ్యె; సుప్తుం డగు పురుషునిం బ్రాణాదులు దమ బలంబుచే భగవదప్రేరితంబు లగుచు నుత్థాపనా సమర్థంబు లగు చందంబున నగ్న్యాదులు స్వాధిష్ఠాన భూతంబు లగు నిద్రియంబులతోడ దేవాది శరీరంబుల నొందియు నశక్తంబు లయ్యె" అని మఱియు "నవ్విరాట్పురుషుని ననవరతభక్తిం జేసి విరక్తులై యాత్మల యందు వివేకంబు గల మహాత్ములు చింతింపుదు రనియుఁ బ్రకృతిపురుష వివేకంబున మోక్షంబును బ్రకృతి సంబంధంబున సంసారంబును గలుగు" ననియుఁ జెప్పి మఱియు నిట్లనియె.

భావము:
ఇంకా విరాట్పురుషునిలో జన్మించిన ఆకాశం మొదలైన పంచభూతాలూ, శబ్దం మొదలైన పంచతన్మాత్రలూ, వాక్కు మొదలైన ఇంద్రియాలూ, ఆ ఇంద్రియాల అధిదేవతలూ వేరువేరుగా ఉండిపోయాయి. అవి తమలో తాము సమైక్యం పొందనందువల్ల జీవుణ్ణి ప్రవర్తింపజేయలేక పోయాయి. ఆ యా దేవతలు అధిష్ఠించిన ఇంద్రియాలు, తాము ప్రత్యేకంగా క్షేత్రజ్ఞుని లోకవ్యవహారానికి ప్రేరేపింపజాలక వరుసగా ఆయా స్థానాలలో ఉండిపోయాయి. విరాట్పురుషుని ముఖాన అగ్ని వాగింద్రియంతో కూడి వర్తించి నప్పటికీ విరాట్పురుషుని కార్యమైన ఇతరేతర జీవుల శరీరోత్పత్తి కలుగలేదు. అట్లే విరాట్పురుషుని నాసికలో వాయువు జ్ఞానేంద్రియంతో వర్తించినప్పటికీ జీవోత్పత్తి కాలేదు. అదే విధంగా కన్నులలో సూర్యుడు చక్షురింద్రియంతో కూడి వర్తించినా వ్యర్థమే అయింది. అలాగే చెవులలో దిక్కులు శ్రోత్రేంద్రియంతో కూడినప్పుడు కూడ విరాట్పురుషుని కార్యం సాధించటంలో వృథా అయ్యాయి. రోమాలలో త్వగింద్రియంతో ఓషధులు వర్తించి విఫలమయ్యాయి. అలాగే జలం అధిదేవతగా కల పురుషాంగం రేతస్సును పొందికూడా సృష్టికి సమర్థం కాలేదు. మలావయవం మృత్యువుతోకూడి అపానేంద్రియాన్ని చేరి నిరర్థకమే అయింది. హరిదేవతాకాలైన పాదాలు గతితో కూడి శక్తిహీనాలు అయ్యాయి. ఇంద్రదేవతాకాలైన చేతులు బలాన్ని పొంది కూడా నిరుపయోగాలైనాయి. నదీ దేవతాకాలైన నాడులు రక్తంతో కూడినప్పటికీ నిరర్థకాలైనాయి. కడుపు సముద్రాలతో కూడి ఆకలిదప్పులను పొందినప్పటికీ నిష్ప్రయోజనమైంది. హృదయం మనస్సుతో చంద్రుణ్ణి పొందికూడా ఊరక ఉంది. అట్లే బుద్ధి హృదయాన్ని పొందినప్పటికీ, చిత్తం రుద్రుణ్ణి చెందినప్పటికీ విరాట్పురుషుని కార్యాలు ఉత్పన్నం కాలేదు. అనంతరం అన్నిటికీ సమైక్యం కుదుర్పగల క్షేత్రజ్ఞుడు హృదయాన్ని అధిష్ఠించి, చిత్తంలో ప్రవేశించాడు. అప్పుడు విరాట్పురుషుడు, జలాలలో తేలుతున్న బ్రహ్మాండాన్ని అధిష్ఠించి సృష్టికార్యాన్ని ప్రవర్తింప గలిగాడు. నిద్రించిన జీవుని ప్రాణాలు మొదలైనవి తమ సొంతబలంతో కదలాడలేవు. లేవటానికి సమర్థాలు కావు. ఆ విధంగా అగ్ని మొదలైనవి తమకు అధిష్ఠానాలైన ఇంద్రియాలతో దేవాది శరీరాలు పొందికూడా, అవి శక్తిహీనా లయ్యాయి. క్షేత్రజ్ఞుడు ప్రవేశించగానే మెలకువ వచ్చినట్లు ఆయా శరీరభాగాలు పనిచేయటం ప్రారంభించాయి. అటువంటి విరాట్పురుషుని ఎడతెగని భక్తితో వివేకం కలిగి విరక్తులైన మహాత్ములు ధ్యానిస్తారు. ప్రకృతి, పురుషుల యథార్థజ్ఞానం వల్ల మోక్షమూ, కేవలం ప్రకృతి సంబంధంతో సంసారబంధమూ కలుగుతుంది” అని చెప్పి కపిలుడు దేవహూతితో మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=48&padyam=903

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: