3-889-వ.
"అవ్వా! యివ్విధంబున భక్తియోగప్రకారంబు సెప్పితి; ఇంక దత్త్వలక్షణంబు వేఱువేఱ యెఱింగింతు నే తత్త్వగుణంబుల నెఱింగి నరులు ప్రకృతి గుణంబులవలన విముక్తు లగుదురు; హృదయగ్రంథి విచ్ఛేదకంబు నాత్మదర్శనరూపంబు నగు నా జ్ఞానం బాత్మనిశ్శ్రేయస కారణంబు కావున దాని నెఱింగింతు; అందు నాత్మస్వరూపం బెట్టి దనిన; ననాదియుఁ, బురుషుండును, సత్త్త్వాది గుణశూన్యుండును, బ్రకృతిగుణ విలక్షణుండును, బ్రత్యక్స్వరూపుండును, స్వయంప్రకాశుండును మఱియు నెవ్వనితోడ నీ విశ్వంబు సమన్వితం బగు నతండు గుణత్రయాత్మత్వంబు నవ్యక్తంబును భగవత్సంబంధియు నగు ప్రకృతి యందు యదృచ్ఛచే లీలావశంబునం బ్రవేశించిన నా ప్రకృతి గుణత్రయమయంబైన స్వరూపం బయిన ప్రజాసర్గంబుఁ జేయం గనుంగొని; యప్పుడు మోహితుం డయి విజ్ఞాన తిరోధానంబునం జేసి గుణత్రయాత్మకం బయిన ప్రకృత్యధ్యాసంబున నన్యోన్యమేళనం బగుటయు నంతం బ్రకృతిగుణంబుఁ దన యందు నారోపించుకొని క్రియామాణంబు లగు కార్యంబులవలనం గర్తృత్వంబు గలిగి సంసార బద్ధుండై పారతంత్ర్యంబు గలిగి యుండు; కర్తృత్వశూన్యుం డగు నీశ్వరుండు సాక్షి యగుటం జేసి యాత్మకుం గార్యకారణ కర్తృత్వంబులు ప్రకృత్యధీనంబు లనియు; సుఖదుఃఖ భోక్తృత్వంబులు ప్రకృతి విలక్షణుం డయిన పురుషుని వనియు నెఱుంగుదురు" అని చెప్పిన విని దేవహూతి కపిలున కిట్లనియె "బురుషోత్తమా! ప్రకృతి పురుషులు సదసదాత్మక ప్రపంచంబునకుఁ గారణభూతులు గావున వాని లక్షణంబు సదసద్వివేక పూర్వకంబుగా నానతిమ్ము;" అనిన భగవంతుం డిట్లనియె.
భావము:
“అమ్మా! ఈవిధంగా భక్తియోగ స్వరూపం నీకు తెలిపాను. ఇక తత్త్వజ్ఞాన లక్షణాలను వేరువేరుగా తెలుపుతాను. ఏ తత్త్వజ్ఞాన లక్షణాలను తెలుసుకొన్న మానవులు ప్రకృతి గుణాలనుండి విముక్తు లవుతారో, మనస్సులోని సందేహాలు విడిపోయి స్వస్వరూపాన్ని తెలుసుకుంటారో, అటువంటి తత్త్వజ్ఞానం కైవల్యప్రాప్తికి కారణం అవుతుంది. అందువల్ల ఆత్మస్వరూపం ఎలాంటిదో చెపుతాను. అనాది యైనవాడూ, పురుషశబ్ద వాచ్యుడూ, సత్త్వరజస్తమోగుణాలు లేనివాడూ , ప్రకృతి గుణాలకంటె విలక్షణమైన గుణాలు కలవాడూ, ప్రత్యక్షస్వరూపం కలవాడూ, తనంతతాను వెలిగేవాడూ, విశ్వమంతటా ఉన్నవాడూ అయిన పరమాత్మ గుణత్రయాత్మకమూ, అవ్యక్తమూ, భగవంతుని అంటిపెట్టుకున్నదీ అయిన ప్రకృతిలో అప్రయత్నంగా అలవోకగా లీలగా ప్రవేశించాడు. ఆ ప్రకృతి గుణత్రయ మయమైన స్వరూపంతో సాకారమైన ప్రజాసృష్టి చేయటం ప్రారంభించింది. అది చూచి పురుషుడు వెంటనే మోహాన్ని పొంది విజ్ఞానం మరుగుపడగా, గుణత్రయాత్మకమైన ప్రకృతిని ఆశ్రయించి, పరస్పరం మేళనం పొందారు. అప్పుడు పురుషుడు ప్రకృతి గుణాలను తనయందే ఆరోపించుకొని జరుగుతున్న కార్యాలన్నింటికీ తానే కర్తగా భావించుకొని సంసారబంధంలో కట్టుబడి పరాధీనతకు లోనవుతాడు. ఈశ్వరుడు కర్త కాకున్నా జరుగుతున్న కర్మలకు సాక్షీభూతుడు కావటంవల్ల ఆత్మకు కార్యకారణ కర్తృతాలు లేవనీ, అవి ప్రకృతికి అధీనమైనవనీ, సుఖదుఃఖాలు అనుభవించడం ప్రకృతికంటె విలక్షణుడైన పురుషునిదనీ అనుభజ్ఞులు తెలుసుకుంటారు” అని చెప్పగా విని దేవహూతి కపిలునితో “మహాత్మా! ప్రకృతి పురుషులు అస్తిత్వం కలదీ, అస్తిత్వం లేనిదీ అయిన ప్రపంచానికి కారణభూతులు. కాబట్టి ఆ ప్రకృతి పురుషుల లక్షణాలు సదసద్వివేక పురస్సరంగా సెలవీయ కోరుతున్నాను” అన్నది. అప్పుడు భగవంతుడైన కపిలుడు దేవహూతితో ఇలా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=889
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment