Sunday, May 5, 2019

కపిల దేవహూతి సంవాదం - 14

3-886-సీ.
రూఢిఁ బ్రధానపూరుషనాయకుండను; 
భగవంతుఁడను జగత్ప్రభుఁడ నైన
నాకంటె నన్యులఁ గైకొని తగిలిన; 
యాత్మలు భవభయం బందుదు రది
గావున నా యాజ్ఞఁ గడవంగ నోడుట; 
జేసి వాయువు వీచు శిఖి వెలుంగు
నినుఁడు దపించుఁ దా నింద్రుఁడు వర్షించు; 
భయ మంది మృత్యువు పరువు పెట్టుఁ
3-886.1-తే.
గాన విజ్ఞాన వైరాగ్యకలిత మైన
భక్తియోగంబునం జేసి పరమపదము
కొఱకు నయ్యోగివరులు మచ్చరణభజను
లగుచుఁ జరియింపుదురు నిర్భయాత్ము లగుచు.

భావము:
ప్రధానమనే మూలప్రకృతికీ, పురుషునకూ అధీశ్వరుడనూ, భగవంతుడనూ అయిన నన్ను కాకుండా ఇతరులను ఎన్నుకొన్నవారు సంసారభయంలో పడిపోతారు. కనుక నా ఆజ్ఞ జవదాటలేక భయంతో గాలి వీస్తుంది. అగ్ని మండుతుంది. సూర్యుడు ఎండ కాస్తాడు. ఇంద్రుడు వర్షిస్తాడు. మృత్యువు భయపడి పారిపోతుంది. అందువల్ల ఈ సృష్టి విజ్ఞానంతో పాటు వైరాగ్యంతో కూడిన భక్తియోగంతో యోగివరులైనవారు వైకుంఠాన్ని ఆశించి నా చరణాలను సంస్మరిస్తూ ఏ భయమూ లేకుండా ఉంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=886

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: