3-891-వ.
అందుఁ బ్రకృతి చతుర్వింశతితత్త్వాత్మకంబై యుండు; అది యెట్లనినం బంచమహాభూతంబులును, బంచతన్మాత్రలును, జ్ఞానకర్మాత్మకంబు లయిన త్వక్చక్షుశ్శ్రోత్ర జిహ్వాఘ్రాణంబులు వాక్పాణి పాదపాయూపస్థంబులు నను దశేంద్రియంబులును, మనోబుద్ధి చిత్తాహంకారంబు లను నంతఃకరణచతుష్టయంబును నను చతుర్వింశతి తత్త్వాత్మకం బైన సగుణబ్రహ్మ సంస్థానంబు సెప్పితి; నిటమీఁదఁ గాలం బను పంచవింశకతత్త్వంబుసెప్పెద; అది గొందఱు పురుషశబ్దవాచ్యుం డైన యీశ్వరుని పౌరుషంబు గాలశబ్దంబునఁ జెప్పబడు నందురు; అందు నహంకార మోహితుండై ప్రకృతి వొంది జీవుండు భయంబుఁ జెందు; ప్రకృతిగుణసామ్యంబునం జేసి వర్తించి నిర్విశేషుం డగు భగవంతుని చేష్టా విశేషంబు దేనివలన నుత్పన్నం బగు నదియ కాలం బని చెప్పంబడు; అదియు జీవరాశ్యంతర్గతం బగుటంజేసి పురుషుండనియు వాని బహిర్భాగ వ్యాప్తిం జేసి కాలం బనియుఁ జెప్పం బడు; ఆత్మ మాయం జేసి తత్త్వాంతర్గతుం డయిన జీవునివలన క్షుభితం బయి జగత్కారణం బగు ప్రకృతి యందు పరమపురుషుడు దన వీర్యంబు పెట్టిన నా ప్రకృతి హిరణ్మయం బైన మహత్తత్త్వంబు పుట్టించె; అంత సకల ప్రపంచబీజభూతుడును లయవిక్షేప శూన్యుండును నగు నీశ్వరుండు దన సూక్ష్మవిగ్రహంబు నందు నాత్మ గతం బైన మహదాది ప్రపంచంబుల వెలిగించుచు స్వతేజోవిపత్తిం జేసి యాత్మప్రస్వాపనంబు సేయు నట్టి తమంబును గ్రసించె" నని చెప్పి; వెండియు నిట్లనియె.
భావము:
ఆ ప్రకృతి ఇరవై నాలుగు తత్త్వాలు కలదై ఉంటుంది. ఎలాగంటే పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలూ; శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే పంచ తన్మాత్రలూ; చర్మం, కన్ను, ముక్కు, చెవి, నాలుక అనే పంచ జ్ఞానేంద్రియాలూ; వాక్కు, చేతులు, కాళ్ళు, మలావయవం, మూత్రావయవం అనే పంచ కర్మేంద్రియాలూ; మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణ చతుష్టయమూ కలిసి ఇరవైనాలుగు తత్త్వాలు కలిగి సగుణబ్రహ్మకు సంస్థానం అయిన ప్రకృతిని వివరించాను. ఇక కాలం అనే ఇరవై ఐదవ తత్త్వాన్ని గురించి చెబుతాను. కొందరు పురుష శబ్ద వాచ్యుడైన ఈశ్వరుని స్వరూపమే కాలంగా చెప్పబడుతున్నదంటారు. అహంకార మోహితుడై ప్రకృతితో సంబంధం పెట్టుకున్న పురుషుడు జీవుడై భయాదులను అనుభవిస్తాడు. ప్రకృతి గుణాలన్నింటిలో సమానంగా అంతర్యామియై నిర్విశేషుడై ప్రవర్తించే భగవంతుని చేష్టా విశేషాలను కలుగచేసేదే కాలం అనబడుతుంది. అదికూడా జీవరాసులలో అంతర్యామిగా ఉన్నప్పుడు పురుషుడు అనీ, వానికి వెలుపల వ్యాపించి ఉన్నపుడు కాలం అనీ అనబడుతుంది. ఆత్మమాయ కారణంగా ప్రకృతి తత్త్వాలలో విలీనమైన జీవునివల్ల కదిలింపబడినదీ, జగత్తుకు కారణమైనదీ అయిన ప్రకృతియందు భగవంతుడు సృజనాత్మకమైన తన వీర్యాన్ని ఉంచగా ఆ ప్రకృతి తనలోనుంచి హిరణ్మయమైన మహత్త్వాన్ని పుట్టించింది. అనంతరం సకల ప్రపంచానికి మూలమైనవాడూ, లయవిక్షేప శూన్యుడూ అయిన ఈశ్వరుడు తన సూక్ష్మవిగ్రహంలో ఆత్మగతమైన మహదాది ప్రపంచాన్ని వెలిగిస్తూ, తన తేజఃప్రసారం చేత తనను నిద్రింపజేసే తమస్సును హరించి వేశాడు” అని చెప్పి కపిలుడు కళ్ళీ ఇలా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=891
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment