Tuesday, August 30, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౫(615)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1281-సీ.
నరనాథ! యొకనాఁడు నలినాయతాక్షుండు-
  వొలుచు కుశస్థలీపురము నందు
సుఖముండ నొక్క భూసురవర్యు భార్యకుఁ-
  బుత్త్రుండు జన్మించి పుట్టినపుడ
మృతుఁడైన ఘనశోకవితతిచేఁ గ్రాఁగుచు-
  నా డింభకునిఁ గొంచు నవనిసురుఁడు
సనుదెంచి పెలుచ రాజద్వారమునఁ బెట్టి-
  కన్నుల బాష్పాంబుకణము లొలుక
10.2-1281.1-తే.
"బాపురే! విధి నను దుఃఖపఱుపఁ దగునె?"
యనుచు దూఱుచుఁ దనుఁ దిట్టుకొనుచు వగల
డెంద మందంద యెరియ నాక్రందనంబు
సేయుచును వచ్చి యా విప్రశేఖరుండు.

భావము:
“మహారాజా! తామరల వంటి విశాల నయనాల వాడు శ్రీకృష్ణుడు కుశస్థలిలో సుఖంగా ఉంటున్న రోజులలో, ఒక విప్రుని భార్యకు పుత్రుడు పుట్టి పుట్టగానే చనిపోయాడు. శోకంతో కన్నీళ్ళు పెట్టుకుని మృతబాలుడిని ఎత్తుకుని వచ్చి, ఆ బాలుడి శవాన్ని రాజద్వారం ముందు పెట్టి, విధిని నిందిస్తూ, తనను తాను తిట్టుకుంటూ, బ్రహ్మణుడు గుండెబ్రద్దలయ్యేలా “అయ్యో” అంటూ దుఃఖించసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1281

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: