Thursday, August 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౯(609)

( భృగుమహర్షి శోధనంబు ) 

10.2-1270-క.
మనమునఁ గలఁగుచు భృగుఁ దన
తనుజాతుం డనుచు బుద్ధిఁ దలఁచినవాఁడై
ఘనరోషస్ఫురితాగ్నిని
ననయము శాంతోదకముల నల్లన నార్చెన్.
10.2-1271-చ.
మహితతపోధనుండు మునిమండనుఁ డయ్యెడఁ బాసి వెండియు
న్నహిపతిభూషుఁ గాన రజతాద్రికి నేగిన నగ్గిరీంద్రుపైఁ
దుహినమయూఖశేఖరుఁడు దుర్గయుఁ దానును విశ్రమించుచున్
దృహిణతనూభవుండు సనుదెంచుట కాత్మఁ బ్రమోదమందుచున్.

భావము:
చతుర్ముఖుడు తన మనసులో కలతపడ్డాడు. భృగువు తన కొడుకే కదా అనుకుని, బ్రహ్మదేవుడు తన రోషాన్ని ఎలాగో చల్లార్చుకున్నాడు. ఆ మహాతపశ్శాలి, మునివరుడు, భృగుమహర్షి బ్రహ్మదేవుడి సభనుండి నిష్క్రమించి, నాగాభరణుడు అయిన ఈశ్వరుని కోసం కైలాస పర్వతం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆ వెండికొండ మీద విశ్రమించి ఉన్న పార్వతీపరమేశ్వరులు బ్రహ్మదేవుని పుత్రుడు అయిన భృగువు రాకకు సంతోషించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1271

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: