Sunday, August 28, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౩(613)

( భృగుమహర్షి శోధనంబు ) 

10.2-1278-వ.
మునీంద్రా! భవదీయ పాదాబ్జహతి మద్భుజాంతరంబునకు భూషణం బయ్యె; భవదాగమనంబు మాఁబోటివారికి శుభావహం బగుంగాదె; యేను ధన్యుండ నైతి" నని మృదుమధురాలాపంబుల ననునయించిన నమ్మునివరుండు లక్ష్మీనాథు సంభాషణంబులకుఁ జిత్తంబునం బరమానందంబు నొంది, యమ్ముకుందు ననంతకల్యాణగుణనిధి నభినందించి, యానందబాష్పధారాసిక్త కపోలుం డగుచుఁ దద్భక్తి పారవశ్యంబున నొండు పలుకనేరక యతనిచేత నామంత్రణంబువడసి మరలి సరస్వతీతీరంబున నున్న మునుల సన్నిధికిం జనుదెంచి వారలం గనుంగొని.

భావము:
ఓ మునీశ్వరా! నీ పాదతాడనము నా వక్షానికి అలంకారము అయిది. నీ రాక మా వంటి వారికి శుభదాయకం కదా. నేను ధన్యుడను అయ్యాను.” అని మృదుమధురంగా మాట్లాడాడు. శ్రీపతి మధురోక్తులకు భృగుమహర్షి మనసు సంతుష్టి చెందింది. ఆ శ్రీహరిని, ముకుందుడిని, అనంతగుణ నిధిని పలువిధాల స్తుతించాడు. ఆనంద భక్తి పారవశ్యాలతో కనులు చెమర్చుతుండగా విష్ణువు దగ్గర అనుమతి తీసుకొని, వెనుదిరిగి సరస్వతీనదీ తీరంలో ఉన్న మునుల వద్దకు వచ్చి, వారికి విషయం అంతా చెప్పాడు.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1278

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: