10.2-1275-క.
తన విభుపాదములకు వం
దనముం గావించి సముచితప్రియముల న
య్యనలాక్షుని కోపము మా
న్చిన నమ్మునినాథుఁ డచట నిలువక చనియెన్.
10.2-1276-సీ.
పొలుపొందు వైకుంఠపురమున కర్థితోఁ-
జని యందు సమధికైశ్వర్య మొప్పఁ
గమలాంక పర్యంకగతుఁడై సుఖించు న-
క్కౌస్తుభభూషు వక్షస్థ్సలంబుఁ
దన పాదమున బిట్టు దన్నెఁ దన్నినఁ బాన్పు-
డిగి వచ్చి మునిఁ జూచి నగధరుండు
పదముల కెఱఁగి "యో! పరమతపోధన!-
యీగతి నీ వచ్చు టెఱుఁగ లేక
10.2-1276.1-తే.
యున్న నా తప్పు మన్నించి నన్నుఁ గరుణఁ
జూచి యీ దివ్యమణిమయస్ఫూర్తిఁ దనరు
రుచిర సింహాసనమునఁ గూర్చుండు దివ్య
తాపసోత్తమ! యభయప్రదాననిపుణ!
భావము:
పార్వతీదేవి పతి పాదాలమీదపడి సముచిత మధుర వచనాలతో అతని కోపం పోగొట్టింది. భృగువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. పిమ్మట భృగుమహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఒడిలో తలపెట్టుకుని పవళించి ఉన్నాడు. కౌస్తుభమణితో విరాజిల్లుతున్న విష్ణువు యొక్క వక్షాన్ని మునీశ్వరుడు తన కాలితో గట్టిగా తన్నాడు. నారాయణుడు నిర్వికారంగా పానుపు దిగి, ముని దగ్గరకు వచ్చి, కాళ్ళకు నమస్కారించి ఇలా అన్నాడు. “ఓ మునివర! దివ్య తపశ్శాలి! నీ రాకను గురించి తెలిసికొనలేక నేను చేసిన అపరాధాన్ని మన్నించు నన్ను కరుణించు. నీవు అభయము ఇచ్చుటలో ముందుండు వాడవు. ఈ మణిమయ సింహాసనంపై ఆసీనులు కండు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1276
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment