Monday, August 22, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౮(608)

( భృగుమహర్షి శోధనంబు ) 

10.2-1267-క.
వితతక్రియ లొప్పఁగ స
త్క్రతువుల నొనరించు చచటఁ గైకొని లక్ష్మీ
పతి భవ పితామహులలో
నతులితముగ నెవ్వ రధికు లని తమలోనన్.
10.2-1268-వ.
ఇట్లు దలపోసి తన్మమహత్త్వం బంతయుం తెలిసి రమ్మని భృగు మహాముని నమ్మువ్వురు వేల్పులకడకుం బంపిన నత్తాపసోత్తముండు సనిచని ముందట.
10.2-1269-క.
జలరుహసంజాత సభా
స్థలమున కొగి నేఁగి యతని సత్త్వగుణంబుం
దెలియుటకై నుతివందన
ములు సేయక యున్న నజుఁడు ముసముస యనుచున్.

భావము:
వారు పలు యాగాలను వైభవోపేతంగా చేయసాగారు. ఆ సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు ఎక్కువ గొప్పవారు అన్న చర్చ వారి మధ్య వచ్చింది. ఇలా చర్చించుకుని, భృగుమహర్షిని త్రిమూర్తుల మహత్యములను పరీక్షించి రమ్మని పంపారు. అంతట ఆ మహర్షి బయలుదేరి వెళ్ళి ఆయన సత్త్వ గుణసంపదను పరీక్షించాలి అనుకుని, బృగుమహర్షి బ్రహ్మదేవుడి కొలువులోనికి ప్రవేశించాడు. బ్రహ్మను స్తుతించకుండా ఆ మహర్షి మౌనంగా నిలబడ్డాడు. బ్రహ్మదేవుడు రుసరుస లాడి చిరాకుగా చూస్తూ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1269

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: