Monday, August 29, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౪(614)

( భృగుమహర్షి శోధనంబు ) 

10.2-1279-సీ.
మునినాయకులతోడఁ దన పోయి వచ్చిన-
  తెఱఁగును దనమది దృష్టమైన
మూఁడుమూర్తుల విధంబును నెఱింగించిన-
  విని వారు మనముల విస్మయంబు
నంది చిత్తంబున సందేహమునుఁ బాసి-
  చిన్మయాకారుండు, శ్రీసతీశుఁ,
డనుపముఁ, డనవద్యుఁ, డఖిల కల్యాణగు-
  ణాకరుఁ, డాదిమధ్యాంతరహితుఁ,
10.2-1279.1-తే.
డై తనర్చిన పుండరీకాక్షుఁ డొకఁడ
కాక గణుతింప దైవ మొక్కరుఁడు వేఱ
కలఁడె యనుబుద్ధి విజ్ఞాన కలితు లగుచు
హరిపదాబ్జాతయుగళంబు నర్థిఁ గొలిచి.
10.2-1280-వ.
అట్లు సేవించి యవ్యయానందంబయిన వైకుంఠధామంబు నొంది; రని చెప్పి వెండియు నిట్లనియె.

భావము:
ఆ ఋషీశ్వరులకు తను వెళ్ళివచ్చిన వివరాలు, తనకు అవగతము అయిన త్రిమూర్తుల స్వభావాలు భృగుమహర్షి సవిస్తరంగా తెలిపాడు. ఆ మునీంద్రులు అచ్చెరు వొందారు. వారు సందేహాలు విడిచిపెట్టారు. సకల కల్యాణనిధి, చిన్మయస్వరూపుడు, లక్ష్మీపతి, అనుపమ అనవద్యుడు, ఆదిమధ్యాంత రహితుడు, పుండరీకాక్షుడు అయిన శ్రీమహావిష్ణువు ఒక్కడే పరమదైవం అని నిర్ణయించారు. అలా ఆ మునులు మహాఙ్ఞానులు అయి, హరిపాదారవింద ధ్యానరతులు అయి, ప్రీతితో సేవించారు. అలా విష్ణుమూర్తిని భక్తితో సేవించిన ఆ మునులు వైకుంఠప్రాప్తిని పొందారు.” అని చెప్పి శుకమహర్షి పరీక్షుత్తుతో ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1279

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: