Thursday, August 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౦(610)

( భృగుమహర్షి శోధనంబు ) 

10.2-1272-క.
కనుఁగొని భ్రాతృస్నేహం
బునఁ గౌఁగిటఁ జేర్చు ననుచు ముక్కంటి రయం
బున నెదురేగిన ముని రు
ద్రుని యందలి సత్త్వగుణ మెఱుంగుటకొఱకై.
10.2-1273-వ.
అతనిం గైకొనక యూరకుండిన.
10.2-1274-ఉ.
ఆ నిటలాంబకుండు గమలాసన నందనుఁ జూచి భూరి కా
లానల రోషవేగ భయదాకృతిఁ దాల్చి పటుస్ఫులింగ సం
తానము లొల్క శూలమునఁ దాపసముఖ్యు నురంబు వ్రేయఁగాఁ
బూనినఁ బార్వతీరమణి బోరన నడ్డము వచ్చి చెచ్చెరన్;

భావము:
భృగువు సోదరవాత్సల్యంతో తనను కౌగలించుకుంటాడు అనుకుని పరమశివుడు వేగంగా అతనికి ఎదురు వెళ్ళాడు. కాని, శివుడి సత్త్వగుణం పరీక్షించాలనే ఉద్దేశంతో భృగువు శివుని రాకకు స్పందించకుండా ఊరక నిలబడ్డాడు. ముక్కంటి పరమశివుడు, బ్రహ్మపుత్రుడైన భృగువు ఎడల ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన విస్ఫులింగాలు వెదజల్లే త్రిశూలంతో ఆ మహర్షిని వక్షంపై పొడవడానికి ప్రయత్నించాడు. కాని, పార్వతీదేవి చటుక్కున అడ్డువచ్చి....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1274

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: