Wednesday, March 24, 2021

శ్రీకృష్ణ విజయము - 178

( జాంబవతి పరిణయంబు )

10.2-68-సీ.
"బాణాగ్ని నెవ్వఁడు పఱపి పయోరాశి-
  నింకించి బంధించి యేపు మాపెఁ
బరఁగ నెవ్వఁడు ప్రతాపప్రభారాశిచే-
  దానవగర్వాంధతమస మడఁచెఁ
గంజాతములు ద్రెంచు కరిభంగి నెవ్వఁడు-
  దశకంఠుకంఠబృందములు ద్రుంచె
నా చంద్రసూర్యమై యమరు లంకారాజ్య-
  మునకు నెవ్వఁడు విభీషణుని నిలిపె
10.2-68.1-తే.
నన్ను నేలిన లోకాధినాథుఁ డెవ్వఁ
డంచితోదారకరుణారసాబ్ధి యెవ్వఁ
డాతఁడవు నీవ కావె; మహాత్మ! నేఁడు
మాఱుపడి యెగ్గు సేసితి మఱవవలయు. "
10.2-69-వ.
అని యిట్లు పరమభక్తుండయిన జాంబవంతుండు వినుతించిన నతని శరీర నిగ్రహ నివారణంబుగా భక్తవత్సలుండైన హరి దన కరంబున నతని మేను నిమిరి గంభీరభాషణంబుల నిట్లనియె.

భావము:
“ఎవరు బాణాగ్నిచే సముద్రాన్ని ఇంకించి, సేతువు కట్టి సాగరుని గర్వం మాపెనో; రాక్షసుల గర్వమనే చీకటిని ప్రతాపమనే కాంతిరాశిచే అణచివేసెనో; పద్మాలను త్రెంచే ఏనుగులాగ రావణాసురుని శిరస్సులు త్రెంచెనో; ఆచంద్రార్క మైన లంకారాజ్యానికి విభీషణుని రాజుచేసెనో; ఆ నన్నేలిన కరుణాసముద్రుడు, లోకనాథుడు నీవే కదా మహాత్మా! పొరబడి నీకు అపచారం చేసాను. నన్ను మన్నించు.” అని ఈ విధంగా పరమభక్తుడైన ఆ జాంబవంతుడు శ్రీకృష్ణుడిని స్తుతించాడు. అంత, భక్తవత్సలుడైన శ్రీహరి తన చేతితో జాంబవంతుడి శరీరం నిమిరి యుద్ధంవలన కలిగిన శ్రమను తొలగించి గంభీరమైన కంఠస్వరంతో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=8&Padyam=68

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: