Monday, March 1, 2021

శ్రీకృష్ణ విజయము - 163 ( రతీప్రద్యుమ్నులాగమనంబు )



10.2-24-వ.
ఇట్లు శంబరుని వధియించి విలసిల్లుచున్న యించువిలుకానిం గొంచు నాకాశచారిణియైన యా రతీదేవి, గగనపథంబుఁ బట్టి ద్వారకా నగరోపరిభాగమునకుం జనుదెంచిన.
10.2-25-ఆ.
మెఱుఁగుఁదీగెతోడి మేఘంబు కైవడి
యువిదతోడ మింటి నుండి కదలి
యరుగుదెంచె మదనుఁ డంగనాజనములు
మెలఁగుచున్న లోనిమేడకడకు.
10.2-26-మ.
జలదశ్యాముఁ బ్రలంబబాహుయుగళుం జంద్రాననున్ నీల సం
కులవక్రాలకుఁ బీతవాసు ఘనవక్షున్ సింహమధ్యున్ మహో
త్పలపత్త్రేక్షణు మందహాసలలితుం బంచాయుధున్ నీరజా
క్షులు దారేమఱుపాటఁ జూచి హరి యంచుం డాఁగి రయ్యైయెడన్.

భావము:
ఈ విధంగా శంబరుడిని సంహరించి శోభిస్తున్న ప్రద్యుమ్నుడిని తీసుకుని, ఖేచరి అయిన రతీదేవి ఆకాశమార్గం గుండా ద్వారకానగరం దగ్గరికి వచ్చింది. మాయాదేవితో కూడిన ప్రద్యుమ్నుడు మెఱుపుతీగతో కూడిన మేఘంలా శోభిస్తూ ఆకాశంలో నుండి దిగి స్త్రీలు నివసించే అంతఃపురం మేడ మీదకు చేరాడు. మేఘము వంటి నీలవర్ణ దేహము; ఆజాను బాహువులు; చంద్రుని బోలిన నెమ్మొగము; వ్యాపించిన నల్లని ఉంగరాల ముంగురులు; పచ్చని వస్త్రం; విశాల వక్షఃస్థలము; సన్నని నడుము; కలువరేకుల వంటి కన్నులు; మృదువైన చిరునవ్వు గల ప్రద్యుమ్నుడిని అక్కడి స్త్రీలు ఏమరుపాటుగా చూసి, శ్రీకృష్ణుడని భ్రమించి అక్కడి కక్కడ చాటులకు చేరారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=26

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: