Friday, March 5, 2021

శ్రీకృష్ణ విజయము - 167

( రతీప్రద్యుమ్నులాగమనంబు )

10.2-36-వ.
అని డోలాయమాన మానసయై వితర్కించుచు.
10.2-37-క.
తనయుఁ డని నొడువఁ దలఁచును;
దనయుఁడు గా కున్న మిగులఁ దతిగొని సవతుల్‌
తను నగియెద రని తలఁచు; న
తను సంశయ మలమికొనఁగఁ దనుమధ్య మదిన్.
10.2-38-వ.
ఇట్లు రుక్మిణీదేవి విచారించుచుండ లోపలినగరి కావలివారివలన విని కృష్ణుండు దేవకీవసుదేవులం దోడ్కొని చనుదెంచి సర్వజ్ఞుం డయ్యు నేమియు వివరింపక యూరకుండె; నంత నారదుండు సనుదెంచి శంబరుఁడు గుమారునిం గొనిపోవుట మొదలైన వార్త లెఱింగించిన.

భావము:
అని చెలికత్తెకు చెప్పి, ఎటూ తేల్చుకోలేని ఊగిసలాడుతున్న మనస్సుతో రుక్మిణీదేవి వితర్కించుకుంటూ. రుక్మిణీదేవి ఇతడు తన కొడుకే అని చెప్పబోతుంది. కాని అతడు తన కుమారుడు కాకపోతే సమయం చిక్కిందని తన సవతులు తనను గేలిచేస్తారేమో అనే సంశయంతో ఆలోచించుకోసాగింది. అలా ఒక ప్రక్క రుక్మిణీదేవి ఆలోచించుకుంటూ ఉండగా, అంతఃపురం కాపలాకాసే వారి వలన విషయం వినిన శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను వెంట తీసుకుని వచ్చాడు. తాను సర్వజ్ఞుడు అయినా వివరం చెప్పకుండా ఊరుకున్నాడు. ఇంతలో నారదుడు వచ్చి శంబరాసురుడు శిశువును తీసుకొని వెళ్ళడం మొదలైన విషయాలు అన్నీ వివరంగా తెలియజేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=38

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: