Thursday, March 18, 2021

శ్రీకృష్ణ విజయము - 174

( సత్రాజితుని నిందారోపణ )

10.2-57-వ.
అంత సత్రాజితుండు తన సహోదరుండైన ప్రసేనునిం గానక దుఃఖించుచు.
10.2-58-మ.
"మణి కంఠంబునఁ దాల్చి నేఁ డడవిలో మావాఁడు వర్తింపఁగా
మణికై పట్టి వధించినాఁడు హరికిన్ మర్యాద లే" దంచు దూ
షణముం జేయఁగ వాని దూషణముఁ గంసధ్వంసి యాలించి యే
వ్రణమున్ నా యెడ లేదు, నింద గలిగెన్ వారించు టే రీతియో?
భావము:
ఇక్కడ మథురలో సత్రాజిత్తు తన తమ్ముడైన ప్రసేనుడు వేటకుపోయి తిరిగి రానందుకు ఎంతగానో దుఃఖిస్తూ.....
10.2-59-వ.
అని వితర్కించి.
10.2-60-మ.
తనవారెల్లఁ బ్రసేనుజాడఁ దెలుపం దర్కించుచున్ వచ్చి, త
ద్వనవీథిం గనె నేలఁ గూలిన మహాశ్వంబుం బ్రసేనుం, బ్రసే
నుని హింసించినసింహమున్, మృగపతిన్ నొప్పించిఖండించి యేఁ
గిన భల్లూకము సొచ్చియున్న గుహయుం గృష్ణుండు రోచిష్ణుఁడై.

భావము:
“నా తమ్ముడు శమంతకమణిని ధరించి అడవికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు శమంతకమణి కోసం మా తమ్ముణ్ణి చంపేసాడు. హరికి ఏమాత్రం మర్యాద లే”దని దూషించసాగాడు. ఆ దూషణ వాక్యాలు వినిన శ్రీకృష్ణుడు నాలో ఏ దోషమూ లేదు. ఇలా నాపై బడ్డ ఈ అపనిందని నేనెలా తొలగించుకోవాలి అని ఆలోచించాడు. ఇలా ఆలోచించి తనవారు అడవిలో ప్రసేనుడు వెళ్ళిన జాడ చూపగా, వెదుకుతూ వచ్చి అరణ్యంలో నేలకూలిన గుఱ్ఱాన్ని, ప్రసేనుణ్ణి చంపిన సింహాన్ని, సింహాన్ని చంపి ఎలుగుబంటి వెళ్ళిన గుహనూ కృష్ణుడు ఆసక్తితో వీక్షించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=7&Padyam=60

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: