Saturday, March 20, 2021

శ్రీకృష్ణ విజయము - 176

( జాంబవతి పరిణయంబు )

10.2-63-వ.
అంత నా ధ్వని విని బలవంతుండైన జాంబవంతుఁడు వచ్చి తన స్వామి యని కృష్ణు నెఱుంగక ప్రాకృత పురుషుండని తలంచి కృష్ణునితో రణంబు చేసె; నందు.
10.2-64-క.
పలలమునకుఁ బోరెడు డే
గల క్రియ శస్త్రములఁ దరులఁ గరముల విజయే
చ్ఛల నిరువదియెనిమిది దిన
ములు వోరిరి నగచరేంద్రముఖ్యుఁడు హరియున్.
10.2-65-క.
అడిదములుఁ దరులు విఱిగిన
బెడిదము లగు మగతనములు బిఱుతివక వడిం
బిడుగులవడువునఁ బడియెడి
పిడికిటిపోటులను గలన బెరసి రిరువురున్.

భావము:
దాది వేసిన కేక విని మహాబలశాలి అయిన జాంబవంతుడు అక్కడకు వచ్చాడు. శ్రీకృష్ణుడు తన ప్రభువే (శ్రీరాముడే) అని గ్రహించక, సామాన్య మానవు డని భావించి కృష్ణుడితో యుద్ధం చేయడానికి తలపడ్డాడు. అప్పుడు మాంసం కోసం పోరాడే డేగల లాగ; కృష్ణుడు, జాంబవంతుడు ఆ శమంతకమణి కోసం ఆయుధాలతో, చెట్లతో, చేతులతో ఒకరి నొకరు జయించాలనే కోరికతో ఇరవైఎనిమిది రోజులు పోరాడారు. కత్తులు, చెట్లు విరిగిపోయినా, వెనుకంజ వేయకుండా మిక్కిలి పౌరుషంతో పిడుగుల వంటి పిడికిలిపోట్లతో వారిరువురూ క్రూరంగా పోరాడారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=8&Padyam=64

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: