Wednesday, March 17, 2021

శ్రీకృష్ణ విజయము - 172

( శమంతకమణి పొందుట )

10.2-51-వ.
అని యిట్లు పలికిన మూఢజనులఁ జూచి గోవిందుండు నగి మణి సమేతుండైన సత్రాజితుండుగాని సూర్యుండు గాఁడని పలికె; నంత సత్రాజితుండు శ్రీయుతంబయి మంగళాచారంబైన తన గృహంబునకుం జని, మహీసురులచేత నిజదేవతా మందిరంబున నమ్మణి శ్రేష్ఠంబు ప్రవేశంబు సేయించె; నదియును బ్రతిదినంబు నెనిమిది బారువుల సువర్ణంబు గలిగించు చుండు.
10.2-52-క.
ఏ రా జేలెడు వసుమతి
నా రత్నము పూజ్యమానమగు నక్కడ రో
గారిష్ట సర్వ మాయిక
మారీ దుర్భిక్ష భయము మాను; నరేంద్రా!
10.2-53-క.
అమ్మణి యాదవ విభునకు
నిమ్మని హరి యడుగ నాతఁ డీక ధనేచ్ఛం
బొమ్మని పలికెను, జక్రికి
నిమ్మణి యీకున్న మీఁద నేమౌ ననుచున్.

భావము:
అని తనకు చెప్తున్న అమాయకుల మాటలకు నవ్వి శ్రీకృష్ణుడు “అతడు సత్రాజిత్తు మణిని ధరించి వస్తున్నాడు. అంతే తప్ప, సూర్యుడు కాదు” అని చెప్పాడు. అనంతరం సత్రాజిత్తు మంగళ ఆచారాలతో శ్రీమంతమైన తన ఇంటికి వెళ్ళి, దేవతామందిరంలో శమంతకమణిని బ్రాహ్మణుల చేత ప్రవేశపెట్టించాడు. ఆ మణి రోజుకి ఎనిమిది బారువుల చొప్పున ప్రతి రోజు బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. ఓ పరీక్షన్మహారాజా! ఏ ప్రభువు పరిపాలించే దేశంలో ఆ శమంతక రత్నం పూజింపబడుతూ ఉంటుందో ఆ రాజ్యంలో, రోగాలు, అరిష్టాలూ, కరువుకాటకాలూ ఉండవు. శమంతకమణిని యాదవుల ప్రభువైన ఉగ్రసేన మహారాజునకు ఇమ్మని శ్రీకృష్ణుడు సత్రాజిత్తును అడిగాడు. ధనం మీది లాలసతో సత్రాజిత్తు శ్రీకృష్ణునకు ఈ మణిని ఇవ్వకపోయినా ఏం కాదులే అని నిరాకరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=5&Padyam=53

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: