Thursday, March 18, 2021

శ్రీకృష్ణ విజయము - 175

( సత్రాజితుని నిందారోపణ )

10.2-61-వ.
కని తన వెంట వచ్చిన ప్రజల నెల్ల గుహాముఖంబున విడిచి, సాహసంబున మహానుభావుం డైన హరి నిరంతర నిబిడాంధకార బంధురంబయి, భయంకరంబై, విశాలంబయిన గుహాంతరాళంబు సొచ్చి; చని యక్కడ నొక్క బాలున కెదురు దర్శనీయ కేళీకందుకంబుగా వ్రేలంగట్టఁబడిన యమ్మణి శ్రేష్ఠంబుఁ గని హరింప నిశ్చయించి.
10.2-62-క.
మెల్లన పదము లిడుచు యదు
వల్లభుఁ డా శిశువుకడకు వచ్చిన, గుండెల్‌
జల్లనఁగఁ జూచి, కంపము
మొల్లంబుగ దానిదాది మొఱపెట్టె నృపా!

భావము:
తన వెంట వచ్చిన ప్రజలందరినీ గుహ ద్వారం దగ్గర వదలి, శ్రీకృష్ణుడు సాహసంతో దట్టమైన చీకటితో నిండి భయంకరంగా ఉన్న విశాలమైన గుహ లోపలకు వెళ్ళాడు. అక్కడ ఒక బాలుడికి ఎదురుగా ఆటబంతిగా వేలాడదీసిన శమంతకమణిని చూసాడు. దానిని తీసుకుందామని తలచి ఓ రాజా పరీక్షిత్తూ! యదుశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు మెల్ల మెల్లని అడుగులు వేస్తూ ఆ శిశువు దగ్గరకు రాసాగాడు. (అకస్మాత్తుగా) చూసిన దాది గుండెలు గుభిల్లు మనగా పెద్ద కేక పెట్టింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=7&Padyam=62

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: