Tuesday, February 2, 2021

శ్రీ కృష్ణ విజయము - 140

( కాలయవనుడు నీరగుట )

10.1-1641-ఆ.
"ఎవ్వఁడాతఁ డతని కెవ్వండు దండ్రి? ఘో
రాద్రిగుహకు నేటి కతఁడు వచ్చి
నిద్రపోయె? యవను నిటు గాల్ప నెట్లోపెఁ?
దెలియఁ బలుకు నాకు ధీవరేణ్య!"
10.1-1642-వ.
అనినం బరీక్షిన్నరేంద్రునకు నతికుతూహలంబుతో శుకయోగివర్యుం డిట్లనియె “నిక్ష్వాకు కులసంభవుండు మాంధాత కొడుకు ముచికుందు డను రాజు, రాక్షసభీతులైన వేల్పులం బెద్దగాలంబు సంరక్షించిన మెచ్చి; వా రమరలోక రక్షకుండైన యా రాజకుమారుని కడకుం జేరి వరంబు వేఁడు మనిన; వారలం గనుంగొని మోక్షపదం బడిగిన; వార లతని కిట్లనిరి.
10.1-1643-మ.
"జగతిన్ నిర్గతకంటకం బయిన రాజ్యంబున్ విసర్జించి శూ
రగణాగ్రేసర! పెద్దకాలము మమున్ రక్షించి; తీలోన నీ
మగువల్ మంత్రులు బంధులున్ సుతులు సంబంధుల్ భువిన్లేరు కా
లగతిం జెందిరి; కాల మెవ్వరికి దుర్లంఘ్యంబు దా నారయన్.

భావము:
“బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా! శుకా! ఆ పురుషుడు ఎవరు? అతని తండ్రి ఎవరు? అలా భయంకరమైన గుహలోకి వచ్చి అత డెందుకు నిద్రపోయాడు? అతడు కాలయవనుడిని ఎలా కాల్చివేయగలిగాడు? ఈ విషయ మంతా నాకు తెలిసేలా విశదీకరించు.” అని ఇలా ప్రశ్నించిన మహారాజు పరీక్షిత్తుకు మిక్కిలి ఆసక్తి పూర్వకంగా యోగిపుంగవుడైన శుకుడు ఇలా చెప్పసాగాడు. “ఆ పురుషుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మాంధాత యొక్క పుత్రుడు. ముచుకుందుడు అనే మహారాజు. అతడు అసురులకు భయపడిన దేవతలను బహుకాలం సంరక్షించాడు. దేవలోకాన్ని కాపాడిన ఆ రాకుమారుడిని మెచ్చుకుని దేవతలు అతనిని ఏదైనా వరము కోరుకోమన్నారు. అతడు మోక్షమును కోరగా దేవతలు అతనితో ఇలా అన్నారు. “ఓ వీరాగ్రేసరా! ముచికుందా! మానవలోకంలో శత్రువులే లేని నీ రాజ్యాన్ని వదలి వచ్చి, చిరకాలం మమ్మల్ని సంరక్షిస్తూ ఇక్కడే ఉండిపోయావు. ఈ లోపల నీ పత్నులు, స్నేహితులు, చుట్టాలు, కుమారులు నీకు సంబంధించిన వారు అందరూ భూమిని విడిచారు. వారంతా మరణించారు. ఎంతటి వారైనా కాలప్రభావాన్ని గడవలేరు కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=198&padyam=1643

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: