Monday, February 8, 2021

శ్రీ కృష్ణ విజయము - 145

( ముచికుందుడు స్తుతించుట )

10.1-1655-క.
"నీ మాయఁ జిక్కి పురుష
స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు; వి
త్తామయ గృహగతమై సుఖ
తామసమై కామవంచితంబై యీశా!
10.1-1656-ఉ.
పూని యనేకజన్మములఁ బొంది తుదిం దన పుణ్యకర్మ సం
తానము పేర్మిఁ గర్మ వసుధాస్థలిఁ బుట్టి ప్రపూర్ణదేహుఁడై
మానవుఁడై గృహేచ్ఛఁబడు మందుఁ డజంబు తృణాభిలాషి యై
కానక పోయి నూతఁబడు కైవడి నీ పదభక్తిహీనుఁడై.
10.1-1657-క.
తరుణీ పుత్ర ధనాదుల
మరిగి మహారాజ్యవిభవ మదమత్తుఁడనై
నరతను లుబ్ధుఁడ నగు నా
కరయఁగ బహుకాల మీశ! యాఱడుఁబోయెన్.

భావము:
“సర్వేశ్వరా! నీ మాయచేత మోహితులై సుఖలేశం తోపించు విత్తము, గృహాదులు మీద తగులం పొంది వారు వంచితులు అవుతూ, స్త్రీలును పురుషులును నిన్ను భజింపరు. జీవి పలు జన్మములు ఎత్తియెత్తి తుదకు తన పుణ్యకార్యముల ఫలంగా కర్మక్షేత్రమైన దేశంలో పూర్ణ దేహంతో మానవుడుగా పుడతాడు. పుట్టి కూడా మూఢత వలన నీ పదభక్తి లేనివాడై మేక గడ్డి మీది ఆశతో కనులు కానక వెళ్ళివెళ్ళి నూతిలో పడినట్లు గృహాదులు అందలి వాంఛలకు వశుడై చెడుతున్నాడు. పరమేశ్వరా! ఆలుబిడ్డలు, డబ్బు, మొదలైన వాటి మీద తగులము పొంది, మహారాజ్య సంపత్తితో మదించిన మనసు కలవాడనై ఈ మానవ శరీరము మీది పేరాస కల వాడను అయిన నాకు వ్యర్థముగా చాలాకాలం గడచిపోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=199&padyam=1656

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: