10.1-1644-క.
కాలము ప్రబలురకును బలి
కాలాత్ముం డీశ్వరుం డగణ్యుఁడు జనులం
గాలవశులఁగాఁ జేయును
గాలముఁ గడవంగలేరు ఘను లెవ్వారున్.
10.1-1645-క.
వర మిచ్చెద మర్థింపుము
ధరణీశ్వర! మోక్షపదవి దక్కను మే మె
వ్వరమును విభులము గా మీ
శ్వరుఁ డగు హరి దక్క మోక్షసంగతిఁ జేయన్."
10.1-1646-వ.
అని పలికిన దేవతలకు, నమస్కరించి ముచికుందుఁడు నిద్రఁ గోరి దేవదత్త నిద్రావశుండయ్యి పర్వతగుహాంతరాళంబున శయనించి యుండె; యవనుండు నీఱయిన పిమ్మట హరి ముచికుందుని ముందఱ నిల్చిన.
భావము:
కాలం మహాబలవంతుల కంటే బలమయినది. భగవంతుడే కాలస్వరూపుడు. అతడు ఇలాంటి వాడని నిరూపించటం సాధ్యం కాదు. అతడు జనులను కాలానికి లోబరుస్తాడు. ఎంతటి గొప్పవారయినా కాలాన్ని దాటలేరు. ఓ ముచికుంద మహారాజా! కైవల్యం తప్ప మరి ఏ వరమైనా సరే కోరుకో, ఇస్తాము. భగవంతుడు విష్ణువుకి తప్ప మోక్షము ఇవ్వడానికి మాకు ఎవరికీ అధికారం లేదు.” ఇలా చెప్పిన దేవతలకు అభివాదం చేసి ముచుకుందుడు నిద్రను కోరుకున్నాడు. దేవతలు ఇచ్చిన నిద్రకు లోబడి, అతడు కొండగుహలోపల ఇంత కాలమూ పండుకొని ఉన్నాడు. కాలయవనుడు భస్మమైన పిదప శ్రీకృష్ణుడు ముకుందుని ఎదుట నిలబడి సాక్షాత్కారం ఇవ్వగా.....
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=198&padyam=1645
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment