Monday, February 15, 2021

శ్రీకృష్ణ విజయము - 152

( ప్రవర్షణ పర్వతారోహణంబు )

10.1-1673-వ.
మఱియుం బలాయమానులై బహుయోజనంబుల దూరంబు చని విశ్రాంతులై తమకు డాఁగ నెల వగునని యింద్రుండు మిక్కిలి వర్షింపఁ "బ్రవర్షణా"ఖ్యంబై పదునొకండు యోజనంబుల పొడవును నంతియ వెడలుపునుం గల గిరి యెక్కి రంత.
10.1-1674-శా.
ఆ శైలేంద్రముఁ జుట్టి రా విడిసి రోషావిష్టుఁడై మాగధో
ర్వీశుం డా వసుదేవ నందనులఁ దా వీక్షింపఁగా లేక త
న్నాశేచ్ఛన్ బిల సాను శృంగములఁ బూర్ణక్రోధుఁడై కాష్ఠముల్
రాశుల్గా నిడి చిచ్చుపెట్టఁ బనిచెన్ రౌద్రంబుతో భృత్యులన్.
10.1-1675-వ.
ఇట్లు జరాసంధపరిజన ప్రదీపితంబైన మహానలంబు దరికొనియె; నందు.
10.1-1676-క.
పొగ లెగసెఁ బొగల తుదలను
మిగులుచు మిడుఁగుఱులు నిగిడె మిడుఁగుఱగమి ము
న్నుగ బ్రహ్మాండము నిండను
భగభగ యని మంట లొదివె భయదము లగుచున్.

భావము:
రామకృష్ణులు పరుగెత్తి పరుగెత్తి పెక్కు ఆమడల దూరం వెళ్ళి సేదతీర్చుకోవడానికి దాగుకోడానికి తగిన చోటని తలచి దేవేంద్రుడు అధికంగా వానలు కురిపించడం చేత ప్రవర్షమనే పేరువహించి పదకొండు ఆమడల పొడవు అంతే వెడల్పు కల ఒక పర్వతాన్ని ఎక్కారు. మగధదేశాధీశుడైన జరాసంధుడు కోపవివశుడై ఆ పర్వతరాజం చుట్టూ దండువిడిశాడు. ఎంత వెతికించినా, అక్కడ రామకృష్ణులను కనుగొనలేకపోయాడు. వారిని నాశనం చేయాలని, ఆ కొండగుహల్లో చరియల్లో శిఖరాల్లో కట్టెలు కట్టలు కట్టలు పేర్చి దహించివేయ మని రౌద్రంతో సేవకులను ఆజ్ఞాపించాడు. ఈ విధంగా జరాసంధుని భృత్యులు ముట్టించిన మహాగ్ని రగులుకొని ఆ పర్వతాన్ని కాల్చివేసింది. అలా రగులుకున్న అగ్నితో ప్రవర్షణ పర్వతంపై ముందు పొగలు పైకి లేచాయి. పొగలమీద మిక్కుటంగా నిప్పురవ్వలు కమ్ముకున్నాయి. ఆ మిణుగురు గుంపులతో బ్రహ్మాండం నిండింది. తరువాత భయంకొల్పుతూ భగభగమని మంటలు లేచాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=201&padyam=1674

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: