Sunday, February 7, 2021

శ్రీ కృష్ణ విజయము - 144

( కాలయవనుడు నీరగుట )

10.1-1652-వ.
అనిన విని మేఘగంభీర భాషణంబుల హరి యిట్లనియె.
10.1-1653-సీ.
"భూరజంబులనైన భూనాథ! యెన్నంగఁ-
  జనుఁ గాని నా గుణ జన్మ కర్మ
నామంబు లెల్ల నెన్నంగ నెవ్వరుఁ జాల-
  రదియేల; నాకును నలవిగాదు
నేలకు వ్రేగైన నిఖిల రాక్షసులను-
  నిర్జించి ధర్మంబు నిలువఁబెట్ట
బ్రహ్మచే మున్నునేఁ బ్రార్థింపఁబడి వసు-
  దేవు నింటను వాసుదేవుఁ డనఁగ
10.1-1653.1-ఆ.
గరుణ నవతరించి కంసాఖ్యతో నున్న
కాలనేమిఁ జంపి ఖలుల మఱియు
ద్రుంచుచున్నవాఁడఁ దొడరి నీ చూడ్కి నీ
ఱైనవాఁడు కాలయవనుఁ డనఘ!
10.1-1654-వ.
వినుము; తొల్లియు నీవు నన్ను సేవించిన కతంబున నిన్ననుగ్రహింప నీ శైలగుహకు నేతెంచితి; నభీష్టంబులైన వరంబు లడుగు మిచ్చెద మద్భక్తులగు జనులు క్రమ్మఱ శోకంబున కర్హులు గా" రనిన హరికి ముచికుందుండు నమస్కరించి, నారాయణదేవుం డగుట యెఱింగి యిరువదియెనిమిదవ మహాయుగంబున నారాయణుం డవతరించు నని మున్ను గర్గుండు చెప్పుటఁ దలచి.

భావము:
ఇలా పలికిన ముచుకుందుని పలుకులు విని, మేఘగంభీర మైన కంఠంతో మాధవుడు ఇలా అన్నాడు. “ఓ రాజేంద్రా! భూమ్మీద ఉన్న దుమ్మురేణువులను అయినా లెక్కించడం సాధ్యమ అవుతుందేమో కాని, నాకు గల గుణములు, జన్మములు, కర్మములు, నామములు అన్నిటిని ఇన్ని అని ఎవరూ గణించ లేరు. ఇంత ఎందుకు నాకు కూడ సాధ్యం కాదు. భూదేవికి భారముగా అయిన రాక్షసులు అందరినీ జయించి, ధర్మాన్ని స్థాపించడం కోసం బ్రహ్మ పూర్వం నన్ను ప్రార్థించాడు. లోకానుగ్రహ కాంక్షతో నేను అంగీకరించి యదు వంశంలో వసుదేవుడి ఇంట అవతరించాను. వసుదేవ నందనుడిని కనుక నన్ను “వాసుదేవుడు” అంటారు. కంసనామంతో ఉన్న కాలనేమిని సంహరించాను. ఇంకా దుర్జనులను తునుమాడుతున్నాను. ఓ దోషరహితుడా! నీ చూపు తగిలి దగ్ధుడైనవాడు కాలయవనుడు. పూర్వం నీవు నన్ను ఆరాధించావు ఆ కారణం చేత నిన్ను అనుగ్రహించడం కోసం ఈ పర్వతగుహకు వచ్చాను. నీ కిష్టమైన వరాలు అడుగు ఇస్తాను. నా భక్తులైనవారు ఇక శోకం పొందుటకు తగరు.” అని శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు. ముచుకుందుడు నందనందనుడికి నమస్కరించి, అతడు సాక్షాత్తు నారాయణుడని తెలిసి ఇరువైయెనిమిదవ మహాయుగంలో భూమిపై విష్ణువు అవతరిస్తాడని తొల్లి గర్గాచార్యులు చెప్పిన మాట జ్ఞప్తికి తెచ్చుకుని ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=198&padyam=1654

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: