10.1-1677-వ.
మఱియు న మ్మహానలంబు బిలసాను శృంగ వృక్ష లతాకుంజపుంజంబుల దరికొని శిఖలు కిసలయంబులుగ విస్ఫులింగంబులు విరులుగ, సముద్ధూత ధూమపటలంబులు బంధురస్కంధశాఖా విసరంబులుగ, ననోహకంబు కైవడి నభ్రంకషం బై ప్రబ్బి కఠోరసమీరణ సమున్నత మహోల్కాజాల తిరోహిత వియచ్చర విమానంబును, వివిధ విధూమవిస్ఫులింగ విలోకనప్రభూత నూతనతారకా భ్రాంతి విభ్రాంతి గగనచరంబును, సంతప్యమాన సరోవర సలిలంబును, విశాలజ్వాలాజాల జాజ్వల్యమాన తక్కోల చందనాగరు కర్పూరధూమ వాసనావాసిత గగనకుహరంబును, గరాళకీలాజాల దందహ్యమాన కీచకనికుంజపుంజ సంజనిత చిటచిటారావ పరిపూరిత దిగంతరాళంబును, భయంకర బహుళతరశాఖాభిద్యమాన పాషాణఘోషణపరిమూర్ఛిత ప్రాణిలోకంబును సంతప్యమాన శాఖిశాఖాంతర నిబిడ నీడనిహిత శాబకవియోగ దుఃఖ డోలాయమాన విహంగకులంబును, మహాహేతిసందీప్యమాన కటిసూత్ర సంఘటిత మయూరపింఛ కుచకలశయుగళ భారాలస శబరకామినీసమాశ్రిత నిర్ఝరంబును, దగ్ధానేక మృగమిథునంబునునై యేర్చు నెడ.
భావము:
ఆ మహాగ్నికి గుహలలోని, చరియలమీద, శిఖరము పైన ఉన్న చెట్లు తీగలు పొదలు అంటుకుని మండిపోసాగాయి. జ్వాలలే చిగుళ్ళుగా మిణుగురులే పూలుగా పైకిలేచిన పొగలప్రోగులే దట్టమైన బోదెలుగా కొమ్మలుగా కనిపించగా. ఆ అగ్ని ఒక మహావృక్షంవలె ఆకాశాన్ని తాకుతూ వ్యాపించింది. దారుణమైన వాయువు చేత లేచిన గొప్ప నిప్పుకణికలు ఆకాశంలో తిరిగే విమానాలను మరుగుపరిచాయి. పొగలేక కణకణలాడే పలురకాల మిణుగురులను చూసి అవి క్రొత్త నక్షత్రాలని ఆకాశంలో సంచరిస్తున్న దేవతలు విభ్రాంతి చెందారు. సరస్సులలోని నీరు సలసల క్రాగిపోయింది. పెనుమంటలు అంటుకుని కాలుతున్న అగరు, తక్కోల, చందన, కర్పూర వృక్షాల పొగల సుగంధంతో ఆకాశమండలం అంతా పరిమళించింది. భయంకరమైన మంటలతో మండిపోతున్న వెదురుపొదల నుండి పుట్టిన చిటపట ధ్వనులు అన్ని దిక్కుల మధ్య ప్రదేశం అంతా నింపివేశాయి. ఘోరములు మిక్కుటములు అయిన మంటలచే పగిలిపోతున్న రాళ్ళమ్రోత వలన భూతజాలం మూర్ఛిల్లింది. దగ్ధమవుతున్న చెట్లకొమ్మల నడుమ దట్టమైన గూళ్ళలో నివసిస్తున్న తమ పిల్లల ఎడబాటువల్ల ఏర్పడిన దుఃఖంతో పక్షిసమూహం కలతచెందింది. తమ మొలనూళ్ళలో కట్టుకున్న నెమలి యీకలకు మంటలు అంటుకోగా కుండల వంటి కుచాల బరువుచే మందగమన లైన చెంచితలు సెలయేళ్ళను ఆశ్రయించారు. ఆ అగ్ని అనేక మృగమిథునాలను దహించివేసింది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=201&padyam=1677
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment