( జరాసంధుడు గ్రమ్మర వేయుట )
10.1-1670-చ.
ఇటు చనుదెంచి యున్న మగధేశ్వర వాహినిఁ జూచి యుద్ధ సం
ఘటనము మాని మానవుల కైవడి భీరుల భంగి నోడి ముం
దటి ధనమెల్ల డించి మృదుతామరసాభ పదద్వయుల్ క్రియా
పటువులు రామకేశవులు పాఱిరి ఘోరవనాంతరంబులన్.
10.1-1671-వ.
ఇట్లు పఱచుచున్న కృష్ణబలభద్రులం జూచి వారల ప్రభావంబు లెఱుంగక పరిహసించి.
10.1-1672-ఉ.
"ఓ యదువీరులార! రభసోద్ధతిఁ బాఱకుఁ; డిట్లు పాఱినం
బోయెడువాఁడఁ గాను; మిము భూమి నడంగిన మిన్ను బ్రాకినం
దోయధిఁ జొచ్చినం దగిలి త్రుంచెద" నంచు సమస్త సేనతోఁ
బాయక వచ్చె వెంటఁబడి బాహుబలాఢ్యుఁడు మాగధేశుఁడున్.
భావము:
అలా మథుర మీదకి దండెత్తి వచ్చిన మగధరాజు జరాసంధుడి సైన్యాన్ని చూసి, యుద్ధ ప్రయత్నం మానుకుని కేవలం సామాన్యజనుల వలె, రణభీరువుల వలె బెదిరిపోయి; తమ సంపదలు అన్నీ అక్కడే దిగవిడచి మెత్తటి తామరదళాల వంటి అడుగులు కలవారూ, కార్యశూరులూ అయిన రామకృష్ణులు భయంకరారణ్యంలో పడి పరిగెత్తసాగారు. అలా పారిపోతున్న బలరామకృష్ణులను చూసి, వారి మహిమలు గుర్తించలేక జరాసంధుడు ఎగతాళి చేస్తూ “ఓ యాదవవీరులారా! బలరామకృష్ణులారా! అలా వేగంతో పారిపోకండి. ఎంత ఎక్కువ వేగంతో పరిగెత్తి పారిపోతున్నా మిమ్మల్ని విడిచిపెట్టను. భూమిలో దాగినా, ఆకాశానికి ఎగిరినా, సముద్రంలో మునిగినా; వెనుకే వచ్చి మిమ్మల్ని హతమారుస్తాను.” అంటూ భుజబలసంపన్ను డైన ఆ మగధరాజు వదలకుండా సకల సేనలతో వారి వెంటపడ్డాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=200&padyam=1672
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment