Tuesday, February 9, 2021

శ్రీ కృష్ణ విజయము - 147

( ముచికుందుడు స్తుతించుట )

10.1-1661-ఆ.
సకల దిశలు గెలిచి సములు వర్ణింపంగఁ
జారుపీఠ మెక్కి సార్వభౌముఁ
డైన సతులగృహము లందుఁ గ్రీడాసక్తి
వృత్తినుండు; నిన్ను వెదకలేఁడు.
10.1-1662-ఆ.
మానసంబు గట్టి మహితభోగంబులు
మాని యింద్రియముల మదము లడఁచి
తపము చేసి యింద్రతయ గోరుఁ గాని నీ
యమృత పదముఁ గోరఁ డజ్ఞుఁ డీశ!
10.1-1663-సీ.
సంసారి యై యున్న జనునకు నీశ్వర!-
  నీ కృప యెప్పుడు నెఱయఁ గల్గు
నప్పుడ బంధంబు లన్నియుఁ దెగిపోవు-
  బంధమోక్షంబైనఁ బ్రాప్త మగును
సత్సంగమంబు; సత్సంగమంబున నీదు-
  భక్తి సిద్ధించు; నీ భక్తివలన
సన్ముక్తి యగు; నాకు సత్సంగమునకంటె-
  మును రాజ్యబంధ నిర్మూలనంబు
10.1-1663.1-తే.
గలిగినది దేవ! నీ యనుగ్రహము గాదె?
కృష్ణ! నీ సేవగాని తక్కినవి వలదు;
ముక్తి సంధాయి వగు నిన్ను ముట్టఁ గొలిచి
యాత్మబంధంబు గోరునే యార్యుఁ డెందు?

భావము:
అన్ని దిక్కులనూ జయించి సాటివారు కీర్తిస్తుంటే ఉన్నత పీఠం అధిష్ఠించిన చక్రవర్తి అయినప్పటికీ ఆడవారి మందిరాలలో కామసుఖాలు అనుభవిస్తాడే తప్ప నిన్ను అన్వేషించ లేడు. పరమేశా! జ్ఞానహీనుడు మనస్సును బంధించి, గొప్ప భోగములను విడనాడి, ఇంద్రియాటోపమును అణచివేసి, తపస్సుచేసి; ఇంద్రపదవి అభిలషిస్తాడే కాని నీ అమృత స్థానమును కోరుకోడు. అచ్యుతా! నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే సంసారమందు పరిభ్రమిస్తున్న పురుషుడికి ఆ సంసారబంధాలు సడలిపోతాయి. సంసార నివృత్తి కలిగినప్పుడు సత్పురుషులతో సహవాసం లభిస్తుంది. సత్సంగం చేత నీయందు భక్తి సిద్ధిస్తుంది. నీయందు నెలకొన్న భక్తి వలన ముక్తి చేకూరుతుంది. నాకు భాగవతోత్తముల సాంగత్యమునకు పూర్వమే రాజ్యపాశ నిర్మూలనం జరిగింది. ఇదంతా నీకృప కృష్ణా! నాకు నీ పాదసేవనం తప్ప తక్కినవేమీ వద్దు. విజ్ఞుడైనవాడు ముక్తిదాయకుడ వైన నిన్నుసేవించి తనకు ప్రతిబంధకా లైన శబ్దాది విషయభోగాలను కోరుకోడు కదా!


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=199&padyam=1663

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: