Tuesday, February 9, 2021

శ్రీ కృష్ణ విజయము - 148

( ముచికుందుడు స్తుతించుట )

10.1-1664-వ.
కావున రజస్తమస్సత్వగుణంబుల ననుబంధంబు లగు నైశ్వర్య శత్రు మరణ ధర్మాది విశేషంబులు విడిచి యీశ్వరుండును విజ్ఞాన ఘనుండును, నిరంజనుండును, నిర్గుణుండును, నద్వయుండును నైన పరమపురుషుని ని న్నాశ్రయించెదఁ; జిరకాలంబు కర్మఫలంబులచేత నార్తుండనై క్రమ్మఱం దద్వాసనల సంతుష్టుండనై తృష్ణం బాయక శత్రువులైన యింద్రియంబు లాఱింటిని గెలువలేని నాకు శాంతి యెక్కడిది? విపన్నుండ నైన నన్ను నిర్భయుం జేసి రక్షింపు” మనిన ముచికుందునికి హరి యిట్లనియె.
10.1-1665-ఉ.
"మంచిది నీదు బుద్ధి నృపమండన! నీవు పరార్థ్య మెట్లు వ
ర్తించిన నైనఁ గోరికల దిక్కునఁ జిక్కవు మేలు నిర్మలో
దంచితవృత్తి నన్ గొలుచు ధన్యు లబద్ధులు నెట్లు నీకు ని
శ్చంచలభక్తి గల్గెడిని సర్వము నేలుము మాననేటికిన్.

భావము:
కాబట్టి. సత్త్వము రజస్సు తమస్సు అను త్రిగుణాలను అనువర్తించు నట్టి ఐశ్వర్యము; శత్రు మరణము, ధర్మము ఇత్యాది విశేషములు అన్నింటినీ వదలి; నేను ఈశ్వరుడూ, విజ్ఞానఘనుడూ, మాయాకార్యము లైన రాగాదులు లేనివాడూ; త్రిగుణాలతో సంబంధము లేనివాడూ; తనంత తానే ఐన వాడూ; తన కంటే అధికుడు కలుగనివాడూ; పురుషులలో ఉత్తముడూ అయిన నిన్ను శరణు కోరుతున్నాను. బహుకాలం ప్రారబ్ధకర్మ ఫలము అనుభవిస్తూ దుఃఖితుడనై ఇంకా పూర్వజన్మ వాసనలచే సంతోషాన్ని పొందుతూ ఆశ వదలక శత్రువు లైన కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక, మనస్సు అనే ఆరు జ్ఞానేంద్రియాలను జయించలేని నాకు శాంతి ఎలా లభిస్తుంది? ఆపన్నుడ నైన నన్ను మన్నించి భయరహితుడిని కావించి కాపాడుము” అంటూ వేడుకొన్న ముచుకుందుడితో మాధవుడు ఇలా అన్నాడు. రాజులకు అలంకార మైనవాడా! నీ బుద్ధి మంచిది నీవు ఇతరుల కోసము ఎలా ప్రవర్తించినప్పటికీ, కోరికలకు ప్రలోభం చెందలేదు. నిర్మల మనస్సుతో నన్ను సేవించువారు ధన్యాత్ములు. వారు సంసారబద్ధులు కానేరరు. నీకు నా మీద దృఢమైన భక్తిని అనుగ్రహిస్తున్నాను, నీవు ఏదీ మానవలసిన పని లేదు, నా యందు మనసుంచి సమస్తం పరిపాలించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=199&padyam=1665

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :


No comments: