Friday, February 19, 2021

శ్రీకృష్ణ విజయము - 154

( ప్రవర్షణ పర్వతారోహణంబు )

10.1-1678-క.
ఇల నేకాదశ యోజన
ముల పొడవగు శైలశిఖరమున నుండి వడిన్
బలకృష్ణులు రిపుబలముల
వెలి కుఱికిరి కానఁబడక విలసితలీలన్.
10.1-1679-వ.
ఇట్లు శత్రువుల వంచించి యాదవేంద్రులు సముద్రపరిఖంబైన ద్వారకానగరంబునకుం జనిరి; జరాసంధుండు వారలు దగ్ధులై రని తలంచుచు బలంబులుం దానును మగధదేశంబునకు మరలి చనియె” నని చెప్పి శుకుండు వెండియు నిట్లనియె.

భావము:
అప్పుడు భూమ్మీద పదకొండామడల పొడవు ఉన్న ఆ కొండ కొమ్ము నుంచి బలరామకృష్ణులు జరాసంధుడి సైనికుల కంటపడకుండా వారిని దాటి కుప్పించి దూకేరు. ఈలాగున విరోధుల కనుగప్పి యదుకుల విభులైన రామకృష్ణులు సాగరమే అగడ్తగా కలిగిన తమ ద్వారకాపురికి చేరుకున్నారు. జరాసంధుడు వారు కాలిపోయారని భావించి తన సేనలతో మగధదేశానికి వెనుదిరిగి వెళ్ళిపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=201&padyam=1679

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: