Saturday, February 6, 2021

శ్రీ కృష్ణ విజయము - 142

( కాలయవనుడు నీరగుట )

10.1-1647-సీ.
వనరుహలోచను వైజయంతీదామ-
  శోభితు రాకేందు సుందరాస్యు
మకరకుండలకాంతి మహితగండస్థలుఁ-
  గౌస్తుభగ్రైవేయు ఘనశరీరు
శ్రీవత్సలాంఛనాంచితవక్షు మృగరాజ-
  మధ్యుఁ జతుర్భాహు మందహాసుఁ
గాంచన సన్నిభ కౌశేయవాసు గాం-
  భీర్య సౌందర్య శోభితుఁ బ్రసన్ను
10.1-1647.1-ఆ.
న మ్మహాత్ముఁ జూచి యాశ్చర్యమును బొంది
తన్మనోజ్ఞదీప్తిఁ దనకుఁ జూడ
నలవిగాక చకితుఁడై యెట్టకేలకుఁ
బలికెఁ బ్రీతి నవనిపాలకుండు.
10.1-1648-మ.
"శశివో? యింద్రుఁడవో? విభావసుఁడవో? చండప్రభారాశివో?
శశిచూడామణివో? పితామహుఁడవో? చక్రాంకహస్తుండవో?
దిశలున్ భూమియు మిన్ను నిండె నిదె నీ తేజంబుఁ జూడంగ దు
ర్వశ; మెవ్వండ విటేల వచ్చి తిచటన్ వర్తించె దేకాకివై.

భావము:
కలువల వంటి కన్నుల కలవాడు; వైజయంతి అనే వనమాలతో విలసిల్లువాడు; పున్నమి నాటి చంద్రబింబం వంటి అందమైన మోము కలవాడు; మకరకుండలాల కాంతితో నిండిన చెక్కిళ్ళు కలవాడు; కౌస్తుభమణితో అలంకరింపబడిన వక్షస్థలము కలవాడు; మేఘవర్ణపు దేహం కలవాడు; శ్రీవత్సము అనే పుట్టుమచ్చతో ఒప్పుతున్న ఉరం కలవాడు; సింహం నడుము వంటి నడుము కలవాడు; నాలుగు చేతులతో అలరారువాడు; చిరునవ్వులు చిందించువాడు; పసిడివన్నె పట్టుబట్టలు కట్టుకున్నవాడు; నిండు సౌందర్యంతో విలసిల్లువాడు; ప్రసన్నుడు అయిన ఆ మహానుభావుడిని ముచుకుంద మహారాజు చూసి ఆశ్చర్యపోయాడు. నారాయణుడి మనోహరమైన కాంతి చూడడానికి తనకి అలవి కాక పోవడంతో అతడు సంభ్రమం చెంది, చివరికి ప్రీతితో ఇలా అన్నాడు. “అయ్యా! నీవు చంద్రుడివో? మహేంద్రుడివో? అగ్నిదేవుడివో? సూర్యుడివో? చంద్రశేఖరుడివో? బ్రహ్మదేవుడివో? చక్రపాణివో? తెలియడం లేదు. దిక్కులూ భూమ్యాకాశములూ సర్వం నిండిన, నీ ప్రకాశం పరికించడానికి చూడ శక్యము కావటం లేదు. నీవు ఎవడవు? ఇక్కడకి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు?


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=198&padyam=1647

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: