Monday, September 7, 2020

శ్రీ కృష్ణ విజయము - 20

( అక్రూరుడు బృందావనం గనుట )

10.1-1199-వ.
కని బృందావనంబుఁ దఱియంజొచ్చి యందు సాయంకాలంబున నడవికి నెఱిగల మేతల వెంబడి దిగంబడి రాకచిక్కిన కుఱ్ఱుకోడె పడ్డ తండంబులం గానక పొద, యిరువు, మిఱ్ఱు, పల్లం,బనక తూఱి, పాఱి, వెదకి, కానక చీరెడు గోపకుల యాహ్వానశబ్దంబు లాకర్ణించుచుఁ; గోమలఘాసఖాదన కుతూహలంబులం జిక్కి మక్కువం గ్రేపులం దలంచి తలారింపక తమకంబులం దమతమ యంత నంభారావంబులు చేయుచు మూత్రంబులు స్రవింపఁ బరువు లిడు ధేనువులును; ధేనువులకు నోసరించుచు సద్యోజాతంబులగు తర్ణకంబుల వహించి నవసూతికలు వెనుతగులుటవలన దామహస్తులై చను వల్లవుల మెల్లన విలోకించుచు; మంద యిరు కెలంకులం గళంకరహితులై పులి, శివంగి, వేఁగి లోనగు వాలుమెకంబుల మొత్తంబుల వలన నప్రమత్తులై కుఠార, కుంత, శరాసన ప్రము ఖాయుధంబులు ధరియించి కావలితిరుగు వ్రేలం గడచి; నానావిధ సరసతృణకబళ ఖాదనగరిష్ఠలై గోష్ఠంబులు ప్రవేశించి రోమంథలీలాలసలై యున్న ధేనువులును; జన్నులు గుడిచి తల్లుల మ్రోలఁ బెల్లురేఁగి క్రేళ్ళుఱుకు లేగలుఁను; వెదలైన మొదవులం బైకొని పరస్పర విరుద్ధంబులై డీకొని కొమ్ముల యుద్ధంబులు సలుపు వృషభంబులును; నకుంఠితబలంబులఁ కంఠరజ్జువులం ద్రెంచుకొని పొదలుఱికి దాఁటి తల్లులం దూటి కుడుచు తఱపిదూడల దట్టించి పట్టనోపక గ్రద్దనఁ బెద్దలం జీరు గోపకుమారులును; గొడుకుల, మగల, మామలు, మఱందుల వంచించి పంచాయుధభల్ల భగ్నహృదయ లయి గృహకృత్యంబులు మఱచి శంకిలక సంకేతస్థలంబులఁ గృష్ణాగమ తత్పరలయి యున్న గోపకామినులును; గోష్ఠప్రదేశంబుల గోవులకుఁ గ్రేపుల విడిచి యొడ్డుచు, మరలం గట్టుచు, నీడ్చుచుం, గ్రీడించు గోపకులును; గోఖుర సముద్ధూత కరీష పరాగ పటలంబుల వలన నుల్లారి దులదుల నైన ధేనుదోహనవేళా వికీర్ణ పయోబిందు సందోహ పరంపరా సంపాదిత పంకంబులును; దోహనసమయ గోపకరాకృష్ట గోస్తన నిర్గతంబు లయి కలశంబులందుఁ బడియెడు క్షీరధారల చప్పుళ్ళును; మహోక్షకంఠ సంస్పర్శనస్నిగ్ధంబు లయిన మందిరద్వార దారుస్తంభంబుల పొంతలనుండి యులికిపడి నలుదిక్కులు గనుంగొని నూతనజనవిలోన కుపితంబులయి కరాళించు సారమేయంబులునుఁ గలిగి బలకృష్ణబాహుదండ ప్రాకారరక్షా విశేభూషంబైన ఘోషంబు బ్రవేశించి; యందు.

భావము:
అక్రూరుడు బృందావనంలో ప్రవేశించాడు సంధ్యా సమయం కావడంతో దూడలూ కోడెలూ తొలిచూలు గేదెలూ గుంపులు గుంపులుగా మేతకైవెళ్ళి అక్కడి పచ్చని పచ్చికలు మేస్తూ ఎంతకూ ఇంటికి మరలిరాకపోతే వాటిని వెదకుటకోసం పోయి పొదలు మరుగులూ మిట్టపల్లాలు లెక్కింపక పొదలలో దూరి పరిగెత్తుతూ వెదుకులాడి కనుపించక ఎలిగెత్తి పిలిచే గోపబాలుర సవ్వడి ఆలకించాడు. మెత్తని పచ్చిక మేసే కుతూహలంతో ఆగి అంతలో తమ లేగదూడలను తలచుకుని ఆలస్యం చేయకుండా మమకారంతో తమకు తామే అంభారావాలు చేస్తూ, పొదుగుల నుండి పాలుకార్చుకుంటూ, పరుగెత్తి వస్తున్న ఆవులను వీక్షించాడు. అప్పుడే పుట్టిన దూడలను అరకడ నుంచుకుని పలుపులు చేతపట్టుకుని క్రొత్తగా ఈనిన బాలెంత గోవులు వెంబడించగా మెల్లగా వెడుతున్న వల్లవులను చూసాడు. చిరుతలు, సివంగులు, పెద్ద పులులు లాంటి క్రూరజంతువుల బారిన పడకుండా జాగరూకలై మందకు రెండు వైపులా గండ్రగొడ్డళ్ళు, ఈటెలూ, విల్లులు పట్టుకుని కావలికాస్తున్న కాపరులను దాటి ముందుకు సాగాడు. అక్కడ రకరకాలైన మిసిమిగల కసవులు మేసి బలిసి కొట్టాలలో చేరి ఆవులు మెల్లగా నెమరువేస్తున్నాయి. దూడలు పాలు గుడిచి తల్లుల యెదుటే చెలరేగి చెంగు చెంగున దుముకుతున్నాయి. ఎదకు వచ్చిన ఆవులపై బడి దాటుతూ వృషభాలు ఎదురు నిలచి ఒకదానితో ఒకటి ఢీకొని కొమ్ములతో కుమ్ములాడుకుంటున్నాయి. ఆరునెలల వయసు గల దూడలు మొక్కవోని బలంతో మెడ పలుపులు త్రెంచుకుని పొదలు దూకి కుప్పించి దూకుతూ తల్లిపొదుగులను పొడిచి పొడిచి పాలు కుడుస్తున్నాయి. వాటిని అదలించి ఇవతలకు పట్టి ఈడువ లేక పిల్లలు పెద్దలను పిలుస్తున్నారు. కొడుకులను భర్తలను మామలను మరదులను మరపించి మన్మథశర పీడితలై గొల్లమగువలు ఇంటిపనులు మరచి జంకు వదలి సంకేత ప్రదేశాలకు చేరి కృష్ణుడి రాక కోసం వేచి ఉన్నారు. గోపకులు పసులకొట్టాలలో ఆవులకు దూడలను విడుస్తూ తిరిగి కట్టి వేస్తూ మరల పట్టి ఈడుస్తూ క్రీడిస్తున్నారు. ఆవుల గిట్టల వలన పొడి పొడియై వ్యాపించిన ఎండు పేడ దుమ్ము గోవులను పితికేటప్పుడు చెదిరిన పాల తుంపరల మొత్తముచే తడిసి అణిగిపోయి అడుసుగా మారింది. గోపాలుకులు పాలు పిండేటప్పుడు ఆవుల చనుల నుండి చెంబుల లోనికి కారే క్షీరధారలు జుంజుమ్మని చప్పుడు చేస్తున్నాయి. ఆబోతులు మెడ దురద తీర్చుకోవడానికి ఒరసికొనగా నునుపారిన గృహద్వారసీమలోని స్తంభాల సమీపాన ఉన్న కుక్కలు ఉలికిపడి క్రొత్త వారిని చూసి కోపంతో మొఱుగుతున్నాయి. ఆ గొల్లపల్లె బలరామకృష్ణులు భుజదండములనే ప్రాకారంతో పరిరక్షింపబడుతూ ఉన్నది. అక్రూరుడు సాయంసంధ్యా సమయంలో అలాంటి వ్రేపల్లె ప్రవేశించాడు. అలా ప్రవేశిస్తూనే అక్కడ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=137&padyam=1199

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: