Monday, September 28, 2020

శ్రీ కృష్ణ విజయము - 41

( కృష్ణుడు మథురను గనుట )

10.1-1247-మ.
పరిఖల్ గోటలు కొమ్మలుం బడగలుం బ్రాసాదముల్ వీధులున్
హరులుం దేరులు వీరులున్ గజములున్ హర్మ్యంబులున్ వాద్యముల్
తరుణుల్ ధాన్యములున్ ధనంబులు మహోద్యానంబులున్ దీర్ఘికల్
గర మాశ్చర్యరుచిం దనర్చు మథురన్ గాంచెన్ విభుం డంతటన్.
10.1-1248-వ.
కని య ప్పురంబు ప్రవేశించి వచ్చు సమయంబున.
10.1-1249-ఉ.
"నంద తపఃఫలంబు సుగుణంబుల పుంజము; గోపకామినీ
బృందము నోముపంట; సిరివిందు దయాంబుధి యోగిబృందముల్
డెందము లందుఁ గోరెడు కడింది నిధానము చేరవచ్చె నో! 
సుందరులార! రండు చని చూతము కన్నుల కోర్కిదీరఁగన్. "

భావము:
శ్రీకృష్ణుడు అల్లంతదూరంలో అగడ్తలు, కోటలు, బురుజులు, పతాకాలు, రాజభవనాలు, వీధులు, గుఱ్ఱాలు, రథాలు, వీరులు, ఏనుగులు, మేడలు, వాద్యాలు, యువతులు, ధాన్యాలు, ధనాలు, గొప్ప గొప్ప ఉద్యాన వనాలు, నడబావులు మున్నగు వాటి అత్యద్భుతమైన శోభతో ఒప్పునట్టి మధురను చూసాడు. అలా చూసి, ఆ పట్టణంలో ప్రవేశించి సంచరిస్తున్న సమయంలో “ఓ రమణులారా! నందుడి తపస్సుకు ఫలముగా కలిగిన వాడు, మేలిగుణాల ప్రోవు అయిన వాడు, గొల్ల పడచుల నోముల పంట ఐన వాడు, లక్ష్మీదేవి హృదయానికి ఆనందం కూర్చేవాడు, కరుణాసముద్రుడు, యోగులు అందరూ తమ మనస్సులో కోరుకునే అపురూపమైన పెన్నిధి వంటివాడు అయిన శ్రీకృష్ణుల వారు వస్తున్నారు. కన్నుల కాంక్ష తీరేలా వెళ్ళి వీక్షిద్దాము రండి”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=144&padyam=1249

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, September 26, 2020

శ్రీ కృష్ణ విజయము - 40

( శ్రీమానినీచోర దండకము )

10.1-1244-వ.
అని మఱియుం బ్రార్థించిన హరి యిట్లనియె.
10.1-1245-క.
"యదుకుల విద్వేషణుఁడై
మదమున వర్తించు కంసు మర్దించి భవ
త్సదనంబుఁ జూడ వచ్చెదఁ
బొద యీ స్యందనముఁ గొనుచుఁ బురమున కనఘా!"
10.1-1246-వ.
అని పలికిన నక్రూరుండు పురంబునకుం జని రామకృష్ణులు వచ్చిరని కంసున కెఱింగించి తన గృహంబునకుం జనియె; నంత నపరాహ్ణంబున బలభద్ర గోపాల సహితుండై కృష్ణుండు.

భావము:
అంటూ మరీ మరీ వేడుకుంటున్న అక్రూరునితో హరి ఇలా అన్నాడు. “పాపరహితుడవైన అక్రూరా! యాదవులకు శత్రువై గర్వంతో సంచరిస్తున్న కంసుణ్ణి సంహరించిన తర్వాత నీ గృహం సందర్శించడానికి వస్తాను. ఇప్పుడు నీవు ఈ రథాన్ని తీసుకుని నగరానికి వెళ్ళు.” ఇలా చెప్పిన శ్రీకృష్ణుడి మాటలు విని, అక్రూరుడు నగరంలోకి వెళ్ళి రామకృష్ణులు వచ్చారని కంసుడికి తెల్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు మధ్యాహ్నం సమయంలో బలరాముడు గోపకులు తాను కలిసి మథురానగరం ప్రవేశించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=143&padyam=1245

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 39

( శ్రీమానినీచోర దండకము )

10.1-1240-వ.
అనిన నతం డిట్లనియె.
10.1-1241-క.
"నీలోన లేని చోద్యము
లే లోకములందుఁ జెప్ప రీశ్వర! నీటన్
నేలన్ నింగిని దిక్కుల;
నీలో చోద్యంబు లెల్ల నెగడు మహాత్మా!"
10.1-1242-వ.
అని పలికి సాయంకాలంబునకు నక్రూరుండు మథురానగరంబు చేర రథంబు గడపె నంతట నటమున్న చని నందాదులు పురోపవనంబున విడిసి యుండ వారలం గూడుకొని కృష్ణుం డక్రూరునిం జూచి “నీవు రథంబు గొనుచు నగరంబునకుం జనుము మేము వెనుక వచ్చెద” మనిన నతం డిట్లనియె.

భావము:
ఇలా అడిగిన కృష్ణుడితో అక్రూరుడు ఇలా అన్నాడు. “స్వామీ నీలో లేని వింతలు ఏ లోకాలలోనైనా ఉంటాయని పెద్దలు చెప్పలేదు. ఇక నీటిలో, నేలలో, నింగిలో ఉంటాయా? మహాత్మా! సర్వదిక్కులలోని విచిత్రాలన్నీ నీలోనే ఉన్నాయి కదా.” ఇలా చెప్పి అక్రూరుడు సాయంకాలానికి మధురాపురి చేరేటట్లుగా రథాన్ని నడిపాడు. ముందుగా వెళ్ళిన నందుడు మొదలైనవారు పొలిమేరలోని తోపులో బసచేసి ఉన్నారు. కృష్ణుడు వారిని కలుసుకుని అక్రూరుడిని చూసి “నీవు రథాన్ని తోలుకుని పట్టణానికి వెళ్ళు. మేము తర్వాత వస్తాము” అని చెప్పగా అతడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=143&padyam=1241

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :


Thursday, September 24, 2020

శ్రీ కృష్ణ విజయము - 38

( శ్రీమానినీచోర దండకము )

10.1-1237-మ.
కలలం బోలెడి పుత్రమిత్ర వనితాగారాది సంయోగముల్
జలవాంఛారతి నెండమావులకు నాసల్ చేయు చందంబునం
దలఁతున్ సత్యములంచు; మూఢుఁడ వృధాతత్వజ్ఞుఁడన్నాకు నీ
విలసత్పాదయుగంబుఁ జూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతీ!"
10.1-1238-వ.
అని మఱియును వినుతింప, నక్రూరునికి యమునాజలంబుల లోనం దన మొదలి మేను చూపి, చాలించి, నటునికైవడిఁ దిరోహితుండైన, నక్రూరుండు నీరు వెడలి వెఱంగుపడుచు వచ్చి, రథారోహణంబు చేసిన హరి యిట్లనియె.
10.1-1239-క.
“జలములు చేరువ నున్నవి
తలపోయఁగ నీవు పోయి తడ వయ్యె; నదీ
జలముల నభమున ధరణిం
గలుగని చోద్యములు నీకుఁ గానంబడెనే?"

భావము:
లక్ష్మీనాథుడవైన శ్రీకృష్ణా! దాహం తీర్చుకోడానికి జలము వలె తోచే ఎండమావులకు ఆశపడినట్లు స్వప్న సమానము లయిన పుత్రులు మిత్రులు కళత్రములు గృహములు మొదలైన జంజాటము సత్యమని భావిస్తుంటాను. నేను మూఢుణ్ణి మిథ్యాతత్త్వజ్ఞుణ్ణి ఇలాంటి నాకు ప్రకాశించు నీ పాదాల జంటను చూపి కరుణతో కటాక్షించు.” అని మరల మరల తనను స్తోత్రం చేస్తున్న అక్రూరుడికి తన పూర్వరూపం చూపి నటుడు తన పాత్ర పోషణ అయ్యాక ఆ వేషాన్ని తెరమరుగైనట్లు, తిరిగి దానిని మరగుపరచి భగవంతుడు అంతర్ధానం అయిపోయాడు. అక్రూరుడు నీటి నుండి బయటకు వచ్చి ఆశ్చర్యపోతూ వచ్చి రథాన్ని అధిరోహించాడు. అప్పుడు కృష్ణుడు అతనితో ఇలా అన్నాడు. “నీళ్ళు దగ్గరలోనే ఉన్నాయి కదా. నీవు స్నానానికి వెళ్ళి చాలా సేపయింది. ఆకాశంలోనూ, భూమిలోనూ లేని వింతలేమైనా నదీజలాలలో కాని కన్పించాయా?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=143&padyam=1239

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 37

( శ్రీమానినీచోర దండకము )

10.1-1236-దం.
శ్రీమానినీమానచోరా! శుభాకార! వీరా! జగద్ధేతుహేతుప్రకారా! సమస్తంబు నస్తంగతంబై మహాలోలకల్లోల మాలాకులాభీల పాథోనిధిం గూలఁగా బాలకేళీగతిం దేలి నారాయణాఖ్యం బటుఖ్యాతిఁ శోభిల్లు నీ నాభికంజంబులో లోకపుంజంబులం బన్ను విన్నాణి యై మన్న యా బమ్మ యుత్పన్నుఁ డయ్యెం గదా పావ కాకాశ వాతావనీ వార్యహంకార మాయామహామానసాదుల్ హృషీకాదులున్ లోకముల్ లోకబీజంబులున్ నిత్యసందోహమై నీ మహాదేహమం దుల్లసించున్; వసించున్; నశించున్; జడత్వంబు లేకాత్మ యై యొప్పు నీ యొప్పిదం బెల్ల నోచెల్ల; చెల్లన్ విచారింపఁ దారెంత; వారెంత వారైన మాయాదులా మాయతోఁ గూడి క్రీడించు లోకానుసంధాత యౌ ధాత నిర్ణేతయే? నీ కళారాశికిం గొంద ఱంభోజగర్భాదు లధ్యాత్మ లందున్న శేషాధిభూతంబు లందు న్ననేకాధిదైవంబు లందున్ సదా సాక్షివై యుందువంచుం దదంతర్గతజ్యోతి వీశుండ వంచుం ద్రయీపద్ధతిం గొంద ఱింద్రాదిదేవాభిదానంబులన్, నిక్క మొక్కండ వంచున్ మఱిం గొంద ఱారూఢకర్మంబులం ద్రెంచి సంసారముం ద్రుంచి సన్యస్తులై మించి విజ్ఞానచక్షుండ వంచున్, మఱిం బాంచరాత్రానుసారంబునం దన్మయత్వంబుతోఁ గొందఱీ వాత్మ వంచున్, మఱిం గొంద ఱా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వుబాటింతు వంచున్; మఱిన్ నీవు నారాయణాఖ్యుండ వంచున్; శివాఖ్యుండ వంచున్; మఱిం బెక్కుమార్గంబులన్ నిన్ను నగ్గింతు; రెగ్గేమి? యేఱుల్ పయోరాశినే రాసులై కూడు క్రీడన్ విశేషంబు లెల్లన్ విశేషంబులై డింది నీ యం దనూనంబు లీనంబులౌ; నేక రాకేందుబింబంబు కుంభాంతరంభంబులం బింబితంబైన వేఱున్నదే? యెన్ననేలా ఘటాంతర్గతాకాశముల్ దద్ఘటాంతంబులం దేకమౌ రేఖ లోకావధిన్ వీక నే పోకలం బోక; యేకాకివై యుండు; దీశా! కృశానుండు నెమ్మోము, సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబు లంభోనిధుల్ గుక్షి, శల్యంబు లద్రుల్, లతాసాలముల్ రోమముల్, గాలి ప్రాణంబు, బాహుల్ సురేంద్రుల్, ఘనంబుల్ కచంబుల్, నభోవీధి నాభిప్రదేశంబు, రేలుంబగళ్ళున్ నిమేషంబు, లంభోజగర్భుండు గుహ్యంబు, వర్షంబు వీర్యంబు, నాకంబు మూర్ధంబుగా నేకమై యున్న నీమేని దండం బయోజాత గర్భాండముల్ మండితోదుంబరానోకహానేక శాఖా ఫలాపూరి తానంత జంతు ప్రకాండంబు లీలం బ్రసిద్ధోదరాశిస్థ జంతుప్రకారంబుగా నిండి యుండున్; మహారూప! నీ రూపముల్ వెగ్గలం బుగ్గడింపన్; లయాంభోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్ వేధకున్ వేదరాశిం బ్రసాదింపవే; ద్రుంపవే కైటభశ్రీమధుం జక్రివై మొత్తవే; యెత్తవే మందరాగంబు రాగంబుతోఁ గూర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్ మీదికిం ద్రోచి దోషాచరుం గొమ్ములన్ నిమ్ములం జిమ్ముచుం గ్రువ్వవే త్రెవ్వవే ఘోరవైరిన్ నృసింహుండవై దండివై, దండి వైరోచనిం జూచి యాచింపవే, పెంపవే మేను బ్రహ్మాండము న్నిండఁ, బాఱుండవై రాజకోటిన్ విపాటింపవే, రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్, శుద్ధ బుద్ధుండవై వైరిదా రాంతరంగంబుల న్నంతరంగంబులుంగాఁ గరంగింపవే పెంపు దీపింపవే కల్కిమూర్తిం బ్రవర్తించు నిన్నెన్న నేనెవ్వఁడన్; నన్ను మాయావిపన్నున్ విషణ్ణుం బ్రపన్నుం బ్రసన్నుండవై ఖిన్నతం బాపి మన్నింపవే పన్నగాధీశతల్పా! కృపాకల్ప! వందారుకల్పా! నమస్తే నమస్తే నమస్తే నమః.

భావము:
“ఓ శ్రీమన్నారాయణా! అభిమానవతి అయిన లక్ష్మీదేవి అంతరంగాన్ని అపహరించినవాడా! మంగళ స్వరూపం కలవాడా! ఓ వీరుడా! నిఖిల ప్రపంచ సృష్టికి కారణ మైన పృథివ్యాది పంచమహాభూతాలకూ కారణ మైనవాడా! మిక్కిలి చలించు తరంగశ్రేణిచే కలత నొందిన భయంకర జలరాశిలో సర్వప్రపంచం రూపుమాసి లీన మైపోయి నప్పుడు నీవు నారాయణ నామంతో ఖ్యాతిని వహించి బాలుడవై అందు తేలియాడావు. అప్పుడు నీ నాభికమలం నుంచి సకల భువనాలను సృజించు విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అగ్ని ఆకాశం వాయువు భూమి నీరు అహంకారము మాయ మహాత్తత్వము మనస్సు మొదలైనవీ ఇంద్రియములూ ఇంద్రియవృత్తు లైన శబ్ద స్పర్శ రూప రస గంధములూ లోకములూ లోకకారణములూ ఈ సమస్తమూ నీ మహా శరీరం నుండి పుట్టి పెరిగి నశిస్తూ ఉంటాయి. జడ స్వభావం లేక ఆత్మస్వరూపుడవై యున్న నీ మహిమ ఇలాంటిదని వర్ణించుటకు ఎంత గొప్పవారయినా సమర్ధులు కారు. మాయ మున్నగు తత్త్వములు జడములు కాన నీ స్వరూపం గ్రహించలేవు. లోకాలను సృజించే పరమేష్టి మాయా సంబంధ మైన గుణాలచే ఆవరింపబడున్నాడు. కనుక అతడు నిన్ను ఇలాంటివాడిగా నిర్ణయింపలేడు. హిరణ్యగర్భుడు మున్నగువారు నిన్ను ఆధ్యాత్మ ఆధిదైవ ఆధిభూతములకు అనగా దేహాంద్రియాధి దేవతలకు సాక్షిగా అంతర్యామిగా నియామకు డైన ఈశ్వరునిగా భావిస్తారు. వేదమార్గగాము లైన కొందరు కర్మయోగులు నీవు ఒక్కడవే ఇంద్రాది నామధేయాలతో నెగడుతుంటావు అంటారు. ఇది నిజ మంటున్నారు. మరికొందరు జ్ఞాన యోగులు అన్ని కర్మలను వదలి సంసారం త్యజించి సన్యాసులై నిన్ను విజ్ఞాన స్వరూపునిగా పేర్కొంటున్నారు. వేరొక కొందరు పాంచరాత్రాగమ పద్ధతిని అనుసరిం నీవు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నానిరుద్ధ భేధాలతో నలువురై సొంపు ఘటిస్తున్నా వంటున్నారు, కొందరు నీవు నారాయణుడ వనీ, కొందరు శివుడవనీ అనేక రకాలుగా శ్లాఘిస్తున్నారు. ఇందులో తప్పులేదు. ఏరులన్నీ సాగరాన్నే చేరుతున్నట్లు విశేషాలన్నీ నిశ్శేషంగా నీలోనే లీనమవుతున్నాయి. ఒకే పూర్ణచంద్రబింబము ఘటాలలోని జలాలలో పెక్కులుగా ప్రతిఫలించిన మాత్రాన దానికంటే ఈ ప్రతిబింబాలు వేరు కావు కదా. ఘటాంతర్గతమైన ఆకాశం ఘటం నశించగానే మహాకాశంలో చేరినట్లు లోకాలన్నీ నశించగానే నీవు ఏ జాడలం ద్రొక్కక ఒంటరివాడవై యుంటావు. ఓ ప్రభూ! అగ్ని నీ ముఖము; చంద్రసూర్యులు నీ కన్నులు; దిక్కులు నీ చెవులు; చెట్లు నీ రోమములు; గాలి నీ ప్రాణము; ఇంద్రాదులు నీ బాహువులు; మేఘాలు నీ తలవెంట్రుకలు; ఆకాశం నీ నాభి; రేయింబవళ్ళు నీ రెప్పపాట్లు; బ్రహ్మ నీ మేఢ్రము; వర్షము నీ వీర్యము; స్వర్గము నీ శిరస్సు; ఇలా నీ శరీరంలో బ్రహ్మాండములు అత్తి చెట్టు కొమ్మలలో ఉన్న పండ్ల వలె నీ అందు అనంత ప్రాణి సమూహం మహాసముద్రంలో జంతువుల మాదిరి నిండి ఉన్నాయి. ఓ విరాట్పురుషా! నీ రూపములు పొగడ్తకు అందనివి. మునుపు మత్స్యాకృతితో ప్రళయ సాగర మందు శత్రు వగు సోమకు నెదిరించి సాధించి వేదప్రపంచాన్ని బ్రహ్మకు ప్రసాదించావు కదా. హయగ్రీవుడవై చక్రముచే బూని మధు, కైటభులను సంహరించావు కదా. కూర్మ రూపంతో సంచరిస్తూ మందరగిరిని ఎత్తావు కదా. వరాహ రూపం ధరించి క్రుంగుతున్న భూమండలాన్ని లేవ నెత్తి హిరణ్యాక్షుని ఎముకలు విరుగునట్లు కోరలతో పొడిచి చంపావు కదా. భయంకర శత్రు వగు హిరణ్యకశిపుని నరసింహాకృతితో నీవు సంహరింప లేదా? ప్రతాపశీలి వగు నీవు వామనమూర్తివై బలిచక్రవర్తిని యాచించ లేదా? బ్రహ్మాండములు నిండునట్లు మేను పెంచలేదా? భార్గవ రాముడవై క్షత్రియ సమూహమును వధింప లేదా? దశరథ రాముడవై చంద్రబింబము వంటి మోము గల జానకి కొరకు దుర్మదంతో కూడిన రావణుని దునుమాడ లేదా? వాసుదేవాది రూపములను దాల్చి క్రూరులను శిక్షించ లేదా? శుద్ధబుద్ద స్వరూపుడవై శత్రుభార్యల మనస్సులు రహస్యముగా కరగించావు కదా. కల్కిరూపము ధరించి పెంపుతో వెలుగొందవా? నిన్ను పొగుడుటకు నేను ఏపాటివాణ్ణి; నేను మాయచే ఆపద పాలైన వాణ్ణి; దుఃఖము చెందిన వాణ్ణి; అనుగ్రహబుద్ధితో నా దిగులు దీర్చి నన్నాదరించు. ఆదిశేషుడు తల్పముగా గలవాడా! కరుణయే అలంకారముగా కలవాడా! నమస్కరించు వారికి కల్పవృక్షము వంటివాడా! నీకు అభివాదము. నీకు నమస్కారము. నీకు వందనము. నీకు ప్రణామము.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=143&padyam=1236

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, September 22, 2020

శ్రీ కృష్ణ విజయము - 36

( అక్రూరుని దివ్యదర్శనములు )

10.1-1235-వ.
మఱియుఁ జారు లక్షణలక్షిత నఖ పాద గుల్ఫ జాను జంఘోరు కటి నాభి మధ్యోదరుండును; సాదరుండును; శ్రీవత్స కౌస్తుభ వనమాలికా విరాజిత విశాలవక్షుండును; బుండరీకాక్షుండును; శంఖ చక్ర గదా పద్మ హస్తుండును; సత్వగుణ ప్రశస్తుండును; బ్రహ్మసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకరకుండల కిరీటాది విభూషణుండును; భక్తజనపోషణుండును; సుందర కపోల ఫాల నాసాధర వదన కర్ణుండును; నీలనీరద వర్ణుండును గంబుకంధరుండును; గరుణాగుణ బంధురుండును; ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును; శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతీలోర్జా విద్యాశక్తి మాయాశక్త్యాది సేవితుండునునై యొప్పు నప్పరమేశ్వరునకు మ్రొక్కి భక్తిసంభ్రమంబు లగ్గంబులుగ గద్గదకంఠుండై దిగ్గనం గరంబులు ముకుళించి యిట్లని వినుతించె.

భావము:
రమ్యమైన శుభలక్షణాలు గల గోళ్ళు, పాదములు, మడములు, మోకాళ్ళు, పిక్కలు, తొడలు, కటిప్రదేశము, నాభి, నడుము, కడుపు కలవాడు; ఆదరముతో కూడిన వాడు; శ్రీవత్సమనే పుట్టుమచ్చ, కౌస్తుభము అనే మణి, వనమాల అనే పేరు గలిగిన పూవులు ఆకులు చేర్చి కట్టి మెడ నుండి కాళ్ళ వరకు వ్రేలాడు మాలతో విరాజిల్లే వెడల్పైన రొమ్ము కలవాడు; తెల్లతామరల వంటి కన్నులు కలవాడు; సత్త్వగుణ సంపన్నుడు; జందెము, మొలతాడు, ముత్యాలపేరు, భుజకీర్తులు, అందెలు, కంకణాలు, మకరకుండలాలు, కిరీటము మొదలైన ఆభరణాలతో అలంకృత మైనవాడు; భక్తులను కాపాడేవాడు; చక్కని చెక్కిళ్ళు, నొసలు, ముక్కు, పెదవి, ముఖము చెవులు కలవాడు; నీలమేఘము వంటి దేహకాంతి కలవాడు; ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు మున్నగువారిచే పూజింపబడుతూ ఉండువాడు; లక్ష్మి, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇల, ఊర్జ, విద్య, అవిద్య, శక్తి, మాయ మున్నగు తేజోమూర్తులు శక్తులచే సేవింపబడేవాడు అయిన ఆ పరమాత్మునికి అక్రూరుడు మ్రొక్కాడు. భక్తిసంభ్రమాలతో తటాలున చేతులు జోడించి డగ్గుత్తికతో ఈవిధంగా స్తోత్రం చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=142&padyam=1235

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 35

( అక్రూరుని దివ్యదర్శనములు )

10.1-1234-సీ.
ఆ భోగి భోగపర్యంక మధ్యంబున;-
  వలనొప్పు పచ్చని వలువవాని
మేఘంబుపై నున్న మెఱుఁగు చందంబున-
  నురమున శ్రీదేవి యొప్పువాని
ముసురు తేఁటులు విప్ప ముఖచతుష్కముగల;-
  తనయుఁ డాడెడి బొడ్డుదమ్మివానిఁ
గదలని బహుపదక్రమవిశేషంబుల-
  రవము చూపెడి నూపురములవాని
10.1-1234.1-ఆ.
జలజగర్భ రుద్ర సనక సనందన
సద్ద్విజామర ప్రశస్యమాన
చరితుఁడైనవాని సౌందర్యఖనియైన
వాని నొక్క పురుషవర్యుఁ గాంచె.

భావము:
ఇంకా, ఆ అక్రూరుడు; ఆదిశేషుణ్ణి పానుపుగా చేసుకుని ఆ పానుపు మధ్య భాగంలో శయనించి ఉన్న అందాలగని అయిన పురుషోత్తముడిని దర్శించాడు. ఆ దివ్యపురుషుడు మెరిసిపోతున్న పసుపుపచ్చని పట్టువస్త్రం కట్టుకుని ఉన్నాడు. మేఘంలో మెరిసే మెరుపు లాగ, అతని వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఒప్పుతున్నది. మూగిన తుమ్మెదలు చెదరగా ఆయన నాభికమలంలో ఆ నాలుగు ముఖాల నందనుడు క్రీడిస్తున్నాడు. ఆ పురుషోత్తముడు కాలు కదపకుండానే, కాలిఅందెలు ఎన్నో పదక్రమాల విశేషాలతో వేదనినాదాలు వెలువరిస్తున్నాయి. ఆయన బ్రహ్మ, ఈశ్వర, సనక సనందన, సద్బ్రాహ్మణ, దేవతల చేత స్తుతింపబడుతుండే వాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=142&padyam=1234

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, September 19, 2020

శ్రీ కృష్ణ విజయము - 34

( అక్రూరుని దివ్యదర్శనములు )

10.1-1232-ఉ.
పోషిత బాంధవుండు యదుపుంగవుఁ డా జల మందుఁ గాంచె స
ద్భాషు సహస్రమస్తక విభాసిత భూషు నహీశు భూమిభృ
ద్వేషుఁ గృపాభిలాషుఁ బ్రతివీర చమూ విజిగీషు నిత్య సం
తోషు నరోషు నిర్దళితదోషు ననేక విశేషు శేషునిన్.
10.1-1233-వ.
మఱియు నీలాంబర సంయుతుండును సిద్ధోరగాది సన్నుతుండునునై యొప్పు న ప్పాపఱేనిం దప్పక కనుంగొని.

భావము:
అక్రూరుడు తక్కువవాడు కాదు బం ధువులను పోషించేవాడూ, యాదవులలో గొప్పవాడూనూ. ఆయన ఆ నదీ జలాలలో అశేషమైన విశేషాలు గల ఆదిశేషుణ్ణి దర్శించాడు. ఆ ఫణీంద్రుడు సద్భాషణాశీలం కల వాడు; వేయితలలపై ప్రకాశించే విభూషణాలు కలవాడు; నాగులకు ప్రభువు; మహారాజ వేషము ధరించినవాడు; దయార్ద్ర హృదయుడు; శత్రుసైన్యాన్ని జయించు శీలం గలవాడు; నిత్యం సంతోషంగా ఉండు వాడు; కోపం లేనివాడు; నిష్కళంకుడు. నల్లని వస్త్రాలు ధరించి సిద్ధులు నాగులు మొదలైన వారిచే చక్కగా స్తుతింపబడుతున్న ఆ సర్పరాజును అక్రూరుడు కనురెప్పలు ఆర్పకుండా చూసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=142&padyam=1232

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 33

( అక్రూరుని దివ్యదర్శనములు )

10.1-1229-ఉ.
స్నానము చేసిచేసి నది చల్లని నీటను రామకృష్ణులన్
మానుగఁ జూచి "వారు రథమధ్యముపై వసియించి యున్నవా
రీ నది నీటిలోపలికి నెప్పుడు వచ్చి?" రటంచు లేచి మే
ధానిధి చూచె వారిని రథస్థుల భక్తమనోరథస్థులన్.
10.1-1230-వ.
చూచి వెఱఁగుపడి.
10.1-1231-శా.
"కంటిన్ మున్ను రథంబుపై; జలములోఁ గంటిం దుదిం గ్రమ్మఱం
గంటిం దొంటి రథంబుమీఁద; నిదె యీ కల్యాణచారిత్రు లే
వెంటం దోఁచిరి రెండు దిక్కుల; మనోవిభ్రాంతియో? నీటిలో
నుం టాశ్చర్యము; చూతు" నంచు మఱియు న్నూహించి మగ్నాంగుఁడై.

భావము:
అలా వేదమంత్రాలు జపిస్తూ జపిస్తూ అక్రూరుడు మెల్లిగా స్నానం చేయసాగాడు. ఇంతలో అతనికి ఆ చల్లని నదీజలంలో బలరామకృష్ణులు చక్కగా కనబడ్డారు. “వీరు ఇంతదాక రథంలో కూర్చుని ఉన్నారు కదా. మరి ఈ యమున నీళ్ళలోకి ఎప్పుడు వచ్చారు? ” అనుకుంటూ లేచి, బుద్ధిశాలి అయిన ఆ అక్రూరుడు భక్తుల మనోరథాలు చేకూర్చే వారిద్దరూ మళ్ళీ ఆ రథంలోనే ఉండడం చూసాడు. అలా నీటిలోనూ రథంలోనూ కనబడుతున్న వారిని చూసి ఆశ్చర్యపడి. “ముందు రథంలో చూసాను. తరువాత నీటిలో వీక్షించాను. మళ్ళీ వారు ముందటి లాగే రథం మీదనే ఉండడం దర్శించాను. మంగళ స్వరూప గుణులైన రామకృష్ణులు ఎలా ఇక్కడ అక్కడా రెండు చోట్లా కనపడ్డారు. నా మనస్సు ఏమైనా భ్రమ పడిందా? నీళ్ళలో వీళ్ళుండడం ఆశ్చర్యంగా ఉంది. ఇంకోసారి చూస్తాను” అని తలంచి, తిరిగి నదీజలాలలో మునిగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=142&padyam=1231

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, September 18, 2020

శ్రీ కృష్ణ విజయము - 32

( కృష్ణుడు మథురకు చనుట )

10.1-1227-క.
అవలోకించెను గృష్ణుఁడు
ప్రవిమలకల్లోలపవన భాసితజన్య
న్నవసన్నపాపసైన్యం
గవిజనమాన్యం గళిందకన్యన్ ధన్యన్.
10.1-1228-వ.
కని, తత్కాళింది యందుఁ బరిక్షుణ్ణ మణిగణ సముజ్జ్వలంబు లగు జలంబులు ద్రావి, తరుసమూహ సమీపంబున రామసహితుండై కృష్ణుండు రథంబు ప్రవేశించె; నంత నక్రూరుండు వారలకు మ్రొక్కి వీడ్కొని కాళిందీహ్రదంబు జొచ్చి విధిపూర్వకంబుగా వేదమంత్రంబులు జపియించుచు.

భావము:
కృష్ణుడు యమునా నదిని దర్శించారు. ఆ యమున నిర్మలమైన తన పెద్ద అలలపై నుంచి చల్లటి గాలులు వీస్తుంది. పాపాలన్నిటినీ నశింపజేస్తుంది. ఆ నదిని పండితులు ఎంతో గౌరవిస్తారు. ఆ యమున కళింద పర్వతం కూతురు. పరమ ధన్యాత్మురాలు. అలా మథుర వెళ్తున్న కృష్ణుడు బలరాముడితో పాటు కాళింది కన్య అయిన యమునను చూసి, బాగా మెరుగు పెట్టిన మణులలా తళతళ మెరుస్తున్న ఆ నదీజలాన్ని త్రాగాడు. పిమ్మట చెట్ల దగ్గర ఆపిన రథాన్ని అధిరోహించాడు. అప్పుడు అక్రూరుడు వారిద్దరికీ నమస్కరించి, వారి అనుమతి తీసుకుని, కాళిందీ మడుగులో దిగి యథావిధిగా వేదమంత్రాలు జపిస్తూ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=141&padyam=1228

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, September 17, 2020

శ్రీ కృష్ణ విజయము - 31

( కృష్ణుడు మథురకు చనుట )

10.1-1224-వ.
అంత మఱునాడు సూర్యోదయకాలంబునం దనతోడఁ బయనంబునకు గమకించి నడచు గోపికలను “మరలివత్తు” నని దూతికా ముఖంబున నివర్తించి, కృష్ణుండు శకటంబులందుఁ గానుకలును గోరసంబు నిడికొని నందాదులైన గోపకులు వెనుదగుల నక్రూరచోదితంబైన రథంబెక్కి మథురాభిముఖుండై చను సమయంబున.
10.1-1225-చ.
"అదె చనుచున్నవాఁడు ప్రియుఁ డల్లదె తేరదె వైజయంతి య
ల్లదె రథ ఘోటకాంఘ్రి రజమా దెస మార్గము చూడుఁ" డంచు లో
నొదవెడి మక్కువన్ హరిరథోన్ముఖలై గములై వ్రజాంగనల్
గదలక నిల్చిచూచి రటు కన్నుల కబ్బినయంత దూరమున్.
10.1-1226-వ.
ఇట్లు నక్రూర రామ సహితుండై చని చని.

భావము:
శ్రీకృష్ణుడు మరునాటి ఉదయం తన వెంట వస్తామని సిద్ధపడుతున్న గోపికాస్త్రీలకు “మళ్ళీ వస్తా” నని దూతికల ద్వారా చెప్పించి, వారిని వెనుకకు మరలించాడు. బండ్ల నిండా కానుకలు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మున్నగు వాటిని ఎక్కించుకుని నందుడు మొదలుగా గల గోపకులు కూడా వస్తుండగా అక్రూరుడు తోలే రథం ఎక్కి శ్రీకృష్ణుడు మథురానగరం వైపు బయలుదేరి వెళ్తున్నాడు. అప్పుడు అలా మథురకు పయనమై పోతుండగా వ్రేపల్లెలోని వనితలు “అదిగో చూడు. మన ప్రియ కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు. అదిగో రథం. అదిగదిగో రథంమీది జెండా. రథానికి పూన్చిన గఱ్ఱాల పాదధూళి ఎలా లేస్తోందో చూడు. అదిగో అటు వైపే కృష్ణుడు వెళ్తున్నాడు చూడండి” అంటూ కళ్ళకి కనపడినంత దూరం పోయేదాకా కదలక మెదలక అలాగే చూస్తూ నిలబడిపోయారు. అలా పయనమైన బలరామకృష్ణులు అక్రూరుడితో కలసి వెళ్తూ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=141&padyam=1225

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 30

( వ్రేతలు కలగుట )

10.1-1222-మ.
"హరినేలా కొనిపోయె" దంచు మన మా యక్రూరుఁ బ్రార్థింతమా?
హరిఁ "బోనీకుఁడు నిల్పరే" యనుచు నేఁ డర్చింతమా వేల్పులన్?
హరిపాదంబుల కడ్డముల్ పడుదమా; హా దైవమా" యంచు నా
తరుణుల్ కొప్పులుఁ జీరలున్ మఱచి కందర్పజ్వర భ్రాంతలై.
10.1-1223-మ.
ఉవిదల్ సిగ్గులు మాని కన్గవల నీ రొండొండ వర్షించుచున్
వివశత్వంబులతోఁ గపోలతట సంవిన్యస్త హస్తాబ్జలై
పవనోద్ధూతలతాభలై "మముఁ గృపం బాలింపు గోవింద! మా
ధవ! దామోదర!" యంచు నేడ్చిరి సుజాతంబైన గీతంబులన్.

భావము:
ఇలా అనుకుంటూ ఆ గొల్లభామలు మదనతాపంతో కంది భ్రమచెందారు. తమ కొప్పులు, కోకలు జారిపోడం కూడా చూసుకోవడం లేదు. “మా కృష్ణుణ్ణి ఎందుకు తీసుకుపోతావని అక్రూరుణ్ణి ప్రార్ధిద్దామా లేకపోతే ఆ నందనందనుడిని పోనీయకుండా ఇక్కడే ఉంచమని దేవతలను పూజిద్దామా” లేదా “ఓ దేముడా!” అంటూ ఆ హరి కాళ్ళకే అడ్డం పడదామా అనుకోసాగారు. వనితలు సిగ్గులు విడిచి రెండు కళ్ళమ్మట బొటబొటా కన్నీరు కారుస్తూ మైమరచి తమ చిక్కని చెక్కిళ్ళమీద కరకమలాలు చేర్చి గాలికి కంపించే తీగల వలె “ఓ గోవిందా! మాధవా! దామోదరా! మమ్ము దయతో కాపాడు” అంటూ స్వరబద్ధంగా తాళబద్దంగా రాగాలు తీస్తూ పాటలు పాడుతూ ఏడ్చారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=140&padyam=1223

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, September 16, 2020

శ్రీ కృష్ణ విజయము - 29

( వ్రేతలు కలగుట )

10.1-1220-క.
పురసతుల విలోకనములు
సరసాలాపములు నర్మసంభోగములున్
మరిగి హరి మనల నొల్లఁడు;
నరవరు లో! యమ్మ! నూతనప్రియులు గదే.
10.1-1221-క.
పుట్టెన్నఁడు హరి నెఱుఁగని
పట్టణసుందరుల కితనిఁ బతిఁ జేసి కడున్
దట్టపు విరహాగ్నులకును
గట్టిఁడి దైవంబు ఘోషకాంతల వెదకెన్.

భావము:
నగరంలోని నీటుకత్తెల చూపులూ, సరస సంభాషణలూ, తెరచాటు కలయికలూ మరిగి, ఓ యమ్మా! మన మాధవుడు మనని చూడడే. భూపతులు క్రొత్తవాటినే కోరుతుంటారు కదే. క్రూరపు దైవం పుట్టింది మొదలు కృష్ణుణ్ణి ఎప్పుడూ చూసి ఎరుగని ఆ పట్టణ పడచులకేమో అతగాణ్ణి పతిగా చేసాడు. మిక్కుటమైన వియోగాగ్నికి ఆహుతి గావించడం కోసమేమో గొల్లపల్లె గోపికలను వెదకి పట్టు కొన్నాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=140&padyam=1221

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 28

( వ్రేతలు కలగుట )

10.1-1217-ఉ.
"రమ్మని చీరినంతనె పురంబున కేగెడుఁ గాని నన్ను నీ
కొమ్మలు నమ్మినారు మరుకోలల కగ్గము చేసి పోవఁగా
ముమ్మరమైన తాపమున మ్రొగ్గుదురో యనఁ డంబుజాక్షుఁ డా
యమ్మలు గోపవృద్ధులు ప్రయాణము వల్దనరైరి చెల్లరే!
10.1-1218-శా.
అక్రూరుం డని పేరుపెట్టుకొని నేఁ డస్మన్మనోవల్లభుం
జక్రిన్ మాకడఁ బాపికొంచు నరుగం జర్చించి యేతెంచినాఁ
డక్రూరుం డఁట క్రూరుఁ డీతఁడు నిజం బక్రూరుఁ డౌనేని ని
ర్వక్రత్వంబునఁ గృష్ణుఁ బెట్టి తన త్రోవంబో విచారింపఁడే?
10.1-1219-ఉ.
ఫుల్లసరోజలోచనలు పూర్ణసుధాంశుముఖుల్ పురాంగనల్
మెల్లనె యెల్లి పట్టణము మేడలనుండి సువర్ణ లాజముల్
చల్లఁగ వారిఁ జూచి హరి సంగతి చేయఁదలంచుఁ గాక వ్రే
పల్లె వసించు ముద్దియలపైఁబడ నేల తలంచు నక్కటా!

భావము:
ఆ గోపకాంతలు ఇంకా ఇలా అనుకున్నారు “రమ్మని పిలగానే మధురకు పయనమౌతున్నాడు కానీ మన కమలాక్షుడు మన కన్నయ్య “నన్ను ఈ భామలు నమ్ముకుని ఉన్నారే, అటువంటి మనల్ని మదనబాణాల పాలు చేస్తే, ఎంతో తాపంతో కుమిలిపోతారు కదా” అని అనుకోలేదు. పోనీ మన అమ్మలక్కలు మన గొల్ల పెద్దలు మధురకు వెళ్ళవద్దని మాధవునితో మాటవరసకైనా అనటం లేదు కదా. అక్రూరుడని పేరు పెట్టుకుని మా హృదయేశ్వరుడైన కృష్ణుణ్ణి ఇవాళ మా నుండి దూరంగా తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఇతగాడు అక్రూరుడు కాదు నిజానికి క్రూరుడే. అక్రూరుడైతే కుటిల ఆలోచనలు మానేసి, మన కృష్ణుణ్ణి దిగవిడచి తన దారిని తాను వెళ్తానని అనుకునే వాడు కదా. వికసించిన పద్మముల వంటి కన్నులూ, పున్నమి చంద్రుని వంటి మోమూ కల మథురాపురం లోని అందగత్తెలు రేపు మేడలెక్కి బంగారపు లాజలు మెల్లగా తనపై చల్లుతారు. చల్లగా వారిని చూసాకా కృష్ణుడు వారిన కలవాలని అనుకుంటాడు అంతే కాని, అయ్యో! వ్రేపల్లెలోని గోపికల పొందు ఎందుకు కోరుకుంటాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=140&padyam=1219

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, September 15, 2020

శ్రీ కృష్ణ విజయము - 27

( వ్రేతలు కలగుట )

10.1-1215-ఉ.
"మేటి గృహస్థు బ్రహ్మ యని మిక్కిలి నమ్మితి మమ్మ! చూడ నే
పాటియు లేదు మాకుఁ బరిపాలకుఁడైన సరోజనేత్రు ని
చ్చోట వసింపనీక నొకచోటికిఁ బో విధియించి పిన్నబి
డ్డాటలు చేసె నీ దుడుకు లక్కట! భారతికైనఁ జెప్పరే."
10.1-1216-వ.
అని విధిం దూఱుచు మదనతాపాయత్త చిత్తలై.

భావము:
“బ్రహ్మదేవుడు నిష్ఠగల సంసారి అని చాలా గట్టిగా నమ్మాము గదమ్మా! తీరా చూస్తే, ఆయనలో ఏమాత్రం ధర్మం లేదు, మన కృష్ణుడు, మన ప్రభువు, పుండరీకాక్షుడిని ఇక్కడ ఉండనీయకుండ వేరొకచోటికి పోయేలా చేసి చిన్నపిల్లల ఆట్లాడుతున్నాడు చూడు. అయ్యో! ఆయన ఇల్లాలు సరస్వతీ దేవితో ఐనా ఈ దుండగపు చేష్టలను చెప్పండే.” ఈ విధంగా బ్రహ్మదేవుడిని నిందిస్తూ గోపికలు మన్మథతాపానికి అధీనమైన చిత్తాలు కలవారై. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=140&padyam=1215

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :


శ్రీ కృష్ణ విజయము - 26

( వ్రేతలు కలగుట )

10.1-1212-వ.
అని నియమించె నంత నక్రూరుండు మథురకు హరిం గొనిపోయెడి నని యెఱింగి వ్రేతలు గలంగి.
10.1-1213-మ.
హరినవ్వుల్ హరిమాటలున్ హరిమనోజ్ఞాలాపముల్ లీలలున్
హరివేడ్కల్ హరిమన్ననల్ హరికరాబ్జాలంబనాహ్వానముల్
హరిణీలోచన లందఱున్ మఱి యుపాయం బెట్లొకో యంచు లో
నెరియన్ ముచ్చటలాడి రంత గములై యేకాంత గేహంబులన్.
10.1-1214-వ.
మఱియుం దమలో నిట్లనిరి.

భావము:
అని కృష్ణుడు ఆనతి ఇచ్చాడు. అక్రూరుడు రామకృష్ణులను వెంటపెట్టుకుని మధురానగరికి వెళతాడనే వార్త తెలియగానే గోపవనితలు కలత చెందారు. శ్రీ కృష్ణుడి మాటలూ, చిరునవ్వులూ, మనసులు హరించే సరస సల్లాపాలు, విలాసాలూ, వినోదాలూ, ఆదరాభిమానాలూ, ఆయన తన చేతితో పట్టుకుని పిలుచుటలూ ఇవన్నీ ఇకపై అనుభవించే ఉపాయాలు ఏమిటా అని ఆ లేడికన్నుల గొల్లభామినులు ఖిన్నలై కుములుతూ ఏకాంతగృహాలలో కలుసుకుని చర్చించుకున్నారు. ఇంకా వారు తమలోతాము ఇలా అనుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=140&padyam=1213

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, September 14, 2020

శ్రీ కృష్ణ విజయము - 25

( అక్రూర నందాదుల సంభాషణ )

10.1-1209-మ.
నెఱి నేడిక్కడ నీవు రాఁగ వగతో నీతోడ నేమైన నా
కెఱుఁగం జెప్పుమటంచుఁ జెప్పరు గదా యేమందు? రా వార్త యే
తెఱఁగున్ లేదని డస్సిరో వగచిరో దీనత్వముం జెందిరో
వెఱతో నా తలిదండ్రు లెట్లుపడిరో? విన్పింపు మక్రూరకా!
10.1-1210-వ.
మఱియు నీవేమి కారణంబున వచ్చి” తని హరి యడిగిన నతండు కంసునికి నారదుండు వచ్చి చెప్పిన వైరానుబంధ ప్రకారంబును గంసుండు దేవకీ వసుదేవుల వధియింపం గమకించి మానిన తెఱంగును ధనుర్యాగంబు పేరుచెప్పి పుత్తెంచిన ప్రకారంబు నెఱింగించిన రామకృష్ణులు నగి; యంత తమ్ముఁ బరివేష్టించిన నందాది గోపకులం జూచి కృష్ణుం డిట్లనియె.
10.1-1211-శా.
"భూనాథుండు మఖంబుఁ జూఁడఁ బిలువం బుత్తెంచినాఁ డవ్విభుం
గానం బోవలెఁ బాలు నెయ్యి పెరుగుల్గట్నంబులుం గానుకల్
మీ నేర్పొప్పఁగఁ గూడఁబెట్టుఁడు తగన్ మీమీ నివాసంబులన్
యానంబుల్ గొనిరండు పొండు మథురా యాత్రాభిముఖ్యంబుగన్.

భావము:
మరి అక్రూరా! నీవు ఇక్కడకి వస్తున్నావని తెలిసి నాకు చెప్పమని నా తల్లితండ్రులు నీతో ఏమైనా చెప్పారా. వారేమన్నారు. నా కబురులు తమకేమీ తెలియక, వారు శుష్కించి పోయారేమో. దుఃఖపడుతున్నారు కాబోలు. దైన్యాన్ని చెందారేమో. భయంతో వారెలాంటి పాట్లు పడ్డారో నాకు చెప్పు. మరి ఇంకా నీవు దేనికోసం ఇక్కడికి వచ్చావో చెప్పు.” అని కృష్ణుడు అడిగాడు. అప్పుడు అక్రూరుడు నారదుడు వచ్చి చెప్పిన కంసుడికి పూర్వ జన్మ నుండి వచ్చిన శత్రుత్వపు భావమూ, అతడు దేవకీవసుదేవులను చంపబోయి మానిన విషయమూ, ధనుర్యాగము అనే మిషతో తనను పంపిన ప్రకారము వినిపించాడు. అవన్నీ విని రామకృష్ణులు పక్కున నవ్వారు. ఆ మీదట చుట్టూ ఉన్న నందుడు మొదలైన గొల్లపెద్దలతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “రాజు కంసుడు ధనుర్యాగం దర్శించడానికి రమ్మని పిలుపు పంపించాడు. ఆ ప్రభువును చూడ్డానికి వెళ్ళాలి. మీమీ ఇళ్ళలోగల పాలు, పెరుగు, నెయ్యి, కట్నాలు, కానుకలు మీ నేర్పుకొద్దీ సమకూర్చండి. బండ్లు సిద్దం చేసుకుని రండి. మనం మధురానగరానికి వెళ్ళాలి.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=140&padyam=1211

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 24

( అక్రూర నందాదుల సంభాషణ )

10.1-1206-క.
"చెలియలు మొఱయిడ నల్లుర
ఖలుఁడై పొరిగొనిన యట్టి కంసుఁడు బ్రదుకం
గలదే మనకి దశార్హుల
కిలపై? మీ క్షేమ మింక నేమని యడుగన్?"
10.1-1207-వ.
అని పలికె నంత నక్రూరుం డొక పర్యంకంబున సుఖోపవిష్టుండై యుండ హరి యిట్లనియె.
10.1-1208-మ.
“శుభమే నీకుఁ? బ్రమోదమే సఖులకుం? జుట్టాలకున్ క్షేమమే?
యభయంబే ప్రజకెల్ల? గోత్రజుల కత్యానందమే? మామ ము
క్త భయుండే? వసుదేవ దేవకులు తత్కారాగృహం బందు మ
త్ప్రభవ వ్యాజ నిబద్ధులై బ్రతికిరే ప్రాణానిలోపేతులై?

భావము:
“ఓ అక్రూరా! చెల్లెలు మొరపెడుతున్నా వినకుండా అల్లుళ్ళను చంపిన ఆ నీచుడు కంసుడు బ్రతికి ఉండగా దశార్హ వంశం వారైన మనకు కుశలం ఈ భూమ్మీద లేదు కదా. ఇంక మీ క్షేమసమాచారాలు ఏమని అడిగేది." అలా నందమహారాజు పలకరించాక, మంచం మీద సుఖంగా కూర్చుని ఉన్న అక్రూరుడితో కృష్ణుడు ఇలా అన్నాడు. “అక్రూరా! నీకు కుశలమేనా? మీ స్నేహితులు అందరూ సంతోషంగా ఉన్నారు కదా! చుట్టాలకు క్షేమమా? ప్రజలంతా భయాలు లేకుండా ఉన్నారా? కులబంధువులు అందరూ ఆనందంగా ఉన్నారా? మా మామ కంసుడు నిర్భయంగా ఉన్నాడా? నన్ను కన్నారన్న సాకుతో కారాగారంలో బంధింపబడిన దేవకీ వసుదేవులు ప్రాణాలతో బ్రతికే ఉన్నారా? వివరంగా చెప్పు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=140&padyam=1206

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Wednesday, September 9, 2020

శ్రీ కృష్ణ విజయము - 23

( అక్రూరుడు బలకృష్ణుల గనుట )

10.1-1204-క.
అక్రూరులైన జనుల న
వక్రగతిం గాచు భక్తవత్సలుఁ డంత
న్నక్రూరుఁ గౌఁగిలించెను
జక్రాంకిత హస్తతలముఁ జాచి నరేంద్రా.
10.1-1205-వ.
మఱియు నక్రూరుఁడు బలభద్రునికిం బ్రణతుం డయినఁ నతండు గౌఁగిలించి చెట్టపట్టుకొని కృష్ణసహితుండై గృహంబునకుం గొనిపోయి మేలడిగి గద్దియనిడి పాదప్రక్షాళనంబు చేసి మధుపర్కంబు సమర్పించి గోవునిచ్చి యాదరంబున రసవదన్నంబు పెట్టించి తాంబూల గంధ మాల్యంబు లొసంగె; నయ్యవసరంబున నందుం డుపవిష్టుండైన యక్రూరుని సత్కరించి' యిట్లనియె.

భావము:
ఓ పరీక్షన్మహారాజా! సాధుస్వభావులను చక్కగా పాలించే భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు చక్రం గుర్తులు గల తన చేతులు చాపి అక్రూరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. అటుపిమ్మట, అక్రూరుడు బలరాముడికి ప్రణమిల్లాడు. అతడు అక్రూరుని కౌఁగిలించుకున్నాడు. అతడి చెయ్యి పట్టుకుని కృష్ణునితో కూడ తమ గృహానికి తీసుకువెళ్ళాడు. కుశలప్రశ్నలు అడిగాడు. అరుగు మీద కూర్చుండబెట్టి కాళ్ళు కడిగాడు. మధుపర్కం సమర్పించాడు. ఆవుని దానం చేసాడు. సాదరంగా కమ్మని భోజనం పెట్టించాడు. తాంబూలం, చందనం, పూలదండలు ఇచ్చాడు. ఆ సమయంలో నందుడు అక్కడ కూర్చున్న అక్రూరుడిని ఆదరించి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=139&padyam=1205

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 22

( అక్రూరుడు బలకృష్ణుల గనుట )

10.1-1201-మ.
కనె నక్రూరుఁడు పద్మనేత్రులను రంగద్గాత్రులన్ ధేను దో
హన వాటీగతులన్ నలంకృతుల నుద్యద్భాసులం బీత నీ
ల నవీనోజ్జ్వలవాసులం గుసుమమాలాధారులన్ ధీరులన్
వనితాకాములఁ గృష్ణరాముల జగద్వంద్యక్రమోద్దాములన్.
10.1-1202-క.
కని వారల పాదములకు
వినయంబున మ్రొక్కె భక్తి వివశుం డగుచుం
దనువునఁ బులకాంకురములు
మొనయఁగ నానందబాష్పములు జడిఁ గురియన్.
10.1-1203-వ.
తదనంతరంబ.

భావము:
పద్మముల వంటి కన్నులు కలవారు, చక్కటి వన్నెగల మేనులు కలవారు, వెల్లివిరిసే ప్రకాశము కలవారు, పచ్చని నల్లని క్రొంగొత్త వలువలు ధరించినవారు, పూలదండలు దాల్చినవారు, ధైర్యవంతులు, యువతుల పాలిటి నవమన్మథాకారులు, సకల జనులు మెచ్చుకొనే మర్యాదస్తులు అయిన శ్రీకృష్ణ బలరాములు అక్రూరుడు చేరే సరికి చక్కగా అలంకరించుకొని పాలు పితికే శాలలలో ఉన్నారు. అక్కడ వారిని అక్రూరుడు చూసాడు. అలా చూసిన అక్రూరుడు భక్తిపరవశుడు అయ్యాడు. దేహం పులకించింది. ఆనందాశ్రువుల జాలువారుతుండగా, ఆ రామకృష్ణుల పాదాలకు వినయంతో నమస్కరించాడు. అలా అక్రూరుడు వారికి నమస్కరించగా....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=139&padyam=1202

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Monday, September 7, 2020

శ్రీ కృష్ణ విజయము - 21

( అక్రూరుడు బృందావనం గనుట )

10.1-1200-క.
జలజాంకుశాది రేఖలు
గల హరిపాదముల చొప్పుఁ గని మోదముతోఁ
బులకించి రథము డిగి యు
త్కలికన్ సంతోషబాష్ప కలితాక్షుండై.

భావము:
పద్మము, అంకుశము మొదలగు శుభ లక్షణములు కల కృష్ణుడి పాద ముద్రలను అక్రూరుడు సంతోషంతో తిలకించాడు. మేను పులకించింది. కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోగా, అతను ఉత్కంఠతో రథం దిగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=137&padyam=1200

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 20

( అక్రూరుడు బృందావనం గనుట )

10.1-1199-వ.
కని బృందావనంబుఁ దఱియంజొచ్చి యందు సాయంకాలంబున నడవికి నెఱిగల మేతల వెంబడి దిగంబడి రాకచిక్కిన కుఱ్ఱుకోడె పడ్డ తండంబులం గానక పొద, యిరువు, మిఱ్ఱు, పల్లం,బనక తూఱి, పాఱి, వెదకి, కానక చీరెడు గోపకుల యాహ్వానశబ్దంబు లాకర్ణించుచుఁ; గోమలఘాసఖాదన కుతూహలంబులం జిక్కి మక్కువం గ్రేపులం దలంచి తలారింపక తమకంబులం దమతమ యంత నంభారావంబులు చేయుచు మూత్రంబులు స్రవింపఁ బరువు లిడు ధేనువులును; ధేనువులకు నోసరించుచు సద్యోజాతంబులగు తర్ణకంబుల వహించి నవసూతికలు వెనుతగులుటవలన దామహస్తులై చను వల్లవుల మెల్లన విలోకించుచు; మంద యిరు కెలంకులం గళంకరహితులై పులి, శివంగి, వేఁగి లోనగు వాలుమెకంబుల మొత్తంబుల వలన నప్రమత్తులై కుఠార, కుంత, శరాసన ప్రము ఖాయుధంబులు ధరియించి కావలితిరుగు వ్రేలం గడచి; నానావిధ సరసతృణకబళ ఖాదనగరిష్ఠలై గోష్ఠంబులు ప్రవేశించి రోమంథలీలాలసలై యున్న ధేనువులును; జన్నులు గుడిచి తల్లుల మ్రోలఁ బెల్లురేఁగి క్రేళ్ళుఱుకు లేగలుఁను; వెదలైన మొదవులం బైకొని పరస్పర విరుద్ధంబులై డీకొని కొమ్ముల యుద్ధంబులు సలుపు వృషభంబులును; నకుంఠితబలంబులఁ కంఠరజ్జువులం ద్రెంచుకొని పొదలుఱికి దాఁటి తల్లులం దూటి కుడుచు తఱపిదూడల దట్టించి పట్టనోపక గ్రద్దనఁ బెద్దలం జీరు గోపకుమారులును; గొడుకుల, మగల, మామలు, మఱందుల వంచించి పంచాయుధభల్ల భగ్నహృదయ లయి గృహకృత్యంబులు మఱచి శంకిలక సంకేతస్థలంబులఁ గృష్ణాగమ తత్పరలయి యున్న గోపకామినులును; గోష్ఠప్రదేశంబుల గోవులకుఁ గ్రేపుల విడిచి యొడ్డుచు, మరలం గట్టుచు, నీడ్చుచుం, గ్రీడించు గోపకులును; గోఖుర సముద్ధూత కరీష పరాగ పటలంబుల వలన నుల్లారి దులదుల నైన ధేనుదోహనవేళా వికీర్ణ పయోబిందు సందోహ పరంపరా సంపాదిత పంకంబులును; దోహనసమయ గోపకరాకృష్ట గోస్తన నిర్గతంబు లయి కలశంబులందుఁ బడియెడు క్షీరధారల చప్పుళ్ళును; మహోక్షకంఠ సంస్పర్శనస్నిగ్ధంబు లయిన మందిరద్వార దారుస్తంభంబుల పొంతలనుండి యులికిపడి నలుదిక్కులు గనుంగొని నూతనజనవిలోన కుపితంబులయి కరాళించు సారమేయంబులునుఁ గలిగి బలకృష్ణబాహుదండ ప్రాకారరక్షా విశేభూషంబైన ఘోషంబు బ్రవేశించి; యందు.

భావము:
అక్రూరుడు బృందావనంలో ప్రవేశించాడు సంధ్యా సమయం కావడంతో దూడలూ కోడెలూ తొలిచూలు గేదెలూ గుంపులు గుంపులుగా మేతకైవెళ్ళి అక్కడి పచ్చని పచ్చికలు మేస్తూ ఎంతకూ ఇంటికి మరలిరాకపోతే వాటిని వెదకుటకోసం పోయి పొదలు మరుగులూ మిట్టపల్లాలు లెక్కింపక పొదలలో దూరి పరిగెత్తుతూ వెదుకులాడి కనుపించక ఎలిగెత్తి పిలిచే గోపబాలుర సవ్వడి ఆలకించాడు. మెత్తని పచ్చిక మేసే కుతూహలంతో ఆగి అంతలో తమ లేగదూడలను తలచుకుని ఆలస్యం చేయకుండా మమకారంతో తమకు తామే అంభారావాలు చేస్తూ, పొదుగుల నుండి పాలుకార్చుకుంటూ, పరుగెత్తి వస్తున్న ఆవులను వీక్షించాడు. అప్పుడే పుట్టిన దూడలను అరకడ నుంచుకుని పలుపులు చేతపట్టుకుని క్రొత్తగా ఈనిన బాలెంత గోవులు వెంబడించగా మెల్లగా వెడుతున్న వల్లవులను చూసాడు. చిరుతలు, సివంగులు, పెద్ద పులులు లాంటి క్రూరజంతువుల బారిన పడకుండా జాగరూకలై మందకు రెండు వైపులా గండ్రగొడ్డళ్ళు, ఈటెలూ, విల్లులు పట్టుకుని కావలికాస్తున్న కాపరులను దాటి ముందుకు సాగాడు. అక్కడ రకరకాలైన మిసిమిగల కసవులు మేసి బలిసి కొట్టాలలో చేరి ఆవులు మెల్లగా నెమరువేస్తున్నాయి. దూడలు పాలు గుడిచి తల్లుల యెదుటే చెలరేగి చెంగు చెంగున దుముకుతున్నాయి. ఎదకు వచ్చిన ఆవులపై బడి దాటుతూ వృషభాలు ఎదురు నిలచి ఒకదానితో ఒకటి ఢీకొని కొమ్ములతో కుమ్ములాడుకుంటున్నాయి. ఆరునెలల వయసు గల దూడలు మొక్కవోని బలంతో మెడ పలుపులు త్రెంచుకుని పొదలు దూకి కుప్పించి దూకుతూ తల్లిపొదుగులను పొడిచి పొడిచి పాలు కుడుస్తున్నాయి. వాటిని అదలించి ఇవతలకు పట్టి ఈడువ లేక పిల్లలు పెద్దలను పిలుస్తున్నారు. కొడుకులను భర్తలను మామలను మరదులను మరపించి మన్మథశర పీడితలై గొల్లమగువలు ఇంటిపనులు మరచి జంకు వదలి సంకేత ప్రదేశాలకు చేరి కృష్ణుడి రాక కోసం వేచి ఉన్నారు. గోపకులు పసులకొట్టాలలో ఆవులకు దూడలను విడుస్తూ తిరిగి కట్టి వేస్తూ మరల పట్టి ఈడుస్తూ క్రీడిస్తున్నారు. ఆవుల గిట్టల వలన పొడి పొడియై వ్యాపించిన ఎండు పేడ దుమ్ము గోవులను పితికేటప్పుడు చెదిరిన పాల తుంపరల మొత్తముచే తడిసి అణిగిపోయి అడుసుగా మారింది. గోపాలుకులు పాలు పిండేటప్పుడు ఆవుల చనుల నుండి చెంబుల లోనికి కారే క్షీరధారలు జుంజుమ్మని చప్పుడు చేస్తున్నాయి. ఆబోతులు మెడ దురద తీర్చుకోవడానికి ఒరసికొనగా నునుపారిన గృహద్వారసీమలోని స్తంభాల సమీపాన ఉన్న కుక్కలు ఉలికిపడి క్రొత్త వారిని చూసి కోపంతో మొఱుగుతున్నాయి. ఆ గొల్లపల్లె బలరామకృష్ణులు భుజదండములనే ప్రాకారంతో పరిరక్షింపబడుతూ ఉన్నది. అక్రూరుడు సాయంసంధ్యా సమయంలో అలాంటి వ్రేపల్లె ప్రవేశించాడు. అలా ప్రవేశిస్తూనే అక్కడ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=137&padyam=1199

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, September 1, 2020

శ్రీ కృష్ణ విజయము - 19

( అక్రూరుడు బృందావనం గనుట )

10.1-1198-క.
ముందటఁ గనె ఘనచందన
కుంద కుటజ తాల సాల కురవక వట మా
కందన్ నందితబల గో
విందన్ వికచారుణారవిందన్ బృందన్.

భావము:
అలా వెళ్ళివెళ్ళి అక్రూరుడు; మంచిగంధం, మొల్ల, మల్లె, తాడి, మద్ది, గోరంట, మఱ్ఱి, మామిడి మొదలైన పెద్ద చెట్లూ, వికసించిన ఎఱ్ఱతామరలు కలిగి బలరామ శ్రీకృష్ణులను సంతసింప చేసేది అయిన బృందావనమును తన ఎదుట కనుగొన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=137&padyam=1198

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

శ్రీ కృష్ణ విజయము - 18

( అక్రూరుడు వ్రేపల్లెకు వచ్చుట )

10.1-1196-ఉ.
మాపటివేళ నేను చని మాధవుపాదసమీప మందు దం
డాపతితుండనైన నతఁ డాశుగకాలభుజంగవేగ సం
తాపిత భక్తలోక భయ దారణమైన కరాబ్జ మౌదలన్
మోపి హసించి నా కభయముం గృపతోడుత నీయకుండునే?"
10.1-1197-వ.
అని మఱియు నక్రూరుం డనేకవిధంబుల గోవింద సందర్శనంబు గోరుచు నమంద గమనంబున సుందర స్యందనారూఢుండయి చని చని.

భావము:
సాయంకాలం అయ్యేసరికి నేను వెళ్ళి శ్రీకృష్ణుడి పాదాల దగ్గర చేరి సాగిలపడి నమస్కరిస్తాను. ఆయన గబగబ పరుగెత్తే కాలమనే సర్పానికి తల్లడిల్లిపోయే భక్తుల భయాన్ని తొలగించే తన కరకమలాన్ని నా తలపై పెట్టకపోతాడా. చిరునవ్వులు చిందిస్తూ కరుణతో నాకు అభయ ప్రదానం ఇవ్వకపోతాడా.” ఇలా రకరకాలుగా అక్రూరుడు గోపాలకృష్ణుడి సందర్శనం కోరుకుంటూ రథము ఎక్కి వేగంగా ప్రయాణం చేసి వెళ్ళి వెళ్ళి....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=136&padyam=1196

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :