Friday, December 28, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 82

10.1-580-వ.
దేవా! నీకుఁ గల్పపర్యంతంబు నమస్కరించెద”నని యివ్విధంబున సంస్తుతించి ముమ్మాఱు వలగొని పాదంబులపైఁ బడి వీడ్కొని బ్రహ్మ తన నెలవునకుం జనియె; నతని మన్నించి భగవంతుండైన హరి తొల్లి చెడి తిరిగి వచ్చిన వత్సబాలకులం గ్రమ్మఱం గైకొని పులినంబుకడఁ జేర్చె; నిట్లు.
10.1-581-క.
క్రించు దనంబున విధి దము
వంచించిన యేఁడు గోపవరనందను లొ
క్కించుక కాలంబుగ నీ
క్షించిరి రాజేంద్ర! బాలకృష్ణుని మాయన్.


భావము:
ఓ భగవంతుడా! నా ఆయుర్దాయం ఈ కల్పాంతం వరకూ ఉంది కదా. అంత వరకూ నీకు నమస్కరిస్తూనే ఉంటాను.” అని స్తుతించి బ్రహ్మదేవుడు మూడుసార్లు కృష్ణుడికి ప్రదక్షిణం చేసి, పాదాలకు మ్రొక్కి, సెలవు తీసుకుని తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు అతనిని క్షమించి గౌరవించాడు. ఇంతకు ముందు మాయమై తిరిగి వచ్చిన దూడలను, బాలకులను మళ్ళీ ఇసుక తిన్నెల వద్దకు చేర్చాడు.ఈ విధముగా మహారాజా! ఈవిధంగా బ్రహ్మదేవుడు అల్పత్వంతో మోసగించి తమను దాచిపెట్టిన ఏడాది కాలాన్ని కృష్ణుని మాయ కారణంగా గోపబాలకులు కొద్దిసేపుగా భావించారు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: