Sunday, December 30, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 84

10.1-585-వ.
ఇట్లు బాలకులతోడఁ జల్ది గుడిచి వారలకు నజగర చర్మంబు చూపుచు వనంబున నుండి తిరిగి.
10.1-586-పంచ.
ప్రసన్నపింఛమాలికా ప్రభావిచిత్రితాంగుఁడుం
బ్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధ లోకుఁడుం
బ్రసన్న గోప బాలగీత బాహువీర్యుఁ డయ్యు ను
ల్లసించి యేగె గోపకుల్ జెలంగి చూడ మందకున్.


భావము:
అలా కృష్ణుడు వారితో చల్దులు తిని వనంలో నుండి తిరిగి వస్తుంటే, వారికి కొండచిలువ చర్మం చూపాడు. శ్రీ కృష్ణుడు తలలో అడవిపూలు నెమలిపింఛము ధరించాడు. వాటి రంగురంగుల కాంతులు అంతటా ప్రసరించి అతని శరీరభాగాలను అలంకరిస్తున్నాయి. కృష్ణుని కొమ్ముబూర మోత, అతని వేణుగానం అందరికీ పరిచయమైనవి. అవి వినపడగానే లోకమంతా పరవశం చెంది ఆకర్షించబడుతుంది. గోపబాలురు సంతోషంతో అతని బాహుబలాన్ని స్తోత్రం చేసారు. కృష్ణుడు గోపబాలురతో కూడి ఉల్లాసంతో మందకు చేరుకుంటూ ఉంటే గోపకు లందరూ సంతోషంతో వారిని ఆదరించారు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: