Tuesday, December 11, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 70

10.1-561-మ.
వినుమో; యీశ్వర! వెల్పలన్ వెలుఁగు నీ విశ్వంబు నీ మాయ గా
క నిజంబైన యశోద యెట్లుగనియెం? గన్నార నీ కుక్షిలోఁ
గనెఁ బోఁ గ్రమ్మఱఁ గాంచెనే? భవదపాంగశ్రీఁ బ్రపంచంబు చ
క్కన లోనౌ; వెలి యౌను; లోను వెలియుం గాదేఁ దదన్యం బగున్;
10.1-562-మ.
ఒకఁడై యుంటివి; బాలవత్సములలో నొప్పారి తీ వంతటన్
సకలోపాసితులౌ చతుర్భుజులునై సంప్రీతి నేఁ గొల్వఁగాఁ
బ్రకటశ్రీ గలవాఁడ వైతి; వటుపై బ్రహ్మాండముల్ జూపి యొ
ల్లక యిట్లొక్కఁడవైతి; నీ వివిధ లీలత్వంబుఁ గంటిం గదే?


భావము:
ఓ శ్రీకృష్ణ ప్రభూ! వెలుపల కనిపిస్తున్న ఈ విశ్వం అంతా నీ మాయకాక నిజమే అయినట్లయితే, యశోద కనులారా నీ కడుపులో ఈ విశ్వాన్ని ఎలా చూడగలిగింది? చూసిందే అనుకో, మళ్లీ ఏనాడైనా చూడగలిగిందా? నీ కడగంటిచూపుతో ఈ ప్రపంచమంతా నీ లోపలది అవుతుంది; నీ బయటది అవుతుంది; లోపల వెలుపల కాకపోతే మూడవది అవుతుంది; లోపలా వెలుపలా కూడా అవుతుంది. మొదట నీవు ఒక్కడవే ఉన్నావు; తరువాత గోపబాలురలో లేగలలో వెలుగొందేవు; ఆ తరువాత అందరిచేత నమస్కారాలు అందుకుంటున్న చతుర్భుజులైన విష్ణువుల రూపాలలో కనిపించి నన్ను ఆనందపరచి నీ వైభవాన్ని చక్కగా ప్రదర్శించావు; ఆ తరువాత బ్రహ్మాండాలన్నీ చూపించావు; తరువాత అది కాదని మళ్లీ ఇప్పుడు ఇలా ఒక్కడివిగా కనిపిస్తున్నావు; ఆహ! ఏమి నా భాగ్యం? ఇన్నాళ్ళకు ఇన్నిరకాల నీ లీలలు చూసాను.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: