Thursday, December 6, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 65

10.1-554-క.
తారా తుషార శీకర
భూరజములకైన లెక్క బుధు లిడుదురు; భూ
భారావతీర్ణకరుఁ డగు
నీ రమ్యగుణాలి నెన్న నేర రగణ్యా!
10.1-555-శా.
ఏ వేళం గృపఁ జూచు నెన్నఁడు హరిన్ వీక్షింతు నం చాఢ్యుఁడై
నీ వెంటంబడి తొంటి కర్మచయమున్ నిర్మూలముం జేయుచున్
నీ వాఁడై తను వాఙ్మనోగతుల నిన్ సేవించు విన్నాణి వో
కైవల్యాధిపలక్ష్మి నుద్దవడిఁ దాఁ గైకొన్నవాఁ డీశ్వరా!


భావము:
ఓ గణనాతీతా! శ్రీకృష్ణా! ఆకాశంలో మెరిసే తారలను, మంచు తుంపరలను, భూమి మీది ధూళి కణాలను అయినా లెక్కించడం సాధ్యం కావచ్చు. కాని భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన నీ మనోహరమైన గుణాలను ఎంతటి పండితులూ లెక్కపెట్టలేరు. నీవు అన్ని లెక్కలకూ పైనున్నవాడవు కదా. సర్వేశ్వరా! శ్రీకృష్ణా! నన్ను ఏనాటికి దయతో చూస్తాడో ఎప్పుడు నేను శ్రీహరిని చూడగలుగుతానో అనే ఆర్తితో ఉన్నవాడు నిజమైన సంపన్నుడు. అట్టి నీ భక్తుడు నీ వెంటపడాలి. ఆ మార్గంలో ప్రయాణం సాగిస్తూ తన పూర్వకర్మల మొత్తాన్ని మొదలంటా తొలగించుకొని, నీ వాడు కావాలి. మనస్సుతోను, వాక్కుతోను, చేష్టలతోను నిన్నే సేవించాలి. అతడు నిజమైన నేర్పరి. అటువంటి నేర్పరికి గాని మోక్షలక్ష్మిని పూర్తిగా అందుకోవడం సాధ్యం కాదు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: