10.1-572-సీ.
ఏకదశేంద్రియాధీశులు చంద్రాదు;
లేను ఫాలాక్షుండు నిట్లు గూడఁ
బదుమువ్వురము నెడపడక యింద్రియ పాత్ర;
ముల నీ పదాంభోజముల మరంద
మమృతంబుగాఁ ద్రావి యమర నేకైకేంద్రి;
యాభిమా నులుమయ్యు నతి కృతార్థ
భావుల మైతిమి; పరఁగ సర్వేంద్రియ;
వ్యాప్తులు నీ మీఁద వాల్చి తిరుగు
10.1-572.1-తే.
గోప గోపికాజనముల గురు విశిష్ట
భాగ్య సంపదఁ దలపోసి ప్రస్తుతింప
నలవిగా దెవ్వరికి నైన నంబుజాక్ష!
భక్తవత్సల! సర్వేశ! పరమపురుష!
భావము:
సర్వేశ్వరా! పరమపురుషా! పుండరీకాక్షా! చంద్రుడు మొదలైన పదకొండు ఇంద్రియాలకు అధిపతులు, నేను, శివుడు ఈ ముగ్గురమే నీ యందు ఏమరుపాటు చెందకుండా ఉన్న వారము. మేము మా మా ఇంద్రియాలు అనే పాత్రలలో నీ పాదపద్మముల నుండి పుట్టిన మకరందాన్ని అమృతం వలె త్రాగుతున్నాము. కనుకనే ఒక్కక్క ఇంద్రియానికి వేరువేరుగా అధిపతులం అయ్యాము. ఎంతో ధన్యులం అయ్యాము. అలాంటిది అన్ని ఇంద్రియాల ప్రవృత్తులూ నీ పైననే ఉంచుకో గలుగుతున్న గోపికల భాగ్యం ఎంత గొప్పదో ఎంత విశిష్ట మైందో దానిని గురించి ఆలోచించడానికి గాని స్తోత్రం చేయడానికి గాని ఎవరికీ సాధ్యం కాదు. నీవు భక్తుల యెడల వాత్సల్యం కలవాడవు కనుకనే గోపగోపికా జనాలకు ఇంతటి భాగ్యం లభించింది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=572
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment