Sunday, December 23, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 78

10.1-573-శా.
ఏలా బ్రహ్మపదంబు? వేదములకున్ వీక్షింపఁగారాని ని
న్నీలోకంబున నీ వనాంతరమునం దీ మందలోఁ గృష్ణ యం
చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ
వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్ఠించినం జాలదే?
10.1-574-మ.
నిను హింసించిన పూతనాదులకు మున్ నీ మేటి సంకేత మి
చ్చిన నీకుం బుర దార పుత్ర గృహ గో స్త్రీ ప్రాణ దేహాదు లె
ల్లను వంచింపక యిచ్చు గోపకులకున్ లక్షింప నే మిచ్చెదో? 
యని సందేహము దోఁచుచున్నది ప్రపన్నానీకరక్షామణీ!


భావము:
వేదాలు నిన్నుగురించి చెబుతాయే గాని. నిన్ను దర్శించ లేవు కదా. అటువంటి నిన్ను ఈ భూలోకంలో ఈ అడవిలో ఈ గోకులంలో సహచరుడుగా పొందగలిగారు. ఈ గోపకులు “కృష్ణా! కృష్ణా!” అంటూ మాటల దగ్గర నుంచీ అన్ని భావాలు నీ యందే సమర్పించుకుంటున్నారు. ఈ గొల్లలలో ఒక్కడి పాదరేణువులలో ఒక్క కణం నా శిరస్సు పైన ధరించగలిగితే చాలదా? ఈ బ్రహ్మ పదవి ఎందుకయ్యా నాకు. భక్తులకు అందరికి రక్షామణివైన ఓ కృష్ణా! నిన్ను చంప దలచి వచ్చిన పూతన మొదలైన రాక్షసులకే అద్భుతమైన మోక్షాన్ని ప్రసాదించావు. అటువంటి నీకు గోపకు లందరూ తమ ఊరిని, భార్యలను, పుత్రులను, ఇండ్లను, గోవులను, స్త్రీలను, ప్రాణాన్ని, శరీరం మొదలైన వాటిని అన్నింటినీ సందేహం లేకుండా సమర్పణ చేసుకున్నారు. అటువంటి వారికి ఆ మోక్షం కన్నా ఇంకా ఎక్కువైనది ఏమి ఇస్తావో అని నాకు సందేహం కలుగుతూ ఉంది.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: