Saturday, December 8, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 67

10.1-557-సీ.
సర్వేశ! నే రజోజనితుండ; మూఢుండఁ; 
బ్రభుఁడ నేనని వెఱ్ఱి ప్రల్లదమున
గర్వించినాఁడను; గర్వాంధకారాంధ; 
నయనుండ గృపఁజూడు ననుఁ; బ్రధాన
మహదహంకృతి నభో మరుదగ్ని జల భూమి; 
పరివేష్టితాండకుంభంబులోన
నేడు జేనల మేన నెనయు నే నెక్కడ? ;
నీ దృగ్విధాండంబు లేరి కైన
10.1-557.1-తే.
సంఖ్య జేయంగ రానివి; సంతతంబు
నోలిఁ బరమాణవుల భంగి నొడలి రోమ
వివరముల యందు వర్తించు విపులభాతి
నెనయుచున్న నీ వెక్కడ? నెంతకెంత?


భావము:
సర్వేశ్వరా! కృష్ణా! నేను రజోగుణము నుండి జనించిన వాడను. కనుక మోహం చెంది ఉన్నాను. నేనే ప్రభువును అనుకుని వెర్రి అహంకారంతో గర్వించాను. గర్వం అనే చీకటితో నా కన్నులు చీకట్లు క్రమ్మాయి. ప్రధాన పురుషుడు అతని చుట్టూ మహత్తు అహంకారము ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఇలా ఒకదాని చుట్టూ మరియొకటి ఆవరించి యున్న బ్రహ్మాండంలో ఏడుజానల పొడవున్న నేనెంతవాడను? ఎవరికీ లెక్కించనలవి కానన్నిఇలాంటి బ్రహ్మాండాలు కల బ్రహ్మాండ భాండాలు ఎన్నింటినో నిత్యమూ ఒకదానివెంట ఒకటిగా నీ శరీరంలోని రోమకూపాలలో పరమాణువులుగా ధరిస్తూ ఉన్న నీవెక్కడ? నేనెక్కడ? ఎక్కడి కెక్కడికి పోలిక?



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: