Thursday, December 27, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 81

10.1-578-క.
సర్వము నీవ యెఱుంగుదు
సర్వవిలోకనుఁడ వీవ; జగదధిపతివిన్; 
సర్వాపరాధి నను నో! 
సర్వేశ! యనుగ్రహింపు; చనియెద నింకన్.
10.1-579-క.
జిష్ణు! నిశాటవిపాటన! 
వృష్ణికులాంభోజసూర్య! విప్రామర గో
వైష్ణవ సాగర హిమకర! 
కృష్ణా! పాషండధర్మగృహదావాగ్నీ!

భావము:
సర్వేశ్వరా! శ్రీకృష్ణా! సర్వం నీవే ఎరుగుదువు. నీవు అన్నీ చూడగలిగిన వాడవు. ఈ జగత్తు అంతటికీ అధిపతివి నీవే. అన్ని విధాలైన అపచారాలు చేసిన నన్ను మన్నించి అనుగ్రహించు. నేనింక సెలవు తీసుకుంటాను. కృష్ణా! నీవు సాక్షాత్తూ విష్ణుమూర్తివి; రాక్షసులను సంహరించడానికి అవతరించావు; వృష్ణి కులము అనే తామరపూవును వికసింప జేసే సూర్యుడవు నీవు; బ్రాహ్మణులు, దేవతలు, గోవులు, విష్ణుభక్తులు అనే పాలసముద్రంలో ప్రభవించి వారిని సంతోషింప జేసి చల్లగా చూసే చంద్రుడవు నీవు; ఈ అవతారంలో ప్రత్యేకంగా వేదాలకు విరుద్ధమైన పాషండధర్మం అనే ఇంటిని దహించే అగ్నిహోత్రుడవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=579

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: