Friday, December 21, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 75

10.1-569-శా.
దేవా! నీ చరణప్రసాదకణలబ్ధిం గాక లేకున్న నొం
డేవెంటం జను నీ మహామహిమ నూహింపంగ నెవ్వారికిన్? 
నీ వారై చనువారిలో నొకఁడనై నిన్ గొల్చు భాగ్యంబు నా
కీవే యిప్పటి జన్మమం దయిన నొం డెం దైన నో! యీశ్వరా!
10.1-570-త.
క్రతుశతంబునఁ బూర్ణ కుక్షివి; గాని నీ విటు క్రేపులున్
సుతులునై చనుఁబాలు ద్రావుచుఁ జొక్కి యాడుచుఁ గౌతుక
స్థితిఁ జరింపఁగఁ దల్లులై విలసిల్లు గోవుల గోపికా
సతుల ధన్యత లెట్లు చెప్పగఁ జాలువాఁడఁ గృపానిధీ!

భావము:
ఓ శ్రీకృష్ణ ప్రభూ! నీ మహోన్నత మహిమను ఊహించా లంటే నీ పాద ధూళికణ ప్రాప్తి వలన మాత్రమే సాధ్యం తప్ప మరి ఎవరికి సాధ్యం కాదు. నీవారుగా జీవించ గల ధన్యులలో నేను ఒకడిగా ఉండి నిన్ను సేవించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో నైనా సరే ఆ మహాభాగ్యం నాకు ప్రసాదించు. ఓ కృపానిధీ! కృష్ణా! నీవు యజ్ఞపురుషుడవు; వందల కొద్దీ యజ్ఞాలు నీ కడుపులో దాగి ఉన్నాయి; అయినా నీవు ఈ విధంగా లేగలుగా, గోపాలురుగా రూపాలు ధరించి ఉన్నావు; గోవుల వద్ద గోపికల వద్ద నీవు పాలు త్రాగి పరవశిస్తూ, ఆటలుఆడుతూ, ఎంతో ఉత్సాహంతో సంచరిస్తున్నావు; నీకు తల్లులు కాగలిగిన ఆ గోవులు గోపికలు ఎంత పుణ్యం చేసుకున్నారో ఎలా చెప్పగలను; నీవు కరుణామయుడవు కనుకనే ఆ గోవులు గోపికలు అంత ధన్యత్వాన్ని అందుకోగలిగారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=74&padyam=570

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: