Monday, December 10, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 69

10.1-560-సీ.
నళినాక్ష! నీ వాది నారాయణుండవు; 
జలము నారము జీవచయము నార
మందు నీవుంట నీ యం దవి యుంటను; 
నారాయణుండను నామ మయ్యె
సకల భూతములకు సాక్షి వధీశుండ; 
వబ్ధి నిద్రించు నారాయణుఁడవు
నీ మూర్తి యిది నీకు నిజమూర్తి యనరాదు; 
నళిననాళము త్రోవ నడచి మున్ను
10.1-560.1-తే.
కడఁగి నూఱేండ్లు వెదికి నేఁ గాననయితి
నేకదేశస్థుఁడవు గా వనేక రుచివి
జగములోనుందు; నీలోన జగములుండు
నరుదు; నీ మాయ నెట్లైన నగుచు నుండు.


భావము:
తామరరేకులవంటి కన్నుల కలవాడా! కృష్ణా! నీవు త్రిమూర్తులకూ మూలమైన ఆదినారాయణుడవు. జలములు, జీవరాసులు నారములు అని పిలవబడతాయి. నారములలో నీవు ఉండడం చేత, నీ యందు అవి ఉండడంచేతా నీకు నారాయణుడు అనే పేరు మేము పెట్టుకున్నాం. భూతములు జీవరాశులు సర్వం వస్తూ పోతూ ఉంటే, నీవు సాక్షిగా ఉంటావు. నీవు వాటికి అన్నింటికీ అధిష్టానమైన ఈశ్వరుడవు. సముద్రంలో నిద్రించే నారాయణా అదే నీ నిజమైన రూపం అనడానికీ వీలులేదు. నేను పూర్వం తామరతూడు లోపల పయనిస్తూ నూరేండ్లు వెదకినా నీ అసలు రూపం ఏమిటో చూడలేకపోయాను కదా. నీవు ఒకచోట ఉంటావు అనడానికీ వీలులేదు. నీవు ఎన్నో రూపాలు కాంతులు కలవాడవు. సృష్టిలో నీవు ఉంటావు నీ లోపల సృష్టి ఉంటుంది. నీ మాయాప్రభావంతో ఏ విధంగా నైనా ఉండగలవు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: