Sunday, September 16, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 14

10.1-455-వ.
అంత నొక్కనాఁడు రామకృష్ణులు కాంతారంబున బంతిచల్దులు గుడువ నుద్యోగించి ప్రొద్దున లేచి, గ్రద్దనం దమ యింటి లేఁగకదుపులం గదలించి, సురంగంబులగు శృంగంబులు పూరించిన విని, మేలుకని, సంరంభంబున గోపడింభకులు చలిది కావడులు మూఁపున వహించి, సజ్జంబులగు కజ్జంబులు గట్టుకొని పదత్రాణ వేత్రదండంధరులయి, లెక్కకు వెక్కసంబైన తమతమ క్రేపుకదుపులం జప్పుడించి రొప్పుకొనుచు, గాననంబు జొచ్చి, కాంచనమణి పుంజగుంజాది భూషణ భూషితులయ్యును, ఫల కుసుమ కోరక పల్లవ వల్లరులు తొడవులుగా నిడుకొని, కొమ్ములి మ్ముగఁ బూరించుచు వేణువు లూఁదుచుఁ, దుమ్మెదలం గూడి పాడుచు, మయూరంబులతోడం గూడి యాడుచుఁ, బికంబులం గలసి కూయుచు, శుకంబులం జేరి రొదలు జేయుచుఁ, బులుగుల నీడలం బాఱుచుఁ, బొదరిండ్లం దూఱుచు సరాళంబులగు వాఁగులు గడచుచు, మరాళంబుల చెంత నడచుచు, బకమ్ములం గని నిలుచుచు, సారసంబులం జోపి యలంచుచు, నదీజలంబులం దోఁగుచుఁ, దీగె యుయ్యెలల నూఁగుచు, బల్లంబులం డాఁగుచు, దూరంబుల కేగుచుఁ, గపుల సంగడిఁ దరువులెక్కుచు ఫలంబులు మెక్కుచు రసంబులకుంజొక్కుచు నింగికి న్నిక్కుచు నీడలు చూచి నవ్వుచుఁ, గయ్యంబులకుం గాలుదువ్వుచు, చెలంగుచు, మెలంగుచు, వ్రాలుచు, సోలుచు బహుప్రకారంబుల శరీర వికారంబులు జేయుచు మఱియును.

భావము:
ఒకరోజు బలరామకృష్ణులు గోపబాలురు అందరూ కలసి వనభోజనాలు చేయాలని సరదాపడ్డారు. ప్రొద్దుటే లేచి గబగబ తమ ఇంటి లేగదూడలను బయటకి తొలుకుని వచ్చారు. అందమైన కొమ్మూబూరలను పూరించి ఊదగానే మిగిలిన గోపకుమారులు అందరూ మేల్కొన్నారు. చల్దిఅన్నం కావడులను భుజాలకు తగిలించుకున్నారు. తల్లులు సిద్ధం చేసి ఉంచిన రకరకాల పిండివంటలు మూటలు కట్టుకున్నారు. కాళ్లకు చెప్పులు చేతికి కఱ్ఱలు ధరించారు. లెక్కపెట్టడానికికూడా కష్టం అనిపించే తమతమ లేగల మందలను “హెహెయ్” అనే కేకలతో తోలుకుంటూ బయలుదేరారు. పరుగులతో ఆయాసపడుతూ అడవిలో ప్రవేశించారు. బంగారు మణిభూషణాలు ధరించి ఉన్నా పూలను చివుళ్ళను చిన్నచిన్న పండ్లను అలంకారాలుగా ధరించారు. కొమ్ముబూరాలు పూరిస్తూ; పిల్లనగ్రోవులు ఊదుతూ; తుమ్మెదల తోపాటు ఝమ్మని పాడుతూ; నెమళ్ళతో సమానంగా నాట్యంచేస్తూ; కోకిలలను మిగిలిన పక్షులను అనుకరిస్తూ; చిలుకల తోపాటు అరుస్తూ కేరింతలు కొట్టారు; పైన పక్షులు ఎగురుతుంటే వాటి నీడల తోపాటు తామూ పరిగెత్తారు; జలజలపారే సెలయేళ్ళను చెంగున దూకారు; హంసలను అనుసరిస్తూ వెళ్ళారు; కొంగల తోపాటు ఒంటికాలిపై నిలపడ్డారు; బెగ్గురు పక్షులను తరమితరిమి కొట్టారు; గోతులలో దాక్కున్నారు; తీగల ఊయలు లూగేరు; దూరాలకు పరుగు పందాలు వేసుకున్నారు; కోతులతో చెట్లు ఎక్కారు; పండ్లుతిని వాటి రసాలకు పరవశించిపోయారు; కుప్పించి దూకి తమ నీడలను చూసి నవ్వుకున్నారు; ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు; అలా కేరింతలు కొడుతూ ఎన్నో రకాల ఆటలు ఆడుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=65&padyam=455

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: