Saturday, September 8, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 12

10.1-451-వ.
అప్పు డా నందనందనుమీఁద వేలుపులు చాలపులుగా నందన మల్లికాది కుసుమవర్షంబులు హర్షంబునం గురియించిరి; దేవవాద్యంబులు మొరసె; రామాది గోపకుమారులు ప్రాణంబులతోఁ గూడిన యింద్రియంబులునుం బోలెఁ గ్రమ్మఱ కృష్ణునిం గని రమ్మని కౌఁగిలించుకొని కృష్ణసహితులయి లేఁగదాఁటుల మరల దాఁటించుకొని మందగమనంబున మంద కరిగిరి; వారలచేత నా వృత్తాంతం బంతయు విని వెఱంగుపడి గోపగోపికాజనంబులు.
10.1-452-క.
“ఆపదలమీఁద నాపద
లీ పాపనిఁ జెంది తొలఁగె; నీ యర్భకుపై
వే పడిన ఖలులు దహనుని
వైపున శలభముల పగిదిఁ బడిరి ధరిత్రిన్.”

భావము:
అలా బకాసురుని చంపగానే కృష్ణుడి మీద దేవతలు సంతోషంగా రకరకాల పూలవానలు కురిపించారు. ఆకాశంలో దుందుభి ధ్వనులు వినిపించాయి. ప్రాణాలు రాగానే ఇంద్రియాలుకూడా ఎలా సచేతనాలు అవుతాయో అలాగే బలరాముడు మొదలైన గోపకుమారులు అందరూ బ్రతికిపోయామని సంతోషించారు. “బ్రతికి వచ్చావా కృష్ణా!” అంటూ అతణ్ణి కౌగలించుకున్నారు. అందరూ కలసి మందలను మళ్లించుకుని నెమ్మదిగా తమ ఇండ్ల వద్దకు చేరుకున్నారు. బకాసురవధను గురించిన కధ అంతా వారు చెప్పగా గోకులంలోని గోపగోపికాజనాలు విని నివ్వెరపోయారు. “ఈ లేతపాపనికి ఆపదలపై ఆపదలు వచ్చినట్లే వచ్చి తొలగిపోయాయి. పసివాడు కదా అని కృష్ణుడిపైకి విజృంభించిన దుర్మార్గులు ఎవరైనా సరే అగ్నిలో పడిన మిడతలలాగా భస్మమైపోయారు”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=62&padyam=452

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: