10.1-467-వ.
అని నిశ్చయించి, యోజనంబు నిడుపును, మహాపర్వతంబు పొడుపును, గొండతుదల మీఱిన కోఱలును, మిన్నుదన్ని పన్నిన నల్ల మొగిళ్ళ పెల్లుగల పెదవులును, బిలంబులకు నగ్గలంబు లయిన యిగుళ్ళ సందులును, నంధకారబంధురంబయిన వదనాంతరాళంబును, దావానల జ్వాలాభీలంబయిన దృష్టిజాలంబును, వేఁడిమికి నివాసంబులయిన యుచ్ఛ్వాస నిశ్వాసంబులును మెఱయ, నేల నాలుకలు పఱచుకొని ఘోరంబగు నజగ రాకారంబున.
10.1-468-క.
జాపిరము లేక యిప్పుడు
గ్రేపుల గోపాలసుతులఁ గృష్ణునితోడన్
గీపెట్టఁగ మ్రింగెద నని
పాపపు రక్కసుఁడు త్రోవఁ బడి యుండె నృపా!
భావము:
అని నిశ్చయించుకున్న అఘాసురుడు ఘోరమైన కొండచిలువ రూపాన్ని ధరించాడు. ఆ కొండచిలవ యోజనం పొడుగుతో, మహాపర్వతమంత పెద్దగా ఉంది. దాని కోరలు పర్వతశిఖరాలను మించిపోయి ఉన్నాయి. నల్లని మేఘాల వంటి పెదవులు తెరచి ఉండగా పైపెదవి అకాశాన్ని, క్రిందపెదవి నేలని తన్నుతున్నట్లు ఉంది. దాని కోరల మధ్యన ఉన్న సందులు పర్వత గుహల వలె ఉన్నాయి. అంధకార బంధురమైన నోటితో భయంకరంగా ఉంది. దాని చూపుల నుండి అగ్నిజ్వాలలు భీకరంగా వెలువడుతున్నాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసములు భరించలేనంత వేడిగా నిప్పులు కురిపిస్తున్నాయి. ఆ రాకాసి కొండచిలువ నాలుకలు నేల మీద పరచుకుని పడుకుని ఉంది. “గిలగిలా కొట్టుకునేలా చేసి ఈ గొల్లపిల్లలనూ. దూడలను కృష్ణుడితో పాటు కలిపి ఇప్పటికి ఇప్పుడే మింగేస్తాను.” అనుకుంటూ ఆ రాక్షసుడు దారిలో నోరు తెరుచుకుని పడుకుని ఉన్నాడు.
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment