Sunday, September 16, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 13

10.1-453-వ.
అని పలికిరి; మఱియు నా రామకృష్ణులు క్రేపులం గాచు తఱి.
10.1-454-సీ.
కపులమై జలరాశిఁ గట్టుదమా యని; 
కట్టుదు రడ్డంబు కాలువలకు; 
మునులమై తపములు మొనయుదమా యని; 
మౌనులై యుందురు మాటలేక; 
గంధర్వవరులమై గానవిద్యలు మీఱఁ; 
బాడుదమా యని పాడఁ జొత్తు; 
రప్సరోజనులమై యాడుదమా యని; 
యాఁడు రూపముఁ దాల్చి యాఁడఁ జనుదు;
10.1-454.1-ఆ.
రమర దైత్యవరులమై యబ్ధిఁ ద్రత్తమా
యని సరోవరముల యందు హస్త
దండచయముఁ ద్రిప్పి తరుతురు తమ యీడు
కొమరు లనుచరింపఁ గొమరు మిగుల. 


భావము:
ఆ రామకృష్టులు ఆ దూడలను మేపే వయసులో తోటి గోపకులు అలా అనుకున్నారు. ఆ బలరామకృష్ణులూ గోపాలబాలురూ దూడలను కాచే సమయాలలో రకరకాల ఆటలు ఆడుకునేవారు “మనం అందరం కోతుల మట సముద్రానికి వారధి కడదామా” అంటూ కాలువలకు అడ్డం కడుతూ ఉంటారు. “మనం మునులమట తపస్సు చేసుకుందామా” అంటూ కన్నులు మూసుకుని మునులవలె మౌనంగా ఉండి పోతారు. “మనం గంధర్వ శ్రేష్ఠుల మట. ఎవరు పాటలు బాగాపాడుతారో” అంటూ పాటలు పాడుతారు. “మనం అందరం అప్సరసలమట నాట్యం చేద్దామా” అంటూ నర్తకుల వేషాలు వేసుకుని నాట్యాలు చేస్తారు. “మేము దేవతలం; మీరు రాక్షసులు అట; సముద్రాన్ని మథించుదామా” అంటూ చెరువులలో చేరి చేతులతో నీళ్ళు చిలుకుతారు. బలరామకృష్ణులు ఏ పని చేస్తే మిగిలిన గోపకులు అందరూ వారినే అనుసరించి ఆ పనినే చేస్తారు. ఈ విధంగా రకరకాల ఆటపాటలతో వారందరూ అందరికీ ముద్దుగొలిపేటట్లు కన్నులకువిందు చేస్తూ ఉండేవారు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: