Thursday, September 20, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 15

10.1-456-క.
ఒకనొకని చల్దికావిడి
నొకఁ డొకఁ డడకించి దాఁచు; నొకఁ డొకఁ డది వే
ఱొక డొకని మొఱఁగికొని చను
నొక డొకఁ డది దెచ్చి యిచ్చు నుర్వీనాథా!
10.1-457-క.
ఒక్కఁడు ము న్నేమఱి చన
నొక్కఁడు బలుబొబ్బ వెట్టు నులికిపడన్; వే
ఱొక్కఁడు మిట్టి తటాలున
నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁగన్.


భావము:
ఓరాజా! ఒకతని చల్ది కావిడి మరొకతను అదిలించి లాక్కొని దాచేసాడు. ఇంకొకతను మరొకని అడ్డుపెట్టుకొని తీసుకుపోయాడు. మరింకొకతను ఆ కావిడిని తీసుకొచ్చి యిచ్చేసాడు. పరధ్యానంగా ఒక గోపకుమారుడు ముందు నడుస్తుంటే గమనించినవాడు, అత నులిక్కిపడేలా పెనుబొబ్బ పెట్టాడు. ఒక గోపడు మరొకని కళ్ళు వెనకనించి తటాలున మూసాడు. అది చూసి ఇంకొకడు పకపక నవ్వుతున్నాడు.


పద్య విశేషం:
అలతిపొలతి పదాలతో కళ్ళకు కట్టినట్టు చెప్పటంలో చెప్పుకొదగ్గ పోతన, తన భాగవతంలో అద్భుతంగా ఆవిష్కరించిన ఘట్టాలలో చల్దులు గుడుచుట ఒకటి. అలా మిక్కిలి ప్రసిద్దమైన యీ పద్యం ఆ ఘట్టంలోది.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: