Thursday, September 20, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 16

10.1-458-క.
తీపుగల కజ్జ మన్యుఁడు
కోపింపఁగ నొడిసి పుచ్చుకొని త్రోపాడం
బైపడి యది గొని యొక్కఁడు 
క్రేపులలో నిట్టునట్టుఁ గికురించు నృపా!
10.1-459-క.
వనజాక్షుఁడు ము న్నరిగిన
మునుపడఁగా నతని నేనె ముట్టెద ననుచుం
జని మునుముట్టనివానిన్
మునుముట్టినవాఁడు నవ్వు మొనసి నరేంద్రా!

భావము:
ఓ పరీక్షిన్మహారాజా! తియ్యటి పిండివంట ఒకడి చేతిలోంచి మరొకడు లాక్కుని పారిపోతున్నాడు. మొదటి వాడు ఉడుక్కున్నాడు. ఇంతలో ఇంకొకడు దానిని లాక్కుని పోయి, దూడల మధ్య అటు యిటు పరిగెడుతు ఏడిపించసాగాడు. మహారాజా! కృష్ణుడు ముందు వెళ్తుంటే, ఇద్దరు బాలకులు కృష్ణుణ్ణి “నేనే అంటే నేనే ముందు ముట్టుకుంటాను” అంటూ పరుగు లెత్తారు. ముందు ముట్టుకోగలిగినవాడు ముట్టుకోలేనివాడిని చూసి పకపక నవ్వాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=65&padyam=459

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: