Friday, September 7, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 11

10.1-449-శా.
కంఠోపాంతము దౌడలున్ మెఱముచుం గాలాగ్ని చందంబునం
గుంఠీభూతుఁడు గాక వేండ్రమగు నాగోపాలబాలున్ జయో
త్కంఠున్ బ్రహ్మగురున్ మహామహిముఁ జక్కంమ్రింగ రాదంచు సో
ల్లుంఠం బాడుచు వాఁడు గ్రక్కె వెడలన్ లోకం బశోకంబుగన్.
10.1-450-క.
క్రక్కి మహాఘోషముతోఁ
జక్కగఁ దనుఁ బొడువరాఁగఁ జంచులు రెండున్
స్రుక్కఁగఁ బట్టి తృణము క్రియ 
గ్రక్కున హరి చీరె బకునిఁ గలహోత్సుకునిన్.


భావము:
ఆ బకాసురుని కంఠం ముందు భాగమూ దౌడలూ కాలాగ్నివలె మండిస్తూ విజృంభించాడు కృష్ణుడు నిప్పుముద్దలాగ బకాసురుని కంఠానికి అడ్డుపడ్డాడు. అతడు విజయం సాధించే శీలంకలవాడు; బ్రహ్మదేవుడు అంతటివాడికి తండ్రి; అతడు మహా మహిమ గలిగినవాడు. అతడు మ్రింగుడుపడడం లేదని దీర్ఘంగా నిందిస్తూ, ఆ బకాసురుడు కృష్ణుణ్ణి మళ్లీ బయటకి వెళ్ళగ్రక్కాడు. అలా కృష్ణుడు బయటపడటం చూసి లోకం అంతా సంతోషించింది. ఆ విధంగా బయటికి క్రక్కివేసిన కృష్ణుణ్ణి ఆ కొక్కెర రక్కసి ముక్కుతో పొడిచి చంపేద్దామని భీకరంగా నోరు తెరచి ముందుకు దూకాడు. కలహానికి కాలు దువ్వే ఆ కొంగ ముక్కు రెండు భాగాలను కృష్ణుడు రెండు చేతులతో పట్టుకుని గడ్డిపరకను చీల్చినట్లు నిలువునా చీల్చేసాడు. .



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం :




No comments: