Monday, June 26, 2017

దక్ష యాగము - 73:

4-161-సీ.
తలపోయ నవిదిత తత్త్వవిజ్ఞానుండ; 
నైన నాచేత సభాంతరమున
నతి దురుక్త్యంబక క్షతుఁడ వయ్యును మత్కృ; 
తాపరాధము హృదయంబు నందుఁ
దలఁపక సుజన నిందాదోషమున నధో; 
గతిఁ బొందుచున్న దుష్కర్ము నన్నుఁ
గరుణఁ గాచిన నీకుఁ గడఁగి ప్రత్యుపకార; 
మెఱిఁగి కావింప నే నెంతవాఁడ?
4-161.1-తే.
నుతచరిత్ర! భవత్పరానుగ్రహాను
రూప కార్యంబుచేత నిరూఢమైన
తుష్టి నీ చిత్తమందు నొందుదువు గాక; 
క్షుద్రసంహార! కరుణాసముద్ర! రుద్ర!"

భావము:
క్షుద్రులను సంహరించే రుద్రా! దయా సముద్రా! నేను తత్త్వజ్ఞానం తెలియని మూర్ఖుడను. మహాసభలో నేను పలికిన చెడ్డ పలుకులు అనే ములుకులచేత నీవు గాయపడ్డావు. అయినా నేను చేసిన నేరాన్ని నీవు మనస్సులో పెట్టుకోలేదు. మహానుభావుణ్ణి నిందించిన పాపంచేత అధోగతికి పోవలసిన పాపాత్ముణ్ణి నన్ను దయతో కాపాడావు. నీకు తిరిగి ఉపకారం చేయటానికి నే నెంతవాణ్ణి? ఓ సచ్చరిత్రా! త్రినేత్రా! ఇతరులను అనుగ్రహించే కార్యాల మూలంగా కలిగే ఆనందాన్ని నీవు పొందుదువు గాక!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=161

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: